బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు : హైకోర్టు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు : హైకోర్టు

  • తన సంతకం ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్​
  • విచారించిన హైకోర్టు.. విఠల్​ సభ్యత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు
  • అప్పీల్​కు నాలుగు వారాల గడువు

హైదరాబాద్/ ఆదిలాబాద్/కాగజ్​నగర్, వెలుగు: ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. రూ.50 వేల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు విఠల్ కు నాలుగు వారాల గడువు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా బీఆర్ఎస్ అభ్యర్థిగా విఠల్ నామినేషన్ వేశారు. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్​గా నామినేషన్ దాఖలు చేశారు. తాను నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోయినా.. తన సంతకాన్ని దండె విఠల్ ఫోర్జరీ చేసి విత్ డ్రా అయ్యేలా చేశాడంటూ రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

తన నామినేషన్​ను ఉప సంహరించుకున్నట్టు వచ్చిన పత్రాలను రిటర్నింగ్ అధికారి కూడా ఆమోదించినట్టు పిటిషన్​లో పేర్కొన్నారు. విఠల్ ఎన్నికను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. సంతకం ఫోర్జరీ చేసిన దండె విఠల్​పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్​పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సంతకాన్ని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపారు. 

పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు.. ఆ సంతకం రాజేశ్వర్ రెడ్డిది కాదని తేల్చారు. ఈ మేరకు నివేదికను హైకోర్టుకు పంపారు. దీని ఆధారంగా జస్టిస్ కె.లక్ష్మణ్ పిటిషన్​పై విచారించారు. దండె విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా50వేల జరిమానా విధించారు. తీర్పుపై అప్పీల్ దాఖలు చేసుకోవడానికి వీలుగా ఉత్తర్వుల అమలును సస్పెన్షన్​లో ఉంచాలని విఠల్ తరఫు అడ్వకేట్ కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అప్పీల్ చేసేందుకు నాలుగు వారాల గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు 2021, డిసెంబర్​లో జరిగాయి. ఈ ఎన్నికల్లో 667 ఓట్లతో విఠల్ గెలిచారు. 2022, ఫిబ్రవరి 21న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.

సుప్రీం కోర్టులో సవాల్ చేస్తా: దండె విఠల్

ఎమ్మెల్సీగా తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తానని దండె విఠల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగ్గా జరగలేదన్న కారణంతో ఈ తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణతో తనకు సంబంధం లేదని తెలిపారు. ఏది ఏమైనా ఈ తీర్పుపై అప్పీల్ కు 4 వారాల గడువు ఉందని చెప్పారు. సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తానని పేర్కొన్నారు. తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T00:37:01Z dg43tfdfdgfd