ప్రజ్వల్​పై రేప్ కేసు .. ఎక్కడున్నా రప్పిస్తాం : సీఎం సిద్ధరామయ్య

ప్రజ్వల్​పై రేప్ కేసు .. ఎక్కడున్నా రప్పిస్తాం : సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు: మహిళలపై వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో జేడీఎస్ నేత, కర్నాటకలోని హాసన్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్  రేవణ్ణపై రేప్ కేసు నమోదు చేసినట్లు కర్నాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రజ్వల్ వల్ల వేధింపులకు గురైన బాధితులను గుర్తించి, వారికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. "మహిళలపై ప్రజ్వల్ రేవణ్ణ జరిపిన లైంగిక వేధింపుల వీడియోల గురించి బీజేపీ, జేడీఎస్‌‌లకు ముందే తెలుసు. ప్రజ్వల్ బాధిత మహిళల ఫిర్యాదుతోనే అతడిపై రేప్ కేసు నమోదైంది. 

ఇలాంటి విషయాల్లో ఏ మహిళా ఎన్నడూ అబద్ధం చెప్పదు. ప్రజ్వల్ ఎలాంటివాడో తెలిసీ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు? జేడీఎస్ నాయకత్వం గురువారం న్యాయవాదులతో ఎందుకు సమావేశం అయింది? " అని సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. ప్రజ్వల్ జర్మనీలో ఉన్నట్లు తెలిసిందని సిద్ధరామయ్య చెప్పారు. "ప్రజ్వల్ ఎక్కడున్నా వెనక్కి తీసుకువచ్చేందుకు కర్నాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజ్వల్ డిప్లొమాటిక్ పాస్‌‌పోర్ట్‌‌ను రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాను. ప్రజ్వల్ రేవణ్ణను కేంద్రమే కాపాడుతోంది" అని సిద్ధరామయ్య ఆరోపించారు.

కొత్తగా మరో కిడ్నాప్ కేసు నమోదు

తన తల్లిపై ప్రజ్వల్ రేవణ్ణ అఘాయిత్యం చేశాడని, ఆ వీడియో బయటపడడంతో ఇప్పుడు తన తల్లిని కిడ్నాప్ చేశారని ఓ యువకుడు మైసూరు పోలీసులను ఆశ్రయించాడు. ఆరేండ్ల క్రితం రేవణ్ణ నివాసంలో తన తల్లి పనిచేసిందని, ఆ సమయంలోనే ఈ దారుణం జరిగిందని చెప్పాడు. దీంతో రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణలపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T02:52:23Z dg43tfdfdgfd