మే 7 నుంచి ఎప్ సెట్ .. అటెండ్ కానున్న 3.54 లక్షల మంది విద్యార్థులు

మే 7 నుంచి ఎప్ సెట్ .. అటెండ్ కానున్న 3.54 లక్షల మంది విద్యార్థులు

  • పరీక్షకు నిమిషం నిబంధన అమలు
  • బయోమెట్రిక్, ఫేషియల్ అటెండెన్స్ అమలు 

హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎప్ సెట్ –2024  మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ పరీక్షకు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు ఆన్​ లైన్​లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షకు మొత్తం 3,54,803 మంది స్టూడెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈనెల 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో 1,00,260 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్ రాయనున్నారు. 

వారికోసం 135 ఎగ్జామ్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 9,10,11 తేదీల్లో జరిగే ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు 2,54,543 మంది అటెండ్ కానుండగా.. వారికోసం166 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సెకండ్ సెషన్ లో ఎగ్జామ్ జరగనున్నది.

 పరీక్ష టైమ్​కు గంటన్నర ముందు నుంచే స్టూడెంట్లను సెంటర్​లోకి అనుమతిస్తారు. విద్యార్థులకు బయోమెట్రిక్ తో పాటు తొలిసారిగా ఫేషియల్ అటెండెన్స్ తీసుకోనున్నారు.  పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 216 మంది అబ్జర్వర్లను నియమించారు. కాగా, ఈ సంవత్సరం ఎప్ సెట్ కు 54 ఏండ్ల మహిళ కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. 

గంట ముందే సెంటర్​కు రావాలి: విజయకుమార్ రెడ్డి, ఎప్ సెట్ కో కన్వీనర్ 

విద్యార్థులు పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి కనీసం గంట ముందు చేరుకోవాలి. కరెక్ట్ టైమ్ కు సెంటర్ కు వస్తే విద్యార్థులకు టైమ్ లాస్ అయ్యే అవకాశం ఉంది. సెంటర్ లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను, సెల్ ఫోన్లను అనుమతించడం లేదు. విద్యార్థులు వాటర్ బాటిల్స్ తీసుకురావద్దు. సెంటర్ లోనే మంచినీళ్లు అందిస్తాం. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T01:59:57Z dg43tfdfdgfd