లోక్‌సభ ఎన్నికలు: ఒక పోస్టుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఎంత తీసుకుంటారు?

ప్రస్తుత ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు, దిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘బీర్ బైసెప్స్’, ‘కర్లీ టేల్స్’ లాంటి పేర్లతో ప్రజలకు సుపరిచితమైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కనిపించారు.

సామాజిక సేవ చేస్తున్న సోషల్ మీడియా స్టార్లను అభినందించేందుకు ఆ ‘అవార్డు షో’ను ఏర్పాటు చేశారు. నిజానికి ఇది ఇన్‌ఫ్లూయెన్సర్‌ల సామర్థ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించే చర్యగా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశంలోని దాదాపు వంద కోట్ల ఓట్లను ఒడిసి పట్టేందుకు ఒకవైపు రాజకీయ నాయకులు సన్నద్ధం అవుతుంటే, మరోవైపు యువతను, రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని, అసలు పట్టించుకోని వర్గాలను చేరువ కావడంలో ఈ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఎవరైనా తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగే సోషల్ మీడియాలోనూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం డబ్బులు చెల్లిస్తే నిజాలను కూడా ఇక్కడ తొక్కి పెడతారని అంటున్నారు.

దశాబ్దం క్రితం అసలు ఇన్‌ఫ్లూయెన్సర్‌ అనే మాట కూడా పెద్దగా వినిపించేది కాదు.

కానీ, నేడు ఇదొక వృత్తిగా మారిందని పొలిటికల్ మేనేజ్‌మెంట్ కన్సల్టంట్ సంస్థ రాజ్‌నీతి కో-ఫౌండర్ వినయ్ దేశ్‌పాండే చెప్పారు.

‘‘పాకెట్ మనీ కోసం ఈ వృత్తిని ఎంచుకున్న చాలా మంది టీనేజర్లు నాకు తెలుసు’’ అని ఆయన చెప్పారు.

ఇక్కడ పాకెట్ మనీ అనే పదం కాస్త చిన్నదే అవుతుంది. ఎందుకంటే తక్కువలో తక్కువ ఇక్కడ కొంతమంది రోజుకు రూ.2,000 (24 డాలర్లు) వరకూ తీసుకుంటున్నారు. అయితే, టాప్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు అయితే, ఒక పోస్టుకు రూ.5,00,000 వరకూ వసూలు చేస్తున్నారు. ఇది టాప్ మేనేజ్‌మెంట్‌లో పనిచేసే ఒక వ్యక్తి నెల జీతం.

రాజకీయ పార్టీలు, ఎన్నికల మేనేజ్‌మెంట్ సంస్థలు ఒక ప్రచారానికి రూ.1,00,000 నుంచి రూ5,00,000 వరకూ ఇస్తున్నట్లు ‘ర్యాంటింగ్ గోలా’ చానెల్ క్రియేటర్ బీబీసీతో చెప్పారు.

ఈ మొత్తం తక్కువేమీ కాదు. ఇది ఆ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు కూడా తీసుకురాగలదు.

కొంత మంది స్థానిక ఇన్‌ఫ్లూయెన్సర్‌ల సాయంతో కంటెంట్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరుస్తూ ఒక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపించడంతో తాము సాయం చేసినట్లు దేశ్‌పాండే చెప్పారు.

‘‘సోషల్ మీడియా కంటెంట్ శక్తివంతమైనది. ఒక అంశాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారో ఇది ప్రభావితం చేయగలదు’’ అని దేశ్‌పాండే అన్నారు.

వార్తలను అర్థం చేసుకునేందుకు 25 ఏళ్ల ప్రీతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విటర్‌ లాంటి సోషల్ మీడియా యాప్‌లను చూస్తుంటారు.

అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు లక్షల మంది ఇతరుల్లానే అగర్వాల్ కూడా ‘పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్సర్స్’ లేదా సోషల్ మీడియాలో రాజకీయాల గురించి మాట్లాడే కొందరు ప్రముఖులను ఫాలో అవుతుంటారు.

‘‘కొన్నిసార్లు వార్తలు విసుగు తెప్పిస్తుంటాయి. మరికొన్నిసార్లు అంత తేలికగా ఇవి అర్థం కావు. వీటిని సులువుగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో ఇన్‌ఫ్లూయెన్సర్‌లు సాయం చేస్తారు’’ అని ఆమె చెప్పారు. సొంతంగా అభిప్రాయాలు ఏర్పరుచుకునేందుకు, ఏ కోణంలో ఆలోచించాలో తెలుసుకునేందుకు ఈ వీడియోలు సాయం చేస్తాయని ఆమె అన్నారు.

అయితే, ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే, ఎవరి కోణంలో ఆమె ఆలోచిస్తున్నారు?

ఎన్నికలకు ముందుగా తమను ఇంటర్వ్యూ చేయాలని, దీనికి లక్షల రూపాయలు చెల్లిస్తామని చాలా మంది రాజకీయ నాయకులు తన దగ్గరకు వచ్చినట్లు యూట్యూబర్ సందీశ్ భాటియా చెప్పారు.

‘‘అయితే, ప్రశ్నలు ముందుగానే తమకు చెప్పాలని వారు అడుగుతారు. లేదా వీడియోను తాము చూసిన తర్వాతే పబ్లిష్ చేయాలని అంటారు’’ అని ఆయన చెప్పారు. తన వీడియోల ఎడిటోరియల్ నిర్ణయాలు తానే తీసుకుంటానని, అందుకే వారి ఆఫర్లు తిరస్కరించానని ఆయన వివరించారు.

తాము అందరితోనూ స్నేహితుల్లానే నడుచుకుంటామని, తమలో మానవతా విలువలు కాస్త ఎక్కువే ఉన్నాయని చెప్పే కాస్త సుదీర్ఘమైన ఇంటర్వ్యూల్లో రాజకీయ నాయకులు, సంస్థలు వేలు పెట్టే అవకాశం కాస్త ఎక్కువని మిషిగన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జోయోజీత్ పాల్ అన్నారు.

‘‘ఇలాంటి ఇంటర్వ్యూల్లోని అంశాలు చాలావరకు రాజకీయ నాయకుల నియంత్రణలోనే ఉంటాయి’’ అని పాల్ చెప్పారు.

ఒకవేళ వీటిని రాజకీయ నాయకులు నియంత్రించనప్పటికీ, సుతారంగా అడిగే ప్రశ్నలు ఇంటర్వ్యూ, ప్రమోషన్‌ల మధ్య సన్నని గీతను చెరిపేస్తుంటాయని పాల్ అన్నారు.

‘‘మీ ప్రశ్నల్లో దమ్ము లేకపోతే, ఆ ఇంటర్వ్యూ ఏదో పబ్లిసిటీ స్టంట్‌లా మారిపోతుంది’’ అని ఆయన చెప్పారు.

అయితే, సోషల్ మీడియాలో రాజకీయాల విషయానికి వస్తే ఇలాంటి సమస్యలు చాలా కనిపిస్తాయని పాల్ అన్నారు.

తాజా పరిశోధన పత్రంలో ఇండియాలోని టాప్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారని అంశాన్ని ఆయన విశ్లేషించారు. దీంతో విపక్షాల అభ్యర్థుల కంటే బీజేపీ నాయకులనే సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎక్కువగా ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు తేలింది.

మరోవైపు ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కంటెంట్ పోస్టు చేసే అకౌంట్ల సంఖ్య చాలా తగ్గిందని, బీజేపీ అనుకూల కంటెంట్ పబ్లిష్‌చేసే అకౌంట్ల సంఖ్య పెరిగిందని కూడా పరిశోధనలో వెల్లడైంది.

‘‘ప్రభుత్వాన్ని విమర్శించే కంటెంట్‌ను పబ్లిష్ చేసేందుకు సోషల్ మీడియా ప్రముఖులు వెనకాడుతున్నట్లు మా పరిశోధనలో తేలింది. అదే సమయంలో ప్రభుత్వ సిద్ధాంతాలకు మద్దతు పలుకుతూ వీడియోలు చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు’’ అని పాల్ చెప్పారు.

ప్రజాస్వామ్యానికి ఇది చాలా పెద్ద ముప్పని పాల్ అన్నారు.

విపక్షాలకు మద్దుతు పలికే ఇన్‌ఫ్లూయెన్సర్‌లు తాము చాలా ముప్పుల నడుమ పనిచేయాల్సి వస్తోందని అంటున్నారు.

ఈ వార్తలో తన పేరు వెల్లడించేందుకు ఒక ఇన్‌ఫ్లూయెన్సర్ సిద్ధపడలేదు. పేరు వెల్లడిస్తే ప్రభుత్వం తనపై చర్యలు తీసుకుంటుందేమోనని ఆయన ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమ ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు కొంతరు మారు పేర్లతో చానెల్ నడిపిస్తున్నారు.

తనను తిడుతూ చాలా మంది కామెంట్లు పెడతారని, కొందరైతే బెదిరిస్తారని ర్యాంటింగ్ గోలా బీబీసీతో చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా చాలాసార్లు డిసేబుల్ చేశారని, ఎందుకు ఇలా చేశారో కారణాలు కూడా వెల్లడించలేదని ఆమె తెలిపారు.

తన పేరు బయట పెట్టకపోతేనే తను మాట్లాడతానని బీబీసీతో ఆమె చెప్పారు.

అయితే, ఇలాంటి ఆందోళనలు ఉన్నప్పటికీ ఓటర్లకు చేరువయ్యేందుకు ఇన్‌ఫ్లూయెన్సర్ వ్యవస్థనే విపక్షాలు కూడా నమ్ముకుంటున్నాయి.

‘‘ప్రధాన మీడియా స్రవంతిని బీజేపీ తన నియంత్రణలోకి తీసుకుంది’’ అని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం హెడ్ సుప్రియా శ్రీనేత్ అన్నారు.

‘‘మా నిధులను స్తంభింపచేశారు. ప్రకటనలపై ఖర్చు పెట్టేందుకు మా దగ్గర డబ్బులు లేవు’’ అని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందుగా ఆదాయపు పన్ను విభాగం తీసుకున్న చర్యల గురించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని, దీనిలో తమ పాత్రేమీలేదని ప్రభుత్వం అంటోంది.

‘‘ఇలాంటి ఇబ్బందుల నడుమ ఓటర్లను చేరుకునేందుకు ఇన్‌ఫ్లూయెన్సర్లు వారధిలా పనిచేస్తున్నారు. మా పార్టీ సిద్ధాంతాలపై విశ్వాసం ఉండేవారితోపాటు మా వర్క్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకునేవారితో మేం కలిసి పనిచేస్తున్నాం’’ అని ఆమె చెప్పారు.

సోషల్ మీడియాను ప్రజాస్వామ్యీకరించడంలో ఇన్‌ఫ్లూయెన్సర్లు సాయం చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ పొలిటికల్ అడ్వైజర్ అంకిత్ లాల్ అన్నారు.

ద దేశ్‌భక్త్ యూట్యూబ్ చానెల్ నడిపే మాజీ జర్నలిస్టు ఆకాశ్ బెనర్జీ మాట్లాడుతూ ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ హద్దులను చెరిపేసుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వెళ్తున్నారని చెప్పారు.

జర్మనీ నుంచి యూట్యూబ్ చానెల్ నడిపిస్తున్న ధ్రువ్ రాఠీ తాజాగా చేసిన ‘ఈజ్ ఇండియా బికమింగ్ ల డిక్టేటర్‌షిప్?’ వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఆ వీడియోకు ఇప్పటివరకూ 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై ప్రభుత్వం స్పందించలేదు.

‘‘ఆ వీడియో తర్వాత డిక్టేటర్‌షిప్ అనే పదంపై చాలా చర్చ కొనసాగింది. ఇలా జరగడం నేను ముందెన్నడూ చూడలేదు’’ అని బెనర్జీ అన్నారు.

‘‘ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మా పని కేవలం కిటికీ తెరిచి వర్షం పడుతుందో లేదో చూడటం మాత్రమే కాదు. నీలి మేఘాలు కమ్ముకుంటున్నప్పుడు, ఓటింగ్ ద్వారా మీరు వాటిని తొలగించొచ్చని ప్రజల్లో చైతన్యం కల్పించడం మా బాధ్యత’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-05-05T06:34:56Z dg43tfdfdgfd