రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు

రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు

  • పునర్విచారణకు ఆదేశిస్తం.. న్యాయం జరిగేలా చూస్తం
  • రోహిత్​ తల్లికి సీఎం రేవంత్​రెడ్డి హామీ

హైదరాబాద్​, వెలుగు: రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో 2016లో రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకోగా.. వర్సిటీ వీసీతో పాటు పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాల్లేవంటూ శుక్రవారం హైకోర్టు  విచారణను ముగించింది. దీంతో రోహిత్‌ తల్లి రాధిక శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి.. న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఇందుకు సీఎం స్పందిస్తూ.. కేసు పునర్విచారణ చేపట్టి, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయమై ఆయన ట్విట్టర్​(ఎక్స్)​లో ట్వీట్​ చేశారు. ‘‘రోహిత్ వేముల తల్లి రాధిక వేముల నన్ను కలిశారు. తన కుమారుడు ఆత్మహత్య కేసు విచారణలో తగు న్యాయం చేయాలని కోరారు. ఎనిమిదేండ్ల కింద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య  సంఘటన ఎంతగానో కలచివేసింది.  ఆనాడు  రాహుల్ గాంధీ  స్వయంగా సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటాం” అని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, కేసును పునర్విచారిస్తామని డీజీపీ కూడా ఇప్పటికే ప్రకటించడంతో.. పునర్విచారణకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును కోరనున్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-05T02:11:12Z dg43tfdfdgfd