ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌ గాంధీకు రష్యా చెస్ దిగ్గజం సలహా!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi)కి చదరంగం ఆటపై ఉన్న ఇష్టానికి సంబంధించి రష్యాకు చెందిన చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ (Garry Kasparov) కీలక వ్యాఖ్యలు చేశారు. చెస్‌ (Chess)లో అగ్రస్థానానికి పోటీపడే ముందు మీరు మొదట రాయ్‌బరేలీ (Rae Bareli)లో గెలవాలని కాస్పరోవ్‌ సలహా ఇచ్చారు. ఎక్స్‌ (ట్విటర్‌)లో రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ఓ నెటిజన్ చేసిన పోస్టుపై కాస్పరోవ్‌ సరదగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళుతూ ఇటీవల తన మొబైల్ ఫోన్‌లో చెస్‌ ఆడతూ ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ పలు విషయాలు వెల్లడించారు.

రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ తన అభిమాన చెస్‌ క్రీడాకారుడని, అతనొక నాన్‌ లీనియర్‌ థింకర్‌ అని కాంగ్రెస్ ఎంపీ చెప్పుకొచ్చారు. అంతేకాదు, రాజకీయాలకు, చదరంగానికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయన్న రాహుల్... ఆటపై ఒక్కసారి దృష్టి సారిస్తే ప్రత్యర్థి పావులుసైతం మన సొంతమవుతాయని తెలిపారు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చదరంగం ఆటగాడ్ని అని పేర్కొన్నారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే, ఈ పోస్ట్‌పై సందీప్ ఘోష్ అనే యూజర్ వ్యంగ్యంగా స్పందించాడు.

‘చెస్‌ దిగ్గజాలు గ్యారీ కాస్పరోవ్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌‌లు చాలా తొందరగా ఆట నుంచి రిటైర్‌ అయ్యారు. వారికి మన కాలంలోని గొప్ప మేథావిని ఎదుర్కొనే అవకాశం రాలేదు.. ఇది నాకు చాలా ఉపశమనంగా ఉంది’ అతడు కామెంట్ పెట్టాడు. దీనిపై కాస్పరోవ్‌ స్పందిస్తూ.. అగ్రస్థానానికి వెళ్లే ముందు రాయ్‌బరేలీలో గెలవాలని రాహుల్‌కు సలహా ఇచ్చారు.

రష్యాకు చెందిన 61 ఏళ్ల కాస్పరోవ్‌ చదరంగంలో ఎన్నో ఘనతలు సాధించారు. అతి చిన్న వయసులోనే (22 ఏళ్లకు) ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించారు. చెస్‌లో చాలాసార్లు ప్రపంచ విజేతగా నిలిచారు. 2005లో రిటైర్ అయిన ఆయన.. తరుచూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. దీంతో కొన్నేళ్ల క్రితం రష్యా నుంచి పారిపోయి.. ప్రస్తుతం క్రొయేషియాలో తలదాచుకుంటున్నారు. ఇటీవలే కాస్పరోవ్‌ను ‘ఉగ్రవాదులు, అతివాదుల’ జాబితాలో పుతిన్ చేర్చడం గమనార్హం. కాగా, భారత్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు డి గుకేశ్ కాస్పరోవ్ రికార్డును బద్దలుకొట్టడంతో శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. గుకేశ్‌ను భారత భూకంపం అని కితాబిచ్చారు.

ఇక, కాంగ్రెస్‌ కంచుకోట అయిన రాయ్‌బరేలీ పార్లమెంట్ స్థానానికి ఇప్పటి వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. కానీ, ఆమె వయసు పైబడటంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో ఆ స్థానం నుంచి రాహుల్‌ గాంధీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శుక్రవారమే ఆయన తన నామినేషన్‌ వేశారు. ఐదో విడతలో మే 20న ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది. రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వాయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T03:47:53Z dg43tfdfdgfd