ముదిరాజ్​లను బీసీ–ఎలో చేర్చొద్దు

ముదిరాజ్​లను బీసీ–ఎలో చేర్చొద్దు

  • సీఎం రేవంత్​ప్రతిపాదన కరెక్ట్​కాదు
  • బీసీ–ఎలోని 56 కుల సంఘాల ప్రతినిధులు

బషీర్ బాగ్, వెలుగు: బీసీ– డి జాబితాలో ఉన్న ముదిరాజ్​లను బీసీ–ఎలో కలుపుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీసీ–ఎ జాబితాలోని 56 కుల సంఘాల నాయకులు తప్పుబట్టారు. శుక్రవారం బషీర్ బాగ్ లో నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బీసీ–ఎ 56 కుల సంఘాల సలహాదారుడు డాక్టర్ బాగయ్య మాట్లాడుతూ.. బీసీ–ఎలో అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయని.. రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన ముదిరాజ్​లను బీసీ–ఎలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. 

సీఎం రేవంత్​ప్రతిపాదన.. అనంతరామన్ కమిషన్ సిఫార్సుకు విరుద్ధమన్నారు. ఓట్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారని విమర్శించారు. ముదిరాజ్​లపై నిజంగా ప్రేమ ఉంటే, వారికి మంత్రి పదవి ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే 56 కులాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో బీసీ–ఎ 56 కులాల ప్రతినిధులు గడప శ్రీహరి, రాపోలు సుదర్శన్, ఎ.ఎల్.సుధాకర్, డి.నాగరాజు  పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-27T04:55:22Z dg43tfdfdgfd