ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా?

రాజస్తాన్‌లోని బాంస్వాడాలో ఏప్రిల్ 21న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రాహుల్ గాంధీ సహా పలు రాజకీయ పక్షాల నేతలు ప్రధాని మోదీ మాటలను తీవ్రంగా ఖండించారు.

ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఎన్నికల నియమావళిని బీజేపీ ఉల్లంఘించిందని ఈసీకి 16 ఫిర్యాదులు చేశారు.

గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఓ ప్రసంగాన్ని ఆధారంగా చేసుకుని ప్రధాని మోదీ ముస్లింలపై కామెంట్స్ చేశారు. వారిని ‘చొరబాటుదారులు’గానూ, ‘ఎక్కువ మంది పిల్లలను కనేవారు’గానూ పేర్కొన్నారు.

18 సంవత్సరాల కిందట మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగాన్ని మోదీ ప్రస్తావించారు. అయితే, ముస్లింలకే మొదటి హక్కు అనే మాట అప్పట్లో మన్మోహన్ సింగ్ అనలేదు.

2006లో మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగంలో ‘‘షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. కొత్త పథకాలను తీసుకురావడం ద్వారా మైనార్టీలకు, ప్రత్యేకించి ముస్లింలు స్వశక్తితో ఎదిగి అభివృద్ధి ఫలాలు పొందేలా చూడాలి. వారందరికీ వనరులపై మొదటి హక్కు ఉండాలి’’ అని ప్రసంగించారు.

మన్మోహన్ సింగ్ ఇంగ్లిషులో చేసిన ఈ ప్రసంగంలో క్లెయిమ్ అనే పదాన్ని ఉపయోగించారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై విమర్శలు రేగాయి. దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నప్పుడు ‘చొరబాటుదారులు’ అనే పదం ఎలా వాడతారని ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ పక్షాల ఫిర్యాదులే కాకుండా కనీసం 17వేల మందికిపైగా సాధారణ పౌరులు మోదీ చేసిన విద్వేష ప్రసంగంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పాత్రపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

https://twitter.com/Jairam_Ramesh/status/1782369434524413986

లోక్‌సభ ఎన్నికలు 2024 సందర్భంగా దేశంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది.

ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చిన ఈ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల ప్రచారం మతాలకు సంబంధించిన గుర్తులను ఉపయోగించడం, మతం, కులం, తెగల ఆధారంగా ఓట్లు అడగడం నిషిద్ధం.

ఏదైనా మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, విద్వేష ప్రసంగాలు చేయడాన్ని ఎన్నికల నియమావళి నిషేధిస్తోంది.

ఈ నిబంధనలను ఉదహరిస్తూ ప్రతిపక్షాలు, కొంతమంది పౌరులు సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.

సోమవారం సాయంత్రం కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని సంప్రదించారు.

ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951, సుప్రీం కోర్టు తీర్పులు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన విషయంపై మేం ఎన్నికల సంఘానికి 16 ఫిర్యాదులు చేశాం అని జైరామ్ రమేశ్ చెప్పారు.

తమ ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదులన్నీ ఏప్రిల్ 18 నుంచి 22 మధ్య నాటివి.

ప్రతిపక్షాలు చేసిన ప్రధాన ఫిర్యాదులలో కొన్ని..

  • ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ యూజీసీ నియామకాలు చేపట్టడం
  • బీజేపీ అభ్యర్థి తపన్ సింగ్ గొగోయ్ ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడం
  • ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలలో ప్రధాని మోదీ చిత్రాన్ని వినియోగించడం
  • ఎన్నికల ప్రచారంలో మతపరమైన చిహ్నలు, రామమందిరాన్ని వినియోగించడం
  • కేరళలో మాక్ ఎలక్షన్స్ లో ఈవీఎం మెషిన్లు సరిగా పనిచేయకపోవడం
  • ఎన్నికల ప్రచారంలో సైన్యం చిత్రాలను బీజేపీ వాడుకోవడం

ప్రతిపక్షాలపై చర్యలు

ఇప్పటిదాకా ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించలేదు. అలాగే మోదీ వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చినట్టుగా గానీ, లేదంటే ఏదైనా చర్యలు తీసుకున్నట్టుగానీ ఎన్నికల సంఘం ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు.

కిందటి నెల మొదట్లో తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ప్రధాని మోదీ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి వైమానిక దళ హెలికాప్టర్‌ను వినియోగించినట్టు సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నట్టుగా ఎటువంటి సమాచారం లభించడం లేదు.

ఎన్నికల సంఘం ప్రతిపక్షాల విషయంలో చురుకుగాను, బీజేపీ విషయంలో నిష్క్రియగా ఉంటోందని కొందరు పోల్చి చెబుతున్నారు.

నవంబర్ 2023లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన ఓ కథనం మేరకు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండా ‘పనౌటి’ (చెడుశకనం) అని మాట్లాడినందుకు ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు ఇచ్చింది.

ఇటీవల హేమ మాలినిపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై 48 గంటలపాటు ఆయనపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

ఎన్నికల నియామవళి అమల్లోకి వచ్చిన తరువాత అందిన ఫిర్యాదులపై ఏప్రిల్ 16న ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది.

దాదాపు 200కుపైగా ఫిర్యాదులు తమకు అందాయని కమిషన్ పేర్కొంది. వీటిల్లో 169 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. అలాగే బీజేపీ దాఖలు చేసిన 51 ఫిర్యాదులలో 38 కేసులలో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.

కాంగ్రెస్ పార్టీ 59 ఫిర్యాదులు చేస్తే 51 కేసులలో చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.

ఇతర రాజకీయ పక్షాల నుంచి 90 కేసులు వచ్చాయని, వీటిల్లో 80 కేసులపై చర్యలు తీసుకున్నామని తెలిపింది.

కాంగ్రెస్, ఆప్ పై వచ్చిన ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత వాట్సాప్‌లలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని పంపడం, హైవేలు, పెట్రోల్ పంపులు వద్ద ప్రచారాలపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా నిషేధం విధించింది.

బాల్ ఠాకరేపై బ్యాన్

ఎన్నికలలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాకరే ఎన్నికలలో పోటీ చేయకుండా, ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆరేళ్ళపాటు నిషేధం విధించిన సంఘటన 1987లో జరిగింది.

ఓ ఎన్నికల ప్రచారంలో ‘‘నేను ముస్లింలకు ఓటు వేయాలనుకోవడం లేదు’’ అని చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు.

‘కోడ్ దాటిన ప్రధాని’

ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఎన్నికల నియమావళిలోని సెక్షన్ 123(3), 123(3ఏ), 125, 1995 ప్రజా ప్రాతినిథ్య చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని 153(ఏ) సెక్షన్‌ను ఉల్లంఘించారని ఎన్నికల పర్యవేక్షణా సంస్థ ఏడీఆర్ కు చెందిన ప్రొఫెసర్ జగదీప్ చొక్కర్ పేర్కొంటూ , దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రధాని ప్రస్తుత ప్రసంగం గత ప్రసంగాలకు భిన్నంగా ఉందని సీఎస్‌డీఎస్‌కు చెందిన హిలాల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

‘‘గతంలో ప్రధాని మోదీ హిందు, హిందుత్వ, ముస్లిం అనే పదాలు వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. తన పదేళ్ళ కాలంలో ఆయన హిందుత్వ, లేదా ముస్లిం అనేపదాలు మహా అయితే ఓ నాలుగైదుసార్లు ఉపయోగించి ఉంటారు. దీనివల్ల ఆయన మనోగతం ఏమిటనేది ఓటర్లకు అర్థమయ్యేది కాదు’’

‘‘బీజేపీకి మూడురకాల ఓటర్లు ఉన్నారు. వారిలో ఒకరు ఎప్పటికీ బీజేపీకే ఓటు వేస్తారు. రెండో కోవలోకి వచ్చేవారిలో గతంలో వేరే పార్టీలకు ఓటు వేసి ఈసారి బీజేపీకి ఓటు వేద్దామనుకునేవారు, మూడోవారు ఎటూ తేల్చుకోలేక ఎవరికో ఒకరికి ఓటు వేసేవారు. ఇంతటి కీలక సమయంలో ఓటింగ్ శాతం పడిపోవడంతో తమ పార్టీ తిరిగి మూలాలకు వెళుతోందని మోదీ చూపించారు’’ అని చెప్పారు.

బీజేపీ మానిఫెస్టోలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో హిందుత్వ గురించి పెద్దగా ప్రస్తావించలేదు. కానీ ప్రధాని తాజా ప్రసంగం మిగిలిన ఎన్నికల దశలలో పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుందని హిలాల్ అహ్మద్ చెప్పారు.

ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?

ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు.

ప్రధాని చేసిందంతా విద్వేష ప్రసంగమే. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రసంగం. మా మానిఫెస్టో ప్రతి భారతీయుడికి చెందుతుంది. అందులో మేం అందరికీ సమానత్వం, న్యాయం గురించి మాట్లాడాం. సత్యమనే పునాదిపై కాంగ్రెస్ నిలబడింది అని కాంగ్రెస్ పేర్కొంది.

వామపక్ష నేత సీతారామ్ ఏచూరి స్పందిస్తూ ‘ఇది భయంకరమైనది. ఎన్నికల సంఘం మౌనం మరింత భయపెడుతోంది. మోదీ ప్రసంగం ఎన్నికల నిబంధనలను, విద్వేష ప్రసంగాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా ఉల్లంఘించడమే అని చెప్పారు.

ప్రధాని మోదీ ప్రసంగం విషపూరితమైనది, మతవిద్వేషంతో నిండి ఉంది. భారత ప్రజలను మతం ఆధారంగా విభజించేలా ఉంది అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) పేర్కొంది.

బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘‘ఇండి కూటమికి దేశ ప్రజల కంటే దేశంలోకి చొరబడేవారే ముఖ్యం. ఒక వేళ అలా చొరబడేవారు ముస్లీంలైతే ఆ విషయాన్ని ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పడానికి చాల ధైర్యం ఉండాలి’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-04-23T11:34:03Z dg43tfdfdgfd