ప్రభుత్వం తమను దేశద్రోహులని అంటుందని గాంధీ, నెహ్రూ ఊహించి ఉండరు : ప్రియాంక గాంధీ

ప్రభుత్వం తమను దేశద్రోహులని అంటుందని గాంధీ, నెహ్రూ ఊహించి ఉండరు : ప్రియాంక గాంధీ

రాయ్​బరేలీ/న్యూఢిల్లీ: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే తమను దేశద్రోహులని అంటుందని గాంధీ, నెహ్రూ ఊహించి ఉండరని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. దేశ ప్రజలను ప్రభుత్వమే బలహీనపరుస్తుందనేది వాళ్ల ఊహకు కూడా తట్టి ఉండదన్నారు. మంగళవారం రాయ్​బరేలీలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రియాంక మాట్లాడారు. 

మోదీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించిన తీరును బ్రిటిష్ పాలనతో పోల్చారు.  ‘‘మోతీలాల్  నెహ్రూ, జవహర్ లాల్  నెహ్రూ టైమ్​లో కూడా రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడారు. అప్పుడు రాయ్ బరేలీలో జరిగిన ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన మోతీలాల్, జవహర్ లాల్​ను బ్రిటిష్  ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పటి నుంచి రాయ్ బరేలీలో జరిగిన అన్ని పోరాటాలు, ఎన్నికల్లో ఒకవైపు ప్రజాస్వామ్యం ఉండగా.. మరోవైపు నిరంకుశ ప్రభుత్వం ఉండేది. చివరకు ప్రజలే గెలిచారు. 

అలాగే మోదీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడి గెలిచారు. సత్యం, ప్రజాస్వామ్య విలువలు ఓడిపోవని నిరూపించారు” అని ప్రియాంక వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలని, అలాగే నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని ఓడించే ఎన్నికలని ప్రియాంక ట్వీట్​ చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T01:51:47Z dg43tfdfdgfd