పైకి పొత్తు.. లోపల దూరం.. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా?

ఏ కాపురమైనా కలకాలం కొనసాగాలంటే.. ఆ కుటుంబంలోని సభ్యుల మధ్య సఖ్యత ఉండాలి. ఇదే రూల్ కూటములకూ వర్తిస్తుంది. 2014లో టీడీపీ+బీజేపీ+జనసేన కూటమిగా మారి.. విజయం సాధించి.. ఏపీలో అధికారంలోకి వచ్చాయి. కానీ.. 2019కి సీన్ మారింది. మూడు పార్టీలూ.. వేటికవే దారి వెతుక్కున్నాయి. దాంతో వైసీపీకి భారీ మెజార్టీ దక్కింది. ఇప్పుడు మళ్లీ కూటమి కట్టినా, 2019లో చేసిన పొరపాట్లు ఇప్పుడు ఆ పార్టీలను వెంటాడుతున్నాయి. అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు.. ఇద్దరూ బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. రెండు లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్.. ఈ దేశంలో ఉండేందుకు మోదీ అర్హుడు కాదని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు.

అనతికాలంలోనే పవన్ కళ్యాణ్ మారిపోయి.. మోదీకి సలాం కొట్టారు. ఎన్డీయేలో భాగస్వామి అయ్యారు. అటు మోదీ కూడా పవన్ క్రేజ్ చూసి.. ఆయన తీరు నచ్చి.. ఎన్డీయేలోకి జనసేనను తీసుకున్నారు. ఐతే.. చంద్రబాబు విషయంలో మాత్రం అది జరగనట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూడు పార్టీలూ కూటమిగా ఉన్నా.. ఎక్కడో తేడా కొడుతున్నట్లు కనిపిస్తోంది. తనపై ఉన్న కేసుల భయంతోనే చంద్రబాబు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనీ, కానీ కమలం పెద్దలకు మాత్రం ఈ పొత్తు ఇష్టం లేదనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కోసం ఈ పొత్తుకు సిద్ధపడ్డారే తప్ప.. దీనిపై బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి ఆసక్తీ లేదని తెలుస్తోంది.

---- Polls module would be displayed here ----

స్పష్టమవుతున్న సంకేతాలు:

ఆ మధ్య చిలకలూరిపేటలో కూటమి సభకు వచ్చిన ప్రధాని మోదీ.. చంద్రబాబును మెచ్చుకోలేదు. సీఎం జగన్‌పై ఎలాంటి విమర్శలూ చెయ్యలేదు. చంద్రబాబు మాత్రం మోదీని ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవల మేనిఫెస్టో విడుదల సమయంలో.. బీజేపీ దానికి దూరంగా ఉంది. కనీసం మేనిఫెస్టోని టచ్ కూడా చెయ్యలేదు. తాజాగా సత్యసాయి జిల్లా.. ధర్మవరంలో జరిగిన టీడీపీ+బీజేపీ సభలో కూడా.. చంద్రబాబుతో చేయి, చేయి కలిపేందుకు అమిత్ షా ఆసక్తి చూపలేదు. తన ప్రసంగం తర్వాత, చంద్రబాబు ప్రసంగించకముందే.. అమిత్ షా వెళ్లిపోయారు. తద్వారా.. టీడీపీతో బీజేపీ పైపై బంధమే తప్ప.. నిజమైన బంధం కాదనే వాదన బలపడుతోంది.

వైసీపీ గెలుస్తుందని భావిస్తోందా?

బీజేపీ ఎందుకు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అనే దానికి 2 అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. వైసీపీ మొదటి నుంచి బీజేపీకి దూరంగానే ఉంటోంది. దాంతో.. ఏపీలో ఆ పార్టీని ఎన్డీయేలోకి ఆహ్వానించే పరిస్థితి లేదు. దాంతో.. ఏపీలో టీడీపీని కూటమిలోకి ఆహ్వానించడం ద్వారా.. ఎక్కువ సీట్లలో పోటీ చేయవచ్చని బీజేపీ ప్లాన్ చేసింది. అదే అమలవుతోంది. ఇలా వైసీపీ ముందుకు రాకపోవడం, అదే సమయంలో టీడీపీ ముందుకు రావడంతో.. బీజేపీ ఇష్టం లేకపోయినా పొత్తు పెట్టుకుందనీ.. అల్టిమేట్‌గా తన ప్రయోజనాలనే ఆ పార్టీ లెక్కలోకి తీసుకుంటోందనే వాదన ఉంది. ఐతే.. ఎన్నికల తర్వాత.. వైసీపీ అధికారంలోకి వస్తే.. అప్పుడు ఆ పార్టీ ఎంపీల నుంచి పరోక్ష మద్దతు పొందే ప్లాన్ కూడా బీజేపీకి ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే, బీజేపీకి సమస్య ఉండదు. ఇలా కమలనాథులు.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనీ.. అల్టిమేట్‌గా ఏపీలో ఎవరు గెలిచినా.. తమకు సమస్య రాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

2024-05-06T05:44:45Z dg43tfdfdgfd