బావిలో పడిన మేక.. కాపాడబోయి ప్రాణం కోల్పోయిన యువకుడు

కేరళ.. కొల్లం మడత్తర ముల్లస్సేరిలో మధ్యాహ్నం వేళ.. ఓ బావి నుంచి మే.. మే అంటూ.. మేక అరుపులు వినిపించసాగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మడతరకు చెందిన 25 ఏళ్ల అల్తాఫ్.. ఆ కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చుట్టూ చూశాడు. దగ్గర్లో ఎక్కడా మేక లేదు. కానీ ఆ అరుపులు అతనిలో ఏదో తెలియని ఆందోళన కలిగించాయి. ఆ మేక తనను కాపాడమని అరుస్తున్నట్లుగా అతనికి అనిపించింది. దాంతో చుట్టూ చూడగా.. అక్కడో బావి కనిపించింది. అక్కడికి వెళ్లి చూడగా.. నీటిలో కొట్టుకుంటూ ఓ మేక కనిపించింది. అది చూడగానే.. అల్తాఫ్ గుండె కరిగిపోయింది. ఎలాగైనా మేకను కాపాడాలి అనుకున్నాడు.

ఓ తాడు తెచ్చిన అల్తాఫ్.. దాని సాయంతో.. బావిలోకి దిగాడు. కష్టమైనా.. ఎలాగొలా మేకను నీటి నుంచి తిసి.. దానికి తాడు కట్టాడు. ఆ తర్వాత తాడు సాయంతో పైకి ఎక్కుతుండగా.. అల్తాఫ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు.. మేకతోపాటూ.. అల్తాఫ్‌ని కూడా బయటకు తీశారు. ఐతే.. ఊపిరి ఆడని కారణంగా.. అల్తాఫ్ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు.. అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఆ తర్వాత కడక్కల్ ఫైర్ ఫోర్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అల్తాఫ్‌ను రక్షించలేకపోయారు. అతను చనిపోయాడని తేల్చి.. మృతదేహాన్ని కడక్కల్ తాలూకా ఆసుపత్రికి తరలించారు.

అల్తాఫ్ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. అతను నిన్న పని నుంచి ఇంటికి వచ్చాడు. మేకను కాపాడబోయి, ప్రాణం కోల్పోవడంతో.. స్థానికులు అల్తాఫ్‌ని చూసి తీవ్ర ఆవేదన చెందారు.

2024-05-02T03:44:05Z dg43tfdfdgfd