మధుమేహంతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు జైలులో ఇన్సులిన్

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ రక్తంలో షుగర్ స్థాయిలు విపరీతంగా పెరగడంతో ఎట్టకేలకు జైలు అధికారులు ఇన్సులిన్ సూదిని ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బీబీసీకి వెల్లడించింది.

మార్చి 21న అరెస్టు అనంతరం, కేజ్రీవాల్‌ను దిల్లీలోని తీహాడ్ జైలుకు తరలించారు.

గతంలో అవినీతిపై పోరాటం చేసిన కేజ్రీవాల్, ఇప్పుడు అవినీతికి పాల్పడ్డారని అధికారులు ఆరోపిస్తున్నాయి. అయితే, ఆ ఆరోపణలను కేజ్రీవాల్ ఖండిస్తున్నారు.

దేశంలో అత్యంత కీలకమైన పార్లమెంటు ఎన్నికలకు ముందుగా ఆయన అరెస్టు కావడంతో చాలా మంది షాక్‌కు గురయ్యారు.

కేజ్రీవాల్‌తోపాటు మరికొన్ని ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా ఎన్నికలకు ముందు తీసుకుంటున్న ఈ చర్యలు రాజకీయ దురుద్దేశాలతోనే తీసుకుంటున్నారని విమర్శకులు అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అందరికీ సమానత్వమనే భావనకు ఇది విరుద్ధమని చెబుతున్నారు. అయితే, దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అంటోంది.

కేజ్రీవాల్ మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయనను జైలుకు తరలించడంతో ఆయన ఆరోగ్యంపై పార్టీ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ విషయంలో ఆప్, జైలు అధికారులు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి.

కేజ్రీవాల్ కావాలనే జైలులో చాలా మామిడిపళ్లు, స్వీట్లు తింటున్నారని, ఫలితంగా ఆయన రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతున్నాయని, బెయిలు కోసమే ఆయన ఇలా చేస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపిస్తోంది.

అయితే, ఈ ఆరోపణలను ఆప్ నేతలు, కేజ్రీవాల్ ఖండిస్తున్నారు. అంతేకాదు, ఆయనకు చికిత్స అందించడంలో తిహాడ్ జైలు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, అందుకే ఆయన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతున్నాయని అంటున్నారు.

గత పది రోజుల నుంచి ఇన్సులిన్ ఇవ్వాలని అడుగుతున్నప్పటికీ, ఇవ్వడంలేదని గత సోమవారం జైలు ఉన్నతాధికారులకు కేజ్రీవాల్ ఒక లేఖ రాశారు.

‘‘నన్ను చూడటానికి వచ్చే డాక్టర్‌కు నా రక్తంలో హైషుగర్ లెవల్స్ చూపించాను. ప్రతి రోజూ 250 నుంచి 320 మధ్య మూడు స్పైక్‌లు వస్తున్నాయని వారికి చెప్పాను’’ అని లేఖలో కేజ్రీవాల్ చెప్పారు.

రక్తంలో షుగర్ స్థాయి 140 ఎంజీ/డీఎల్ మధ్య ఉండటాన్ని సాధారణంగా పరిగణిస్తారు.

ఉదయం అల్పాహారం తీసుకోకముందు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 160 నుంచి 200 ఎంజీ/డీఎల్ మధ్య ఉంటున్నాయని లేఖలో కేజ్రీవాల్ చెప్పారు. సాధారణంగా ఇది 70 నుంచి 100 ఎంజీ/డీఎల్ మధ్య ఉండాలి.

అయితే, వీడియో కన్సల్టేషన్‌ సమయంలో డాక్టర్లకు ఇన్సులిన్ ఇవ్వాలని ఆయన అడకపోవడంతోనే ఆయనకు ఇన్సులిన్ ఇవ్వలేదని జైలు అధికారులు అంటున్నారు.

ఆయనకు ఇవ్వాల్సిన ఔషధాలను నిర్ధారించాలని మంగళవారం ఒక కోర్టు దిల్లీ ఎయిమ్స్ నిపుణులకు సూచించింది. ఆ తర్వాత సోమవారం సాయంత్రమే ఇన్సులిన్ సూదిని ఇచ్చారని ఆప్ అధికార ప్రతినిధి ప్రీతమ్ పాల్ సింగ్ బీబీసీకి వెల్లడించారు.

కేజ్రీవాల్‌కు చికిత్స అందకపోవడం వెనుక బీజేపీ హస్తముందని ఆప్ ఆరోపిస్తోంది.

‘‘సీఎంకు ఇన్సులిన్ అవసరం. కానీ, బీజేపీ కోసం పనిచేస్తున్న అధికారులు ఆయనకు ఇన్సులిన్ అందకుండా అడ్డుకుంటున్నారు’’ అని ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

అయితే, ఎన్నికల సమయంలో సానుభూతి కోసం ఆప్ ప్రయత్నిస్తోందని బీజేపీ అంటోంది.

దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఎన్‌డీటీవీతో తాజాగా మాట్లాడారు.

‘‘కేజ్రీవాల్‌కు మధుమేహం ఉన్న మాట వాస్తవమే. కానీ, జైలులో ఆయన రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలోనే ఉంది’’ అని ఆయన చెప్పారు.

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ నాయకుల్లో కేజ్రీవాల్ మూడోవారు. అయితే, తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ అంటున్నారు. తనపై అభియోగాలను మోసపూరితంగా మోపుతున్నారని, వీటిని రుజువు చేయడంలో ఈడీ విఫలం అవుతోందని ఆయన చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-23T10:59:32Z dg43tfdfdgfd