భారతదేశ సార్వత్రిక ఎన్నికలు 2024: 93 స్థానాలకు పోలింగ్.. బరిలో అమిత్ షా, సింధియా సహా ప్రముఖులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. ఈ దశలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉన్నా.. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో ఓటింగ్ మే 25కు వాయిదా పడింది. ఇక, ఈ దశలో మొత్తం 1,300 మందికిపైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, పురుషోత్తమ్‌ రూపాలా, ప్రహ్లాద్‌ జోషి, ఎస్‌.పి.సింగ్‌ బఘేల్‌, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. బారమతిలో అజిత్ పవార్ భార్య సునేత్రా, సుప్రియా మధ్య కుటుంబపోరు ఆసక్తికరంగా మారింది.

అలాగే, అభ్యర్థుల్లో 120 మందికిపైగా మహిళలు ఉండటం విశేషం. ఈ దశలో పోలింగ్ జరగనున్న గుజరాత్‌, కర్ణాటక, బిహార్‌, మధ్యప్రదేశ్‌ల్లోని అన్ని సీట్లను 2019 లోక్‌భ ఎన్నికల్లో బీజేపీయే దక్కించుకుంది. ఈసారి వాటిని నిలబెట్టుకునేందుకు కాషాయ పార్టీ తీవ్రంగా కృషిచేస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మూడో విడతలో ఒకేసారి పోలింగ్ జరుగుతుండగా.. సూరత్‌లో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మిగిలిన 26 సీట్లకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం పోటీలో ఉండగా.. దాని పరిధిలోని అహ్మదాబాద్‌ నగరంలో మోదీ, షాలు ఓటు వేయనున్నారు. మూడో విడతతో మొత్తం 543 సీట్లకుగానూ.. సగం స్థానాల్లో పోలింగ్ పూర్తవుతుంది. తొలిదశలో 102, రెండో దశలో 83 స్థానాలకు పోలింగ్ ముగిసింది.

కర్ణాటకలోని 28 సీట్లకుగానూ.. రెండో విడతలో సగం స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ దశలో మిగతా 14 సీట్లలో మంగళవారం ఓటింగ్‌ జరగనుంది. దక్షిణాదిలో కనీసం 50 స్థాలను లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. దాన్ని చేరుకోవాలంటే కర్ణాటక అత్యంత కీలకం. అయితే, ఈసారి అక్కడ మిత్రపక్షం జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాల అంశం కొంత ఇబ్బందిగా మారింది. గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. జాతీయ స్థాయిలోనూ పట్టు బిగించాలని చూస్తోంది. అందులో భాగంగా కన్నడనాట ఈసారి మెజార్టీ సీట్లు దక్కించుకోవడంపై దృష్టిసారించింది.

యూపీలో ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబానికి ఈ దశ చాలా కీలకం. ఆ కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. మైన్‌పురీలో డింపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తుండగా.. ములాయం మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. ఎస్పీ జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్‌ యాదవ్‌ కుమారుడు అక్షయ యాదవ్‌ ఫిరోజాబాద్‌ నుంచి, శివపాల్‌ యాదవ్‌ కుమారుడు ఆదిత్య యాదవ్‌ బదాయూ నుంచి బరిలో నిలిచారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T01:23:48Z dg43tfdfdgfd