బండ్లగూడ..సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్

బండ్లగూడ..సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్

  •     కంప్లైంట్ ​గురించి ఆరా తీసేందుకు స్టేషన్​కు​ వెళ్లిన సీఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్
  •     ర్యాష్​గా మాట్లాడిన సిబ్బంది
  •     హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డికి బాధితురాలు కంప్లైంట్
  •     విచారణ జరిపి ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు

శంషాబాద్, వెలుగు : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. మహిళా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్​తో ర్యాష్​గా మాట్లాడిన బండ్లగూడ సీఐ, ఎస్సై, కానిస్టేబుల్​ను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. తమ కంప్లైంట్ విషయంలో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగేందుకు వెళ్లిన ఆమెను.. ముగ్గురు ఇష్టమొచ్చినట్టు తిట్టారు. దీంతో బాధితురాలు సీపీకి కంప్లైంట్ చేసింది. విచారణ జరిపిన సీపీ.. బండ్లగూడ సీఐ షాకీర్ అలీ, ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రమేశ్​ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ క్యాంపస్​కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఇంటి ముందు నెల రోజుల కింద నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు యూరిన్ పోసేందుకు ప్రయత్నించారు. ఇది చూసిన ఆమె.. తన భర్తతో కలిసి వారిని అడ్డుకున్నది. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. ఇంటి ముందు యూరిన్ చేయడం ఏంటని సీఆర్పీఎఫ్ జవాన్లను దంపతులిద్దరూ నిలదీశారు. దీంతో వారికి, దంపతుల మధ్య గొడవైంది. నలుగురు జవాన్లు కలిసి ఇద్దరిపై దాడి చేశారు. చివరికి దంపతులు బండ్లగూడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 

వారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు బండ్లగూడ సీఐ షాకీర్ అలీ ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించిన బండ్లగూడ పోలీసులు.. 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఇటీవల బండ్లగూడ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలు.. పెండింగ్‌లో ఉన్న తమ కేసు విషయమై సీఐ షాకీర్ ఆలీ, ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రమేశ్​ను అడిగింది. దీంతో ముగ్గురూ ఆమెతో ర్యాష్‌గా మాట్లాడారు. 

దీంతో దంపతులు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని కలిసి సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ మాట్లాడిన తీరును వివరించారు. కేసు అప్డేట్ గురించి తెలుసుకోవడానికి వెళ్తే ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని కంప్లైంట్ చేశారు. ఘటనపై ఆరా తీసిన సీపీ శ్రీనివాస్ రెడ్డి.. ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు సిబ్బంది ఫ్రెండ్లీ పోలీస్ విలువలను దిగజారుస్తున్నారని ఆయన మండిపడ్డారు.

©️ VIL Media Pvt Ltd.

2024-03-28T01:55:51Z dg43tfdfdgfd