పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం కోసం ఎవరైనా దరఖాస్తు చేశారా, మోదీ ప్రభుత్వం ఏం చెబుతోంది?

పౌరసత్వ సవరణ చట్టం కింద ఎంత మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారో తమ వద్ద సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

సమాచార హక్కు చట్టం కింద కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన అనేక మంది సామాజిక కార్యకర్తలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇదే సమాధానం ఇచ్చింది.

పౌరసత్వ సవరణ చట్టం కింద అసలు ఎవరైనా దరఖాస్తు చేసుకున్నారా లేదా అని చాలా మంది సామాజిక కార్యకర్తలు అడుగుతున్నారు.

పౌరసత్వ సవరణ చట్టం కింద ఇప్పటి వరకు కనీసం మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల నియామకం వంటివి ఏవీ జరగలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించింది.

బరక్ లోయకు చెందిన ఓ వ్యక్తి ఈ చట్టం కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని కొన్ని రోజుల క్రితం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ “ఎక్స్”లో మెసేజ్ పోస్ట్ చేశారు. ఆ వ్యక్తి గురించిన సమాచారాన్ని బహిరంగ పరచలేనని ఆయన అందులో చెప్పారు.

బరక్‌లోయలోని జర్నలిస్టులు కూడా ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, పౌరసత్వ సవరణ చట్టం వల్ల రాజకీయంగా దక్కుతాయనుకున్న ప్రయోజనాలను ఈ ఎన్నికల్లో సాధించలేమని బీజేపీలోని ఓ వర్గం భావిస్తోంది.

బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు కూడా శరణార్థులు భారత్‌లోకి వస్తున్నారా? దేశంలో ఉన్న మతువా వర్గానికి చెందిన ప్రజలు పౌరసత్వ సవరణ చట్టం కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారా అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేదు.

దరఖాస్తుదారుల సంఖ్య

సీఏఏ కింద ఎవరైనా ఆన్‌లైన్‌లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారా అనే వివరాల కోసం సమాచార హక్కు చట్టం-ఆర్టీఐ కింద కేంద్ర హోంశాఖలో ఫారినర్స్ డివిజన్ కింద పని చేస్తున్న పౌరసత్వ విభాగానికి అనేక లేఖలు, ఈమెయిల్స్ పంపించారు.

బంగ్లా పోఖో అనే స్వచ్చంద సంస్థకు చెందిన మహమ్మద్ షహీన్ ఆర్టీఐ కింద పిటిషన్ ఫైల్ చేశారు.

ఆయనతో పాటు సమాజం, న్యాయం అనే అంశాలపై పరిశోధన చేసిన విశ్వనాధ్ గోస్వామి కూడా పిటిషన్ ఫైల్ చేశారు.

వాళ్లిద్దరికీ పౌరసత్వ విభాగం ఒకే రకమైన సమాధానం ఇచ్చింది.

అసలు అలాంటి కార్యాలయం కానీ, సమాచారం కానీ ఏదీ లేదని’ ఈ విభాగపు డైరెక్టర్ ఆర్డీ మీనా చెప్పారు.

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, ఈ చట్టం కింద పౌరసత్వం కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే గణాంకాలను భద్రపరిచే వ్యవస్థ ఏదీ లేదని షహీన్‌కు ఇచ్చిన సమాధానంలో పౌరసత్వ విభాగం తెలిపింది.

పౌరసత్వ విభాగంలో ప్రధాన సమాచార అధికారి ఇచ్చిన సమాధానంతో ఈ సామాజిక కార్యకర్తలిద్దరు సంతృప్తి చెందకపోతే కేంద్ర హోంశాఖలోని ‘ఫారినర్స్’ విభాగానికి చెందిన జాయింట్ సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవచ్చని కూడా చెప్పింది.

“ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. సమాచారం ఎక్కడ నుంచి ఇవ్వాలి?”

పశ్చిమ బెంగాల్ నుంచి ఎవరూ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమని సమాచారం ఇస్తుంది? అని కొందరు సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

అయితే, “ఆన్‌లైన్‌లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే దానిపై కేంద్రప్రభుత్వం వద్ద సమాచారం లేకుండా ఎలా ఉంటుంది?” అని బంగ్లా పోఖో అధిపతి ప్రొఫెసర్ గర్గ్ ఛటర్జీ అడుగుతున్నారు.

"భారతదేశ పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసుకోవాలన్నదే మా పిటిషన్ లక్ష్యం. అందుకే మేం చాలా పిటిషన్లు ఇచ్చాం. అయితే అందుకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదు. రికార్డులు లేవని చెప్పారు. ఇదేం సమాధానం” అని ఆయన అన్నారు.

“ఒక డిజిటల్ యాప్ తయారు చేయడానికి బదులు, వారి వద్ద రికార్డులు లేవంటున్నారు. అసలు ఎవరైనా పౌరసత్వం కోసం అప్లై చేసుకున్నారా లేదా అనేది కూడా వారికి తెలియదు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ప్రశ్నలు అడిగే హక్కు మీకు లేదని అనలేదు” అని గర్గ్ ఛటర్జీ బీబీసీతో చెప్పారు.

“ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. నాకు తెలిసినంత వరకు కొత్త చట్టం కింద భారత పౌరసత్వం కోసం పశ్చిమబెంగాల్ నుంచి ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అలాంటప్పుడు వాళ్లు సమాధానం ఎలా ఇవ్వగలరు?” అని మతువా కమ్యూనిటీ నాయకుడు రచయిత, సామాజిక కార్యకర్త సుకృతి రంజన్ బిశ్వాస్ ప్రశ్నించారు.

మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి

“పౌరసత్వ సవరణ చట్టం కింద ఎవరైనా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే దానిపై విచారించి నిర్ణయం తీసుకోవడానికి అధికార యంత్రాంగం, అవసరమైన ఇతర సదుపాయాలు ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఉద్యోగుల్ని నియమించాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి చర్యలేవీ చేపట్టలేదని సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ తెలిపింది” అని సుకృతి బిశ్వాస్ బీబీసీతో చెప్పారు.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే బీజేపీ ఈ చట్టాన్ని తీసుకు వచ్చిందని ఛటర్జీ, విశ్వాస్ చెప్పారు.

ఈ చట్టం అమలులోకి వచ్చాక, బీజేపీ మద్దతుదారులుగా చెబుతున్న మతువా సముదాయం వేడుక చేసుకుంది. ఈ గ్రూపు నాయకుడు, కేంద్రమంత్రి శంతను ఠాకూర్ చట్టం అమలు పట్ల హర్షం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్ వచ్చి స్థిరపడిన అనేక మందితో బీబీసీ మాట్లాడింది. వారిలో ఒక్కరు కూడా ఈ చట్టం కింద భారత పౌరసత్వం పొందాలని కోరుకోవడం లేదు.

“నేను పౌరసత్వం కోసం మళ్లీ ప్రత్యేకంగా ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి? నాకు ఆధార్ కార్డు సహా అన్ని రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయి” అని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ మద్దతుదారుడొకరు చెప్పారు.

బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్ వచ్చిన శరణార్థులు, మతువా సమూహానికి చెందిన రెండు కోట్ల మందికి భారతీయ పౌరసత్వం లేదని ఒక అంచనా.

పౌరసత్వానికి సంబంధించి తమ వద్ద చట్టపరంగా ఎలాంటి పత్రాలు, గుర్తింపు కార్డులు లేవని వారు కూడా అంగీకరిస్తున్నారు.

అయితే వారంతా ఎలాగోలా ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటి వాటిని పొందినట్లు చెబుతున్నారు. ఈ కార్డులన్నీ ఉండటంతో భారతీయ పౌరసత్వం పొందేందుకు వారు తొందరపడటం లేదు.

ఈ చట్టం కింద పౌరసత్వం పొందటం అంత తేలిక కాదు

“ఈ చట్టం కింద పౌరసత్వం పొందడం సాధ్యం కాదని శరణార్థులు, మతువా సమూహానికి చెందిన వారికి మేం పదే పదే వివరిస్తున్నాం. భారత పౌరసత్వం కావాలంటే ఈ చట్టంలో పేర్కొన్న పత్రాలు సమర్పించడం ఎవరికీ సాధ్యం కాదు. అసలు ఎప్పటికీ సాధ్యం కాదు” అని సుకృతి రంజన్ బిశ్వాస్ చెప్పారు.

“మరో అంశం ఏంటంటే, ఈ చట్టం కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే, మీరు భారతీయుడు కాదని అంగీకరించినట్లే. మీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని తేలిపోతుంది. అయితే వాళ్లందరి దగ్గర ఆధార్ కార్డు, ఓటరు కార్డు ఉన్నాయి. వారిలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు” అని ఆయన అన్నారు.

“తాము భారతీయులం కాదని, తమకు పౌరసత్వం కల్పించాలని ఇక్కడున్నవారు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే, దరఖాస్తు చేసుకున్న వెంటనే వారి వద్ద ఉన్న కార్డులు రద్దవుతాయి. ఆ తర్వాత వారి దరఖాస్తును ఆమోదించి ప్రభుత్వం వారికి పౌరసత్వం ఇస్తుందన్న గ్యారంటీ ఏముంది? అని బిశ్వాస్ ప్రశ్నించారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టం- సీఏఏ అమలు ద్వారా పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ ఎన్నికల సమీకరణాల కోణంలో చూస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడానికి ఇదే సరైన సమయం అని జర్నలిస్టు బైకుంఠ్ నాధ్ గోస్వామి భావిస్తున్నారు.

“ఈసారి బీజేపీ నాలుగు వందల సీట్లు దాటాలనే నినాదంతో ఎన్నికల క్షేత్రంలోకి వచ్చింది. అందుకోసం తమతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కూటమిలో చేర్చుకుంది. దక్షిణ భారత దేశంలో ఒడిషాలో బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, తమిళనాడులో పీఎంకే ఇలా అనేక పార్టీలు ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో చేరాయి. దీనర్ధం బీజేపీ తాను గెలిచే సీట్లతో పాటు తమకు బలం లేని చోట ప్రాంతీయ పార్టీలు గెలిచే సీట్లతో బలం పెంచుకోవాలని భావిస్తోంది. అందుకే సీఏఏ అమలు ద్వారా బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీ, బెంగాలీ హిందువులు, అస్సాంలో మెజారిటీ ఓట్లు, సీట్లు సాధించాలని వ్యూహం రచించింది” అని గోస్వామి బీబీసీతో చెప్పారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్‌లో లక్షల మంది బెంగాలీ హిందువుల పేర్లను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్- ఎన్ఆర్సీ నుంచి తొలగించారు.

“ఎన్ఆర్సీ నుంచి ఎవరి పేర్లనైతే తొలగించారో వారు ఫారినర్స్ ట్రైబ్యునల్‌లో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారంతా బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. అయితే వారందరికీ సీఏఏ కింద పౌరసత్వం ఇస్తారని చర్చ జరుగుతోంది” అని గోస్వామి అన్నారు.

పశ్చిమబెంగాల్‌లో ఏ పార్టీకైనా మతువా ఓటర్ల మద్దతు చాలా ముఖ్యం. రెండు పార్లమెంట్ స్థానాలు, 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ వర్గానికి చెందిన ఓటర్లు నిర్ణయాత్మకశక్తిగా ఉన్నారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లోనూ జనాభా పరంగా కీలకంగా ఉన్నారు.

బీజేపీకి లబ్ధి చేకూరుతుందా?

సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పశ్చిమబెంగాల్, అస్సాంలో పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి తీసుకురావడం వల్ల ఓటర్లను ఆకర్షించాలనే తమ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనే దానిపై బీజేపీలో చర్చ జరుగుతోంది.

“సీఏఏ అమలు చేస్తే, దాని వల్ల మాకు రాజకీయంగా లబ్ధి కలుగుతుంది. అయితే ప్రజలు ఈ చట్టం కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేం దీని ద్వారా ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందగలం?. వాస్తవానికి ఈ చట్టం కింద భారత పౌరసత్వం పొందేందుకు పేర్కొన్న నిబంధనలు, సమర్పించాల్సిన గుర్తింపు కార్డులు లాంటి నిబంధనలను ఎక్కువ మంది అంగీకరించడం లేదు” అని పేరు బహిర్గతం చెయ్యడానికి ఇష్టపడని బీజేపీ నేత ఒకరు బీబీసీతో చెప్పారు.

వ్యక్తిగత చర్చల్లో బీజేపీ నేతలు ఇలాంటి అంశాల గురించి మాట్లాడుకుంటున్నప్పటికీ, సీఏఏను అమల్లోకి తీసుకు వచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని ప్రజలకు చెబుతున్నారు.

ప్రధానమంత్రి పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ఇదే జరుగుతోంది. మతువా వర్గీయులు, శరణార్థులకు భారత పౌరసత్వం అందించేందుకు ఈ చట్టం ద్వారా సాధ్యం అవుతుందని ప్రధాని మోదీ చెబుతున్నారు.

అదే వాస్తవం అయితే, ఈ చట్టం కింద భారత పౌరసత్వం కోసం ఎవరూ ఎందుకు దరఖాస్తు చేసుకోవడం లేదు అనే ప్రశ్నకు సమాధానం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-05-02T06:44:08Z dg43tfdfdgfd