మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్

మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్

గోదావరిఖని, వెలుగు: దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించాలని, ఏఐటీయూసీ బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, సీనియర్ జర్నలిస్టు మునీర్ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి గోదావరిఖని భాస్కర్‌‌రావు భవన్​లో జరిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆర్జీ– 1 బ్రాంచ్‌ జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. 

దివంగత కాకా వెంకటస్వామి కేంద్రమంత్రిగా కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చే శారు. పదేండ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు, కార్మికులకు చేసిందేమీ లేదని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్​లుగా మార్చిందని ఆరోపించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టారన్నారు. పీఎం మోదీ భక్తి.. రాముడిపై కాదని, ఢిల్లీ పీఠంపై ఉందని, ఆయనకు ఆదాని, అంబానిల లాభాలు తప్ప ప్రజల కష్టాలు పట్టవని విమర్శించారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల జీవితాలను రాజ్యాంగం మార్పు పేరుతో నాశనం చేసేందుకు కుట్రు పన్నుతున్న బీజేపీని ఓడించాలన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను, సొంతింటి పథకం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల అమలుపై పార్లమెంటు ఎన్నికల తర్వాత సీఎంతో మాట్లాడుతానని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, వై.వి.రావు, ఎల్.ప్రకాశ్‌, జీగురు రవీందర్, ఎం.ఆర్.సి.రెడ్డి, మాదన మహేశ్‌, సంకె అశోక్, రంగు శ్రీనివాస్, బుర్ర తిరుపతి, ఎం.ఎ.గౌస్, శనగల శ్రీనివాస్, కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ, ఇనుముల రాజమౌళి, సంబోదు కొంరయ్య పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T02:45:04Z dg43tfdfdgfd