పోలింగ్ శాతంపై ప్రతిపక్షాల విమర్శలెందుకు? ఎన్నికల కమిషన్ ఎందుకు ఇబ్బందుల్లో పడింది?

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇదే క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది.

విపక్షాలు ఎన్నికల సంఘం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు దశల పోలింగ్ డేటాను విడుదల చేయడంలో జాప్యమే దీనికి కారణం.

ఏప్రిల్ 19న మొదటి దశ ఓటింగ్, ఏప్రిల్ 26న రెండో దశ ఓటింగ్‌కు సంబంధించిన గణాంకాలు ఏప్రిల్ 30న విడుదలయ్యాయి.

ఎన్నికల సంఘం తీరు అనుమానాలకు తావిస్తోందని ప్రతిపక్ష పార్టీల రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో మొదటి, రెండో దశ ఓటింగ్‌ గణాంకాలకు సంబంధించిన తుది సమాచారం ఇవ్వడంలో జాప్యం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ అంటోంది.

గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని చెబుతోంది. ఇక కనీసం మిగిలిన దశల ఎన్నికల్లో అలా జరగబోదని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు.

పోలింగ్ ముగిసిన వెంటనే లేదా 24 గంటలలోపు ఓటింగ్ శాతం విడుదల కావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారు?

మొదటి దశ పోలింగ్‌లో ఏప్రిల్ 19 సాయంత్రం 7 గంటల వరకు 102 స్థానాల్లో 60 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఏప్రిల్ 26న 88 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్‌లో ఆ రోజు సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 61 శాతం ఓటింగ్ జరిగినట్లు తెలిపింది.

అయితే, ఏప్రిల్ 30న విడుదల చేసిన డేటాలో తొలి దశలో 102 పార్లమెంట్ స్థానాల్లో 66.14 శాతం, రెండో దశలో 88 స్థానాల్లో 66.71 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఓటింగ్ రోజు సాయంత్రం ఎన్నికల సంఘం పోలింగ్ శాతంపై ఒక నంబర్ విడుదల చేస్తుంది.

మరింత సమాచారం అందుకున్న తర్వాత అప్‌డేట్ చేస్తారు, తదుపరి కొన్ని గంటల్లో ఓటింగ్ తుది శాతం విడుదల చేస్తారు.

ఏప్రిల్ 30న ఎన్నికల సంఘం గణాంకాలను విడుదల చేయడానికి ముందు జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ “మొదటి దశ ఓటింగ్ ముగిసి 11 రోజులు, రెండో దశ ముగిసి 4 రోజులైనా ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం వివరాలను వెల్లడించకపోవడం ఇదే తొలిసారి" అని తెలిపారు.

"గతంలో పోలింగ్ ముగిసిన వెంటనే లేదా 24 గంటలలోపు ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం తుది డేటాను విడుదల చేసేది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కేవలం అంచనా డేటా మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఆలస్యానికి కారణం ఏమిటి?" అని జైరాం రమేష్ ప్రశ్నించారు.

సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా ఇది చాలా ఆందోళనకర విషయమని అన్నారు.

ఎలక్షన్ కమిషన్ డేటాను పర్సంటేజీలో విడుదల చేసింది, పర్సంటేజీకి బదులు పోలైన ఓట్ల సంఖ్య ఎందుకు ఇవ్వలేదని సీతారాం ఏచూరీ ప్రశ్నించారు. అంకెలు తెలిస్తే తప్ప పర్సంటేజీకి అర్థం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఏ మహిళా అభ్యర్థి దగ్గర ఎన్ని కేజీల బంగారం ఉంది? వీళ్లను మించిన ‘గోల్డ్ మ్యాన్’ ఎవరు?

విశ్వసనీయతపై సందేహాలు: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఎన్నికల కమిషన్ తీరుపై విమర్శలు గుప్పించారు. డేటా ఇవ్వడంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు.

ఈవీఎంల విశ్వసనీయతపై కూడా మమత ప్రశ్నలు సంధించారు. "నేను ఏదైనా కోల్పోతున్నానా?" అని ట్విటర్‌లో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పోస్టు పెట్టారు.

మాజీ ఎన్నికల కమిషన్ అధికారులు ఏమంటున్నారు?

ఓటింగ్ తుది లెక్కల ప్రకటనలో ఎన్నికల సంఘం జాప్యం సరికాదని మాజీ ఎన్నికల కమిషనర్ ఎన్ గోపాలస్వామి అభిప్రాయపడ్డారు. "పది రోజులు ఆలస్యమేంటి? అని ఆయన ప్రశ్నించారు.

ఈసారి ఓటింగ్ బూత్ నుంచి గంట గంటకు వస్తుందని, ప్రిసైడింగ్ అధికారి ఆ యాప్‌లో సమాచారం ఇవ్వాల్సి ఉందని గోపాలస్వామి అన్నారు.

అయితే, కొంతమేర సమాచారం అందకపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయ వ్యక్తంచేశారు. ఓటింగ్ ముగిశాక ఫారం 17సీ ద్వారా పోలైన మొత్తం ఓట్ల సంఖ్య తెలుస్తుందని గోపాలస్వామి తెలిపారు.

"సాధారణంగా పోలింగ్ తుది డేటా మరుసటి రోజు విడుదలవుతుంది. ప్రతి పోలింగ్ సెంటర్‌లో పోలైన ఓట్లు, ఓటేసిన పురుషులు, మహిళల సంఖ్య తెలుస్తుంది. రాష్ట్ర స్థాయి సగటు డేటా కూడా తెలుస్తుంది'' అని ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు.

సరిదిద్దిన గణాంకాలలో కొన్నిసార్లు 4 నుంచి 5 శాతం తేడా ఉంటుందని అన్నారు. కానీ, ఈసారి డేటా ప్రకటించలేదు. ఏప్రిల్ 30న 'ది హిందూ' దినపత్రికలో దీనిపై వార్త ప్రచురితమైంది.

ఏప్రిల్ 30న ఎన్నికల సంఘం మొదటి, రెండో దశల ఓటింగ్ శాతాలను విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా ఈ డేటా ఉంది.

అసమర్థతే: మాజీ సీఈసీ సంపత్

''తుది ఓట్ల లెక్కలను విడుదల చేయడంలో ఎన్నికల సంఘం జాప్యం అసాధారణం. ఓట్ల సంఖ్య కోట్లలో ఉన్నప్పుడు శాతంలో చిన్న మార్పు కూడా కీలకం. ఈ విషయం సమర్థతకు సంబంధించినది కాదు, ఇది అనుమానం వచ్చేలా చేస్తుంది'' యోగేంద్ర యాదవ్ చెప్పారు.

‘‘నాకు తెలిసినంత వరకు ఓటింగ్ శాతాన్ని పర్సంటేజీలో లెక్కిస్తారు. ఇంతకుముందు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రశ్న అడగలేదే?'' అని ఎన్నికల సంఘం అధికారి ఒకరు అన్నారు.

ఈ ఘటనపై ఎన్నికల సంఘం మాజీ సీఈసీ వీఎస్ సంపత్ స్పందిస్తూ.. ఎన్నికల సంఘం తప్పు చేస్తుందనుకోవడం లేదని, ఈ విమర్శ 'అవాస్తవం' అని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఓటింగ్ రోజు మారుమూల ప్రాంతాల నుంచి సమాచారం వస్తుంది, అయితే, కొంత ఆలస్యంగా రావచ్చు" అని ఆయన తెలిపారు.

"కానీ సాధారణంగా ఓటింగ్ జరిగిన 24 గంటల్లోనే మొత్తం సమాచారం వస్తుంది. దానికి ఎక్కువ సమయం తీసుకుంటే, అది వారి అసమర్థతే" అని ఆయన అన్నారు.

ఓట్ల సంఖ్యకు బదులు పర్సంటేజీలో సమాచారం వస్తే, ఈ సమాచారం కావాలనుకునే వారు ఎన్నికల కమిషన్‌ను అడగవచ్చని వీఎస్ సంపత్ సూచించారు.

ఈ ఘటనలు ఎన్నికల సంఘంపై 'కొంచెం అవిశ్వాసం' చూపుతాయని సంపత్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-05-04T08:46:26Z dg43tfdfdgfd