బీజేపీ అంటే బ్రిటిష్​ జనతా పార్టీ : సీఎం రేవంత్​రెడ్డి

బీజేపీ అంటే బ్రిటిష్​ జనతా పార్టీ : సీఎం రేవంత్​రెడ్డి

  • సూరత్​ కేంద్రంగా దేశాన్ని దోచుకుంటున్న మోదీ, అమిత్​షా: రేవంత్​రెడ్డి
  • బ్రిటిషర్లలాగా మన మధ్య పంచాయితీ పెట్టి రిజర్వేషన్లనూ రద్దు చేసే కుట్ర
  • బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రమాదం  
  • ఓట్ల కోసం దేవుడిని వాడుకుంటున్నోళ్లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపు
  • తుక్కుగూడ, శంషాబాద్​రోడ్​షోలో సీఎం ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: బీజేపీ అంటే బ్రిటిష్​ జనతా పార్టీ అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. నాడు సూరత్​ కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోచుకుంటే.. ఇప్పుడు సూరత్​ కేంద్రంగా నరేంద్ర మోదీ, అమిత్​షా దేశా న్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. బ్రిటిష్​ వారి లాగే మన మధ్య పంచాయితీ పెట్టి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్​ పార్టీని గెలిపించాలని కోరారు. 

ఆదివారం తుక్కుగూడలో చేవెళ్ల కాంగ్రెస్​ అభ్యర్థి రంజిత్​రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్​రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రిజర్వేషన్ల రద్దు అనే ప్రమా దం మెడపై కత్తిలా వేలాడుతోందని అన్నారు. రిజర్వేషన్లను రద్దుచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలను అదానీ, అంబానీలకు బానిసలుగా మార్చబోతున్నారని ఆరోపించారు. 

కేంద్రంలోని మోదీ విధానాలను ప్రశ్నిస్తే తనపై పోలీసులు కేసులు పెడతామంటున్నారని, తానేం భ యపడే వాడిని కాదని చెప్పారు. రేవంత్​రెడ్డి అంటే ఏమిటో తెలంగాణలో కేసీఆర్​ను అడిగితే తెలుస్తుందని చెప్పారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్​అనే గజ్వేల్​ ఫామ్​హౌస్​ గజినీ అరెస్టు చేయించి జైలుకు పంపినా తాను భయపడలేదని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్​ పార్టీనే వంద మీటర్ల లోతున బొందపెట్టానని అన్నారు.  

రాజకీయాల కోసం హిందుత్వాన్ని వాడుకుంటున్నరు

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట కాకముందే అక్షింతలు పంచి రాముడినే మోసం చేసిన బీజేపీ.. హిందుత్వాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు వాడు కుంటోందని రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘భద్రాచల రాముడిపై ఒట్టేసీ అప్పుడు తాము పంచి నవి రాముడి అక్షింతలని చెప్పే ధైర్యం వారికి ఉందా? నిజంగా విగ్రహ ప్రతిష్ట జరిగాకే అక్షింతలు తెచ్చారని ప్రమాణం చేయగలరా?”అని ప్రశ్నించారు. 

రాము డినే మోసం చేసిన బీజేపీ నేతలకు ప్రజలను మోసం చేయడం చిన్న విషయమని చెప్పారు. ‘దేవుడంటే మీకు ఓట్లు.. రాముడంటే మీకు సీట్లు.. హనుమాన్ అంటే మీకు అధికారం కావొచ్చు.. రాముడు, హనుమంతుడిని పూజించే మేం నిజమైన హిందువులం మేం. మైసమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ వంటి దేవతలను పూజించే వాళ్లం. ఇది మా సంప్రదాయం”అని పేర్కొన్నారు. ఓట్ల కోసం హిందువులుగా చెప్పుకునేవారు నిజమైన హిందువులు కాదని పేర్కొన్నారు.. 

సెంటిమెంట్​పేరుతో పదేండ్లు దోచుకున్నడు

తెలంగాణ సెంటిమెంట్​ పేరుతో రాష్ట్రాన్ని కేసీఆర్​ పదేండ్లు దోచుకున్నాడని రేవంత్​ మండిపడ్డారు. ‘కేసీఆర్​.. వెయ్యి ఎకరాల్లో ఫామ్​హౌస్​ కట్టుకు ని, వేల కోట్లు దోచుకుంటే.. ఆయన కొడుకు (కేటీఆర్) జన్వాడలో వెయ్యి కోట్లతో ఫామ్ హౌస్​ కట్టుకున్నడు.. టీవీలు, పేపర్లు పెట్టుకున్నరు.. వేల కోట్లు సంపాదించుకున్నరు’ అని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి అంటూ ఒకడు రాష్ట్రాన్ని, రాముని జపం చేస్తూ మరొకడు దేశాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు.  

కందుకూరులో మెడికల్​ కాలేజీ ఏర్పాటుకు కృషి 

కందుకూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే బాధ్య త తనదేనని రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు. చేవెళ్లలో సబిత ఇంద్రారెడ్డి.. బీఆర్ఎస్​కు కాకుండా బీజేపీకి ఓటువేయాలని కోరుతున్నారని అన్నారు. ‘సబితక్కా ఇది మీకు న్యాయమా?’అని ప్రశ్నించారు.  బీఆర్ఎస్​ నాయకులను నమ్మి మోసపోవద్దని ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ‘‘తెలంగాణకు బీజేపీ ఇచ్చింది, మోదీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప’’ అని రేవంత్​ రెడ్డి ఎద్దేవా చేశారు.  

బీజేపీని డకౌట్​ చేస్తా

నిరుడు డిసెంబర్ లో బీఆర్ఎస్​ ను బొంద పెట్టి  సెమీఫైనల్స్  గెలిచామని, ఈ నెల 13న ఫైనల్స్ ఉన్నాయని, తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్యే మ్యాచ్​ అని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాను బీజేపీని డకౌట్​ చేస్తానని చెప్పారు. శంషాబాద్ లో రాత్రి  నిర్వహించిన కార్నర్  మీటింగ్ లో సీఎం రేవంత్ మాట్లాడారు. పదేండ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఈ ప్రాంతానికి పది పైసలు కూడా ఇయ్యకుండా ఏ ముఖం పెట్టుకొని ఇక్కడకు వస్తున్నారని ప్రశ్నించారు. ఔటర్ చుట్టూ ఐటీ కంపెనీలు ఉన్నాయని, కేంద్రంలో కాంగ్రెస్​ సర్కారు ఉన్నప్పుడు ఇక్కడ ఐటీఐఆర్ కారిడార్ కోసం అనుమతులిస్తే.. వాటిని మోదీ రద్దు చేశారని చెప్పారు.  

మూసీ సుందరీకరణ,  శంషాబాద్  ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు, గోదావరి జలాలను తరలించేందుకు నిధులు ఇవ్వలేదన్నారు. రాజేంద్రనగర్ లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరిగిన తప్పు మరోసారి జరగకుండా చూడాలన్నారు. రంజిత్​రెడ్డి లక్ష ఓట్లతో గెలిస్తే శంషాబాద్ కు మెట్రో, గోదావరి నీళ్లు, మూసీ డెవలప్ మెంట్ ఇలా ఎన్నో పనులు అవుతాయని హామీ ఇచ్చారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చే బాధ్యత కూడా రంజిత్ రెడ్డి తీసుకుంటారని చెప్పారు. బీఆర్ఎస్​ పని అయిపోయిందని, కారును జుమ్మెరాత్ బజార్ లో తూకం లెక్కన అమ్మే సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్ బస్సెక్కిండని చురకలంటించారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T01:59:58Z dg43tfdfdgfd