ఫోన్ ట్యాపింగ్​ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్​ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్

  • వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
  • ట్యాపింగ్ పైసలతో ఓట్లను కొనేందుకు సిద్ధమైన్రు  
  • దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
  • బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దొంగలు కేసీఆర్, కేటీఆర్ లేనని..కేసీఆర్ చెబితేనే ఫోన్లను ట్యాప్ చేశామని రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించారని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్  అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేటీఆర్‌‌‌‌ నియోజకవర్గమైన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వార్ రూమ్ ను ఏర్పాటు చేసుకుని తమ ఫోన్లన్నీ ట్యాప్ చేసినట్లు ఈ కేసులో నిందితుడైన ప్రణీత్ రావు చెప్పారని గుర్తు చేశారు. ఇంత స్పష్టమైన ఆధారాలున్నా కేసీఆర్, కేటీఆర్​లను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు,  కేసీఆర్ తో కుమ్కక్కైనందువల్లే తదుపరి విచారణ లేకుండా కేసును నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్​లోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్​తో మార్నింగ్ వాక్ లో పాల్గొనడంతో పాటు కరీంనగర్ కాపువాడలో మున్నూరుకాపు సంఘం నాయకులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బండి సంజయ్ ​పాల్గొని మాట్లాడారు. నమ్మించి గొంతు కోసే రకం కేసీఆర్ అని, మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేందుకు మీ ముందుకొస్తున్నాడని విమర్శించారు. పదేండ్లలో కేసీఆర్ చేసిన మోసాలను, పాపాలను గుర్తు చేసుకోవాని, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు సహా అన్ని వర్గాలను రాచిరంపాన పెట్టిన సంఘటనలను యాది చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు కోట్లాది రూపాయలను ఆయన వియ్యంకుడి ద్వారా పంపించి కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయిస్తున్నారని, బరితెగించి కార్పొరేటర్లకు సంబంధించిన వారి ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున జమ చేశారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని వారి బ్యాంకు లావాదేవీలపై విచారణ జరపడంతోపాటు వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాను పక్కా లోకల్ అని  కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ నాన్ లోకల్ అని, వాళ్లు ఏనాడూ ప్రజా సమస్యలపై పోరాడలేదన్నారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-06T02:45:04Z dg43tfdfdgfd