ఫోన్​ ట్యాపింగ్​ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు!

ఫోన్​ ట్యాపింగ్​ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు!

  • ఆయన ఆధ్వర్యంలోనే సాఫ్ట్​ వేర్స్​ కొనుగోలు
  • ఇజ్రాయెల్​, మలేషియా నుంచి దిగుమతి
  • ఇందుకు సొంత డబ్బులు ఖర్చు చేసిన ఓ ఎమ్మెల్సీ

హైదరాబాద్, వెలుగు : సంచలనం సృష్టిస్తున్న ఫోన్​ ట్యాపింగ్​ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తున్నది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలే లక్ష్యంగా గత బీఆర్​ఎస్​ సర్కార్​లో సాగిన ఈ వ్యవహారం వెనుక ఆ పార్టీకి చెందిన ఓ కీలక ఎంపీ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్యాపింగ్​ సాఫ్ట్​వేర్స్​ కొనుగోలు మొదలు అన్ని పనులు ఆయన ఆధ్వర్యంలోనే నడిచినట్లు భావిస్తున్నారు. ట్యాపింగ్ సాఫ్ట్‌‌‌‌వేర్, ‌‌‌‌పరికరాల కొనుగోలు కోసం ఓ ఎమ్మెల్సీ డబ్బులను ఆ ఎంపీ  వినియోగించినట్లు విచారణలో పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అనుమతులు లేని సాఫ్ట్‌‌‌‌వేర్స్​ను ప్రభుత్వ నిధుల నుంచి కొనుగోలు చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయనే ఇట్ల ఎమ్మెల్సీ నేతృత్వంలో ఇజ్రాయిల్‌‌‌‌, మలేషియా దేశాల నుంచి ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ సాఫ్ట్‌‌‌‌వేర్స్​​ను తెప్పించినట్లు సమాచారం. డబ్బు తరలింపు వ్యవహారంపైనా స్పెషల్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్  టీమ్ ఫోకస్ పెట్టింది. 

అప్పటి మంత్రులపైనా నిఘా

ప్రతిపక్ష నేతలతోపాటు సొంత పార్టీ నేతలను, నాటి ప్రభుత్వంలోని మంత్రులను కూడా ఫోన్​ ట్యాపింగ్​ ద్వారా టార్గెట్​ చేసినట్లు దర్యాప్తులో బయటపడుతున్నది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు నిర్వహించిన ఇద్దరు నేతలతోపాటు పార్టీ మారేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఫామ్​హౌస్​ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఇదే జాబితాలో ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్​ ట్యాపింగ్​పై విచారణ కొనసాగుతుండటంతో కొందరు బీఆర్​ఎస్​ నేతలు గత ప్రభుత్వంలో తమ ఫోన్లు ట్యాప్​ అయ్యి ఉండొచ్చని అంచనాకు వస్తున్నారు.

2019 ఎంపీ ఎన్నికలతోపాటు మునుగోడు, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, దుబ్బాక, హుజూరాబాద్​ ఉప ఎన్నికల టైమ్​లోనూ తమ ఫోన్లు ట్యాపింగ్‌‌‌‌ చేసి ఉంటారని వాళ్లు భావిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులతో ఫోన్‌‌‌‌లో మాట్లాడినా..? వారితో కలిసి ఎక్కడికి వెళ్లినా..?  వెంటనే పార్టీ పెద్దలకు సమాచారం చేరేదని, దీని వెనుక ఫోన్​ ట్యాపింగ్​  ఉండొచ్చని తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. కాగా, ఫోన్​ ట్యాపింగ్​కేసులో అరెస్టయిన ప్రణీత్‌‌‌‌రావు, భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కస్టడీ పిటిషన్‌‌‌‌పై బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. గురువారం తీర్పు వచ్చే అవకాశం ఉంది. 

ట్యాపింగ్ కోసం రెండు సాఫ్ట్‌‌‌‌వేర్స్‌‌‌‌‌‌‌‌

కేంద్ర హోం శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కోసం సాఫ్ట్‌‌‌‌వేర్స్​ను గత బీఆర్​ఎస్​ హయాంలో కొనుగోలు చేశారని పోలీసులు గుర్తించారు. రెండు అత్యాధునిక సాఫ్ట్‌‌‌‌వేర్స్‌‌‌‌ను వాడినట్లు భావిస్తున్నారు. వీటిని ఇజ్రాయెల్​, మలేషియా నుంచి తెప్పించారని..  కన్సల్టెంట్‌‌‌‌రవిపాల్​కు చెందిన కంపెనీల పేరుతో దిగుమతి చేసుకున్నారని దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ట్యాపింగ్‌‌‌‌కు సంబంధించిన ఆధారాలు  దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఉండేలా అత్యాధునిక సాఫ్ట్‌‌‌‌వేర్స్​ను ఉపయోగించినట్లు తెలుస్తున్నది. పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు చెందిన సర్వర్లతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రైవేట్‌‌‌‌ సంస్థల సర్వర్లతో ఆపరేట్‌‌‌‌ చేసినట్లు సమాచారం. ఇందులో పలు ఐటీ కంపెనీలకు చెందిన సర్వర్లను ట్యాపింగ్ కోసం వాడినట్లుగా ఇన్వెస్టిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు గుర్తించినట్లు తెలిసింది.

©️ VIL Media Pvt Ltd.

2024-03-28T01:10:51Z dg43tfdfdgfd