లాటరీలో పది వేల కోట్లు గెలుచుకున్న ఈ క్యాన్సర్ బాధితుడు జీవితాన్ని కొనుక్కోగలరా?

అమెరికాకు వలసొచ్చిన ఓ వ్యక్తి భారీ లాటరీ గెలుచుకున్నారు. ఇది అమెరికా చరిత్రలోనే నాల్గో అతిపెద్ద లాటరీ. లావోస్‌కు చెందిన చెంగ్ సైఫాన్ 1.3 బిలియన్ డాలర్ల విలువైన 'పవర్‌బాల్ లాటరీ'ని గెలుచుకున్నారు.

భారత కరెన్సీలో ఈ మొత్తం విలువ దాదాపు పది వేల కోట్ల రూపాయలకు పైనే.

ఎన్నో రాత్రులు పేపర్లు దిండు కింద పెట్టుకుని నిద్రపోయినట్లు ఆయన చెప్పారు.

పవర్‌బాల్ లాటరీని గెలుచుకోవడానికి లెక్కలు వేసుకున్న కాగితాల కట్టలు కొన్నివారాల పాటు ఆయన దిండు కిందే ఉన్నాయి.

అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ పోర్ట్‌ల్యాండ్‌లో నివసిస్తున్న సైఫాన్ తన పరిస్థితిని గుర్తు చేసుకుంటూ, ''నేను సాయం కోసం దేవుడిని వేడుకున్నా. నా పిల్లలు చిన్నవాళ్లు. నేను చాలా బలహీనంగా ఉన్నా. నా ఆరోగ్యం బాలేదు'' అన్నారు.

ఏప్రిల్ 7న తీసిన డ్రాలో 1.3 బిలియన్ డాలర్ల విలువైన లాటరీకి ఆయన దగ్గరున్న టికెట్ నంబర్లు సరిపోలాయి. లాటరీ నిర్వాహకులు సోమవారం విజేతకు ప్రైజ్ మనీ అందించారు.

ఈ లాటరీతో సైఫాన్‌తో పాటు ఆయన భార్య, స్నేహితులను కూడా అదృష్టం వరించింది.

ఆయన తన భార్య, స్నేహితుడితో కలిసి 20కి పైగా లాటరీ టిక్కెట్లు కొన్నారు. వాటిలో ఒక నంబర్‌కు ఈ భారీ లాటరీ తగిలింది.

అందుకే లాటరీ సొమ్ములో 25 శాతం తన భార్య డువాన్‌పెన్‌కి, 50 శాతం తన స్నేహితుడు లైజా చౌకి ఇస్తానని చెప్పారు.

సైఫాన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన గత ఎనిమిదేళ్లుగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు.

'నాకు ఎంత సమయం ఉందో తెలియదు'

"నా జీవితం మారిపోయింది. సాయం కోసం దేవుడికి ప్రార్థన చేశానంతే'' అని సైఫాన్ సీబీఎస్‌తో అన్నారు.

''ఇప్పుడు నేను నా కుటుంబాన్ని బాగా చూసుకోగలను. నా కోసం మంచి వైద్యుడిని వెతుక్కోగలను'' అన్నారాయన.

లాటరీ మొత్తంలో కొంత సొమ్ము వెచ్చించి ఆయన ఇల్లు కొనాలనుకుంటున్నారు.

లాటరీ చెక్కు అందుకున్న అనంతరం సైఫాన్ విలేఖరులతో మాట్లాడుతూ, ''ఈ డబ్బు ఖర్చు చేయడానికి నాకు ఎంత సమయం ఉందో తెలియదు. నేను ఎంతకాలం బతుకుతానో కూడా నాకు తెలియదు'' అన్నారు.

లాటరీ తగిలిందని తెలియగానే, ఆ విషయాన్ని తన భార్యకు, స్నేహితుడికి చెప్పేందుకు ఎంతో ఉత్సాహపడ్డారు.

''నా భార్యను ఎక్కడ ఉన్నావని అడిగా. నేను పనికి వెళ్తున్నానని ఆమె సమాధానమిచ్చింది. అప్పుడు నువ్వు ఇకపై ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, పనికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పా'' అని సైఫాన్ చెప్పారు.

అమెరికాలో అతిపెద్ద లాటరీ 2.04 బిలియన్ డాలర్లు

లాటరీ టికెట్ ధరలు పెరగడంతో బిలియన్ డాలర్లకు పైగా భారీ నగదు బహుమతులు రావడం సాధారణ విషయంగా మారిపోయింది. 2022లో ఒకరు 2.04 బిలియన్ డాలర్లు (సుమారు 20 వేల కోట్ల రూపాయలకు పైమాటే) గెలుచుకున్నారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం.

లాటరీ తగిలే అవకాశాలను మరింత కఠినతరం చేయడానికి నియమాలను కూడా సవరించారు. ఇది 292.2 మిలియన్ డాలర్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకునే అవకాశాలను తగ్గించింది.

ఇకపై కూడా లాటరీ ఆడుతూనే ఉంటానని సైఫాన్ చెప్పారు. ''నేను ఇంకోసారి లాటరీ గెలుచుకోవచ్చు, మళ్లీ అదృష్టవంతుడిని కావొచ్చు'' అని సైఫాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-05-04T07:46:10Z dg43tfdfdgfd