రిజర్వేషన్లకు నెహ్రూ కూడా వ్యతిరేకమే..?: ఆసక్తికర కథనం వెలుగులోకి

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార బిజెపి, ప్రతిపక్ష బిజెపి మధ్య రిజర్వేషన్లపై మాటలయుద్దం సాగుతోంది. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తుందని... బడుగు బలహీనవర్గాల ప్రజలకు కల్పించిన రిజర్వేషన్లను తొలగిస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బిజెపి మాత్రం తాము కేవలం మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని...రాజ్యాంగం కల్సించిన రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని చెబుతుంది. ఇలా ఇరు జాతీయ పార్టీలు రిజర్వేషన్ల విషయంలో వాగ్వాదానికి దిగుతున్నాయి.  ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. 

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లుగా ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ పాతకథనం వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం... షెడ్యూల్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్టీ) లకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి తాను వ్యతిరేకమంటూ నెహ్రూ మాట్లాడారు. ఈ రిజర్వేషన్లు వారిలో న్యూనతా భావాన్ని కల్పిస్తాయన్నది నెహ్రూ అభిప్రాయపడినట్లుగా ఈ కథనం సారాంశం. 

అయితే రిజర్వేషన్లపై బిజెపి, కాంగ్రెస్ ల మధ్య పొలిటికల్ వార్ జరుగుతున్న వేళ ఈ కథనం ఆసక్తికరంగా మారింది. ఇది కాంగ్రెస్ పార్టీని కాస్త ఇరకాటంలో పెట్టవచ్చు. రిజర్వేషన్లపై మాజీ ప్రధాని నెహ్రూ అభిప్రాయం ప్రస్తుతం మోదీ అభిప్రాయానికి దగ్గరగా వున్నట్లుంది. ఆయన ఎస్సి, ఎస్టీలకు రిజర్వేషన్లు వద్దని అభిప్రాయపడితే ప్రస్తుతం మోదీ మతపరమైన రిజర్వేషన్లు  వద్దంటున్నారు. ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 

తమ ఓటు బ్యాంక్ కోసమే కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లను తెరపైకి తెస్తోందని బిజెపి ఆరోపిస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్లను రాజ్యాంగం సైతం ఒప్పుకోదు... కానీ ముస్లిం ఓటుబ్యాంకు కోసం కాంగ్రెస్ దీన్ని అమలుచేస్తామని హామీలు ఇస్తోందంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వబోమని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్నికల సభల్లో బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. 

ఈ క్రమంలోనే రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. దీన్ని తమ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటోంది. కానీ ఇప్పుడు నెహ్రూ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారన్న వార్త కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేదిగా వుంది. దీన్ని బిజెపి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. ఇలా బిజెపి, కాంగ్రెస్ ల మధ్య రిజర్వేషన్ల వివాదం మరో మలుపు తిరిగింది. 

2024-05-08T17:19:01Z dg43tfdfdgfd