బస్సు యాత్రలతో దుమ్మురేపుతున్న కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్‌గా వ్యూహాలు

సాధారణంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు జాతీయ పార్టీలు మంచి ఫలితాలను సాధించేవి. ఈసారి సీన్ మారింది.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా.. అనూహ్యంగా కాంగ్రెస్ దూసుకొచ్చి.. అధికారాన్ని దక్కించుకుంది. ఇది బీఆర్ఎస్‌కి పెద్ద తలనొప్పిగా మారింది. అధికారాన్ని కోల్పోయిన ఆ పార్టీలో నైరాశ్యం బాగా పెరిగింది. నేతలు తలో దారి చూసుకుంటున్నారు. వీలైతే కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. వారిని నిలువరించేందుకు గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించట్లేదు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి రావాలనీ, బీఆర్ఎస్‌ని పూర్తిగా సైడ్ చెయ్యాలని బీజేపీ వ్యూహాలు రచించడమే కాదు.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కూడా చాలా దూకుడుగా వ్యూహాలు రచిస్తోంది. ఈ పరిస్థితుల్లో రెండు జాతీయ పార్టీల మధ్య.. ప్రాంతీయ పార్టీగా ఉంటూ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తిరిగి కోలుకోవడం అనేది పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో కేసీఆర్ తనదైన వ్యూహాలు రచిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా 2.04 శాతంగా ఉంది. ఇదే విషయాన్ని క్యాడర్‌కి పదే పదే చెబుతున్న బీఆర్ఎస్ నేతలు.. నిరాశ చెందాల్సిన అవసరం లేదంటూ.. వారిలో కాన్ఫిడెన్స్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటినా.. రైతుల రుణమాఫీ, రైతు బంధు, మహిళలకు నెలకు రూ.2500 వంటి చాలా హామీలను అమలు చెయ్యలేకపోయిందనీ.. అందువల్ల కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ అంటున్నారు. ఇటీవలే బస్సు యాత్ర ప్రారంభించిన ఆయన.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలైందా అంటూ.. ప్రధాని మోదీని బలంగా టార్గెట్ చేస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ చాలా బలహీనపడింది. ఆ పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉందని అంటున్నారు. పైగా ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కి ఓటు వెయ్యాలా, బీజేపీకి వెయ్యాలా అని కాకుండా.. బీజేపీకి వెయ్యాలా, వద్దా అన్నది మాత్రమే ఆలోచిస్తారనీ, అందువల్ల ఓటర్లు.. బీజేపీ లేదా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లలో ఏదో ఒక దానికి ఓటు వేసే అవకాశం ఉంటుందనీ, అంతే తప్ప ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాలు తక్కువ అని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌కి ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్.. ప్రస్తుతం ఉన్న 37.35 నుంచి మరో 10 శాతం తగ్గే సంకేతాలు ఉన్నాయంటున్నారు. ఇవన్నీ గమనిస్తున్న కేసీఆర్.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు సాధించినా, సాధించకపోయినా.. ఓట్ల శాతం మాత్రం తగ్గకుండా ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓట్ల శాతం తగ్గితే.. ఇక బీఆర్ఎస్‌ది ముగిసిన కథ అంటున్న కాంగ్రెస్ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అటు బీజేపీ కూడా మరింతగా విస్తరించగలదు. అది బీఆర్ఎస్‌ మనుగడకు ప్రమాదకర సంకేతం కాబట్టే.. కేసీఆర్.. ఎక్కడ లేని ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు. బస్సు యాత్రల్లో రెండు పార్టీలనూ ఉతికారేస్తున్నారు. పదునైన విమర్శలతో చెలరేగుతున్నారు. తద్వారా గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అప్పుడే కారు షెడ్డుకి వెళ్లలేదనీ.. సర్వీసింగ్ జరుగుతోందనే సంకేతాలిస్తున్నారు.

ఓటింగ్ శాతాన్ని అలాగే నిలబెట్టుకుంటే.. అది బీఆర్ఎస్‌కి కొండంత ధైర్యంగా ఉంటుంది. సీట్లు రాకపోయినా.. ఓట్లు బాగానే వచ్చాయని చెప్పుకోవడానికి వీలవుతుంది. అలాగే గులాబీ క్యాడర్ చెదిరిపోలేదనీ, ఎప్పటికైనా బలమైన ప్రతిపక్షం తామే అనేందుకు వీలవుతుంది. అందువల్లే ఇప్పుడు కేసీఆర్ ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ తన హామీలను సరిగ్గా అమలు చెయ్యకపోతే.. ఆ పరిస్థితిని బీజేపీకి కాకుండా.. తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఈ బస్సు యాత్రలు బాగా పనిచేస్తాయని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ కంటే.. బీఆర్ఎస్సే తమ తరపున బలంగా పోరాడుతోందని ప్రజలు, రైతులు, మహిళలు భావించేలా చేసేందుకే కేసీఆర్.. ప్రజల్లోకి వెళ్లారనే వాదన వినిపిస్తోంది. మరి రిజల్ట్స్ ఎలా ఉంటాయి? కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా అన్నది జూన్ 4న తెలుస్తుంది.

2024-04-27T05:09:39Z dg43tfdfdgfd