మిగిలిన మూడు ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు : కాంగ్రెస్​ పార్టీ

మిగిలిన మూడు ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు : కాంగ్రెస్​ పార్టీ

  • కరీంనగర్​కు వెలిచాల రాజేందర్​రావు,హైదరాబాద్​కు వలీవుల్లా సమీర్
  • ఖమ్మం టికెట్​ రఘురాంరెడ్డికి..ప్రకటించిన కాంగ్రెస్​ హైకమాండ్​
  • వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న

న్యూఢిల్లీ, వెలుగు :  రాష్ట్రంలో మిగిలిన 3 లోక్​సభ స్థానాలకు కాంగ్రెస్​ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును, ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని, హైదరాబాద్ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్​ను ఓకే చేసింది. దీంతో మొత్తం 17 స్థానాలకు కాంగ్రెస్​ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. 

అదేవిధంగా వరంగల్– ఖమ్మం–-నల్గొండ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్​ మల్లన్న పేరును ప్రకటించింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదంతో అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 308కి చేరింది. 

ఖమ్మంతోనే ఇన్ని రోజులు పెండింగ్

తెలంగాణ 17 లోక్​సభ స్థానాలు ఉండగా.. 14 స్థానాలకు సర్వేల ఆధారంగా అభ్యర్థులను కాంగ్రెస్​ ప్రకటించింది. ఖమ్మంపై మాత్రం మొదటి నుంచి ఎటూ తేల్చుకోలేకపోయింది. కరీంనగర్, హైదరాబాద్ స్థానాల అభ్యర్థుల ప్రకటనను కూడా వాయిదా వేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఖమ్మం ఎంపీ సీటు కోసం సీనియర్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్ ఈ స్థానం నుంచి పోటీ కోసం ప్రయత్నించారు. 

అధిష్టానం మాత్రం పాతతరం కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి కుమారుడు రామసహాయం రఘురాంరెడ్డి పేరును ఫైనల్​ చేసింది. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావుకు కాంగ్రెస్​ టికెట్ కన్ఫామ్ చేసింది. ఇదే స్థానం నుంచి టికెట్ ఆశించిన తీన్మార్ మల్లన్నను మండలికి పంపాలని నిర్ణయింది. త్వరలో జరిగే  వరంగల్-– ఖమ్మం-– -నల్గొండ గ్రాడ్యుయేట్​ కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఆయనను అభ్యర్థిగా ఖరారు చేసింది.

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-25T02:31:47Z dg43tfdfdgfd