మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు

మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు

ఇంఫాల్: మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని ఏడాది అయింది. ఇప్పటి వరకూ హింస కారణంగా 200 మంది చనిపోయారు. వేల మంది తమ ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. 50 వేల మంది బాధితులు ఇంకా శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కుకీలు పొందుతున్న రిజర్వేషన్లను మైతీ సామాజికవర్గానికి కూడా అందించాలని గత సంవత్సరం ఓ స్థానిక కోర్టు ఆదేశించినప్పటి నుంచి మైతీలు, కుకీల మధ్య అల్లర్లు ప్రారంభమయ్యాయి. 

మైతీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని కుకీలు, కోర్టు ఆదేశాలు అమలు చేయాలని మైతీలు ర్యాలీలు తీయడంతో నిరుడు మే 3న రెండు వర్గాల మధ్య హింస నెలకొంది. ఆ హింస కారణంగా రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇంఫాల్  వ్యాలీలో మైతీలు, కాంగ్ పోప్కి ప్రాంతంలో కుకీల జనాభా ఎక్కువ. అలాగే ఉత్తర కొండ ప్రాంతంలో నాగాలు మెజారిటీగా ఉన్నారు. 

హింస నెలకొన్నప్పటి నుంచి ఒక వర్గం వారు మరో వర్గానికి చెందిన ప్రాంతానికి వెళ్లలేని భీకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రాణ రక్షణ కోసం మైతీలు, కుకీలకు చెందిన యువతీ యువకులు తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు. నిరుడు గొడవలు జరుగుతున్నపుడు రెండు వర్గాల వారూ బలగాల దగ్గర గన్స్ ఎత్తుకెళ్లారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆ ఆయుధాలను సరెండర్  చేయాలని అధికారులు ఆదేశించినా ఎవరూ వాటిని వెనక్కి ఇవ్వలేదు. నిరుడు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వారాలపాటు అల్లర్లు చోటుచేసుకోగా.. ఆ సమయంలో దాదాపు 4,200 ఆయుధాలను ఆందోళనకారులు ఎత్తుకెళ్లారు. 

ఇంకా రిలీఫ్​ క్యాంపులలోనే మైతీలు

మణిపూర్  జనాభాలో మైతీలు 53 శాతం ఉన్నారు. అల్లర్ల కారణంగా వారిలో చాలా మంది ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. చాలా మంది ఇంకా రిలీఫ్​ క్యాంపుల్లోనే భయం భయంగా గడుపుతున్నారు. ‘‘అల్లర్ల కారణంగా మేం ఇండ్లు మాత్రమే కాదు. సర్వం కోల్పోయాం. మళ్లీ ఇండ్లు నిర్మించుకొని సాధారణ జీవితం గడపాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది” అని చురాచాంద్ పూర్ కు చెందిన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మైతీ వర్గం వ్యక్తి తెలిపాడు. అల్లర్లకు ముందు చురాచాంద్ పూర్ లో తాను ట్రాన్స్ పోర్ట్  వ్యాపారం చేసేవాడినని, ప్రస్తుతం ఆ వ్యాపారం కూడా లేకుండా పోయిందని అతను వాపోయాడు. రాష్ట్రంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని అతను చెప్పాడు. కాగా, మణిపూర్ లో రెండు లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. గత నెల 19, 26 తేదీల్లో పోలింగ్ పూర్తయింది. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-06T03:45:15Z dg43tfdfdgfd