ప్రభుత్వ అధికారినంటూ ఫోన్ చేసి మోసాలు

ప్రభుత్వ అధికారినంటూ ఫోన్ చేసి మోసాలు

  •     నిందితుడి అరెస్టు, రిమాండ్​కు తరలింపు

గద్వాల, వెలుగు: ప్రభుత్వ అధికారినంటూ హోటల్స్, రెస్టారెంట్స్, క్లినిక్ లకు ఫోన్ చేసి యూపీఐ ద్వారా డబ్బులు దండుకుంటున్న సైబర్ నేరగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేశారు. సీఐ భీమ్ కుమార్ కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా బి. కోడూరు మండలం రామచంద్రపురంగ్రామానికి చెందిన బిల్లా నాగేశ్వరరావు గద్వాల మున్సిపాలిటీలో అటెండర్ గా పనిచేశాడు.

ఫుడ్ వరల్డ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్న శరత్ చంద్రా రెడ్డికి ఫోన్ చేసి వ్యాపార లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలని చెప్పారు. యూపీఐ ద్వారా రూ.7000 ట్రాన్స్ ఫర్ చేయాలని ఒత్తిడి తెచ్చి ఫోన్ పే చేయించుకున్నాడు. మరుసటి రోజు తమ సిబ్బంది రెన్యువల్ పేపర్స్ తెస్తారని, వారికి రూ.500 ఫోన్ పే చేయాలని సూచించాడు. అనుమానం వచ్చిన శరత్ చంద్రారెడ్డి సైబర్ క్రైమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.

దీంతో గద్వాల బస్టాండ్ పరిసరాల్లో సంచరిస్తుండగా నాగేశ్వరరావును పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరపరిచి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. మహబూబ్ నగర్, వరంగల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయాల్లోనూ నాగేశ్వరరావు పనిశాడు. బదిలీ అయ్యాక అక్కడ కూడా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-29T04:17:53Z dg43tfdfdgfd