వలసలు: కిడ్నాప్‌లు, డ్రగ్స్ ముఠాల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ ఎలా అమెరికాకు చేరుకుంటున్నారంటే...

అమెరికా దక్షిణ సరిహద్దుల్లో వలసదారుల సమస్య దేశ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. వలసదారులను అగ్రరాజ్యంలోకి పంపేందుకు మెక్సికో గుండా క్రియాశీలంగా పనిచేసే డ్రగ్స్ ముఠాల గురించి చాలా చర్చ జరుగుతుంది.

అప్పటికే ప్రమాదకరమైన ఈ మార్గాన్ని డ్రగ్స్ ముఠాలు మరింత ప్రమాదకరంగా మార్చేస్తుంటాయి.

మెక్సికో సరిహద్దుల్లోని శాన్ లూయిస్ కొలరాడో ప్రాంతం స్ట్రిప్ క్లబ్స్, టాకో స్టాండ్స్, స్పీడ్‌గా వెళ్లే మోటార్‌బైక్స్‌లకు పెట్టింది పేరు.

ఇక్కడి ఒక శిబిరంలో ఎడ్వార్డో విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. అమెరికాలోని అరిజోనా స్టేట్ సరిహద్దుకు సమీపంలోనే ఈ శిబిరముంది. మెక్సికో వరకు వచ్చేందుకు చాలా ప్రమాదకరమైన మార్గాన్ని ఎడ్వార్డో ఎంచుకున్నారు.

ప్రస్తుతం ఆ చేదు అనుభవాల నుంచి కోలుకొనేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఈక్వెడార్ నుంచి..

50 ఏళ్ల ఎడ్వార్డో.. ఈక్వెడార్‌లో ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ నడిపేవారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఆ దేశంలో నేడు నేర ముఠాలమయంగా మారింది.

‘‘మేం వ్యాపారులం కాబట్టి, మమ్మల్నినేర ముఠాలు దోచుకునేవి’’ అని ఎడ్వార్డో చెప్పారు.

‘పన్ను’ కట్టకపోతే చంపేస్తామని గ్యాంగ్‌లు బెదిరించేవని ఆయన చెప్పారు. ‘‘అలాంటి పరిస్థితుల్లో మేం ఏం చేయగలం? ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తప్పించుకుపోవడం తప్పా?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఎడ్వార్డో ఎప్పుడూ ఈక్వెడార్ వదిలిపోవాలని అనుకోలేదు. కానీ, ఆయనకు అక్కడ భయం నానాటికీ పెరుగుతూ వచ్చింది. దీంతో అమెరికాలో ఆశ్రయం కోసం ఆయన దేశం విడిచిపెట్టి వచ్చేశారు.

ఇలా వచ్చిన వారిలో ఎడ్వార్డో లాంటి వారు చాలా మందే ఉన్నారు. హింసకు బాధితులుగా మారిన చాలా మంది ఇలా అమెరికాలో కొత్త జీవితం కోరుకుంటూ వస్తుంటారు.

2023లో రికార్డు స్థాయిలో వలసదారులు పోటెత్తడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వలసల విధానాన్ని మరింత కఠినతరం చేశారు.

ముఖ్యంగా రద్దీ ఎక్కువైతే సరిహధ్దులను మూసివేసేందుకు కూడా బైడెన్ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. బైడెన్ ప్రత్యర్థి డోనల్డ్ ట్రంప్ తను అధికారంలోకి వస్తే, భారీ స్థాయిలో వలసదారులను వెనక్కి పంపించేస్తానని అంటున్నారు.

ప్రమాదకర ప్రయాణం..

అమెరికాకు భారీ స్థాయిలో పోటెత్తే వలసదారుల గురించి చర్చలు జరిగేటప్పుడు మెక్సికోలోని డ్రగ్స్ ముఠాల గురించి కూడా ప్రస్తావన వస్తుంటుంది.

మొదటగా ఈక్వెడార్ రాజధాని క్వీటో నుంచి మెక్సికో సిటీకి విమాన మార్గంలో ఎడ్వార్డో వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి సోనోయిటకు 30 గంటలపాటు బస్సులో ప్రయాణించారు. ఆ ప్రాంతం అమెరికా సరిహద్దుకు సమీపంలోనే ఉంటుంది.

ఆ బస్సు వలసదారులు, మెక్సికో పౌరులతో నిండివుంది. అయితే, ఆ బస్సు డ్రగ్స్ ముఠాల స్థావరాల గుండా వెళ్లినప్పుడు ఎడ్వార్డోకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ముఠాలే వలసదారులపై వ్యాపారాలను నియంత్రిస్తుంటాయి.

ఆ బస్సు తొలిసారి ఆగినప్పుడు సమయం ఉదయం ఆరు గంటలైంది. మాస్కులు వేసుకొని, ఆయుధాలు పట్టుకొన్న పది మంది బస్సులోకి ఎక్కారు.

వెంటనే ఆ బస్సును పర్వతాల మార్గంవైపుగా తీసుకెళ్లారు. తమతమ పత్రాలు చూపించాలని ప్రయాణికులను ఆ సాయుధులు అడిగారు.

వలసదారులు ఎవరో తెలుసుకున్న తర్వాత, వారి నుంచి ఒక్కొక్కరి దగ్గర 1200 పెసోలు (90 అమెరికా డాలర్లు, రూ.7,500) వసూలు చేశారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే, వారిని నిర్బంధంలోకి తీసుకుంటారు.

దాదాపు అందరూ డబ్బు చెల్లించారు. దీంతో బస్సు ముందుకు వెళ్లేందుకు సాయుధుల నుంచి అనుమతి వచ్చింది. అక్కడికి 11 గంటల తర్వాత మరోసారి బస్సును ఇలానే మధ్యలో అడ్డుకున్నారు. మళ్లీ డబ్బులు తీసుకొన్న తర్వాత బస్సును ముందుకు వెళ్లనిచ్చారు.

ఎడ్వార్డో ప్రస్తుతం నివసిస్తున్న సరిహద్దు పట్టణం శాన్ లూయిస్ రియో కొలరాడోలోనూ వలసదారులను కిడ్నాప్ చేస్తుంటారు.

గత ఏడాది మే నెలలో ఈ పట్టణంలోని ఒక రెండంతస్తుల భవనంలో కొన్ని అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు పోలీసులకు ఒక స్థానికుడు సమాచారం అందించారు.

ఆ ప్రాంతంపై పోలీసులు రైడ్ చేసినప్పుడు, ఐదుగురిని అరెస్టు చేశారు. వంద మందికిపైనా వలసదారులను వారి నుంచి రక్షించారు. వీరిలో కొందరిని మూడు వారాల నుంచీ నిర్బంధంలో ఉంచారు.

ఆ రైడ్‌లో పాలుపంచుకున్న స్థానిక పోలీసు అధికారి థెరెసా ఫ్లోర్స్ మ్యూనోజ్ మాట్లాడుతూ.. ‘‘వారి దగ్గర ఆహారం, నీరు లేవు. శారీరకంగా, మానసికంగా వారిని హింసిస్తున్నారు’’ అని చెప్పారు.

బాధితుల్లో ఒక భారతీయ మహిళ కూడా ఉన్నట్లు ఆమె తెలిపారు. ‘‘ఆమె చేతిలో ఒక పాప కూడా ఉంది. ఆ పాప ఏడుస్తోంది. ఆ పాపను ఆమె నా చేతికి ఇచ్చింది. వెంటనే పాపను తీసుకెళ్లిపోండని అంది. నాకు చాలా బాధగా అనిపించింది’’ అని ఆమె వివరించారు.

పోలీసులు విడిచిపించిన వారిలో బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, చైనా, సెనెగల్ లాంటి 23 దేశాలకు చెందిన వారున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం, ఒక్కో వలసదారుడిని విడిచిపెట్టాలంటే 2500 డాలర్లు (రూ.2.08 లక్షలు) చెల్లించాలని ముఠాలు డిమాండ్ చేస్తాయి. గర్భిణులకైతే ఈ మొత్తం రెట్టింపు అడుగుతారు.

ప్రొఫెషనల్ క్రిమినల్స్

ఇక్కడ కిడ్నాప్‌లు, వసూళ్లు చేసేవారిలో ప్రొఫెషనల్ క్రిమినల్స్‌తోపాటు కొందరు ప్రభుత్వ సిబ్బంది కూడా ఉంటారు.

తమ బస్సు మెక్సికన్ స్టేట్‌లు సినాలోవా, సోనోరాల గుండా వెళ్లినప్పుడు, ఆరు చెక్‌పోస్టుల వద్ద ప్రభుత్వ అధికారులు కూడా డబ్బులు తీసుకున్నారని ఎడ్వార్డో చెప్పారు.

‘‘మీ దగ్గర డబ్బు లేకపోతే, వాళ్లు పిలుస్తారు. ఒంటి మీద బట్టలు విప్పమంటారు. డబ్బు లేకపోతే మీ దగ్గర ఉండే వస్తువులను తీసేసుకుంటారు. అలానే నా డాక్యుమెంట్లను కూడా నేను కోల్పోయాను’’ అని ఆయన వివరించారు.

బస్సులను మధ్యమధ్యలో ఆపుతూ వలసదారులను లక్ష్యంగా చేసుకోవడం ఇక్కడ సర్వసాధారణం. స్థానిక జర్నలిస్టు ఒకరు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

రహస్యంగా తీసిన కొన్ని ఫోటోలను ఆయన మాకు పంపించారు. వీటిలో కొన్ని ముఠాలు బస్సులను ఆపుతూ, డబ్బులు వసూలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, వసూలు చేసేవారి ముఖాలకు మాస్కులు ఉన్నాయి.

‘‘డ్రగ్స్, వలసదారుల స్మగ్లింగ్‌ లాంటి పనులు చేసే నేర ముఠాలకు చెందినవారే వీరంతా’’ అని ఆయన చెప్పారు.

మెక్సికన్లలా కనిపించనివారు లేదా సరిగా దుస్తులు వేసుకోని వారిని మాత్రమే సాయుధులు ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు.

అత్యంత చేదు అనుభవం

ఎడ్వార్డోకు అత్యంత చేదు అనుభవం సోనోరాలో ఎదురైంది.

అప్పుడు కూడా కొందరు సాయుధులు బస్సును అడ్డుకున్నారు. కొలంబియాకు చెందిన ఐదుగురు పిల్లలతో వస్తున్న రెండు కుటుంబాల దగ్గర డబ్బులు లేవు. వెంటనే వారిని బస్సు లోనుంచి దించేశారు. వారిని ఒక ట్రక్కులో ఎక్కించి తీసుకెళ్లిపోయారు.

‘‘అందరినీ కాపాడేందుకు సరిపడా డబ్బు మా దగ్గర లేవు’’ అని ఎడ్వార్డో చెప్పారు.

ఎడ్వార్డో దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. తను తెచ్చుకున్న 3,000 డాలర్లు ఖర్చయిపోయాయి.

అంటే ఇప్పుడు అమెరికన్ సరిహద్దు వరకూ అనుమతించే సాయుధులకు ఇచ్చేందుకు తన దగ్గర డబ్బులు లేవు.

దీంతో ఇక్కడే ఉండిపోతే మిమ్మల్ని సాయుధులు కిడ్నాప్ చేస్తారని ఎడ్వార్డోకు బస్సు డ్రైవర్ చెప్పారు. దీంతో ఆయన శాన్ లూయిస్ రియో కొలరాడోకు వెళ్లిపోయారు.

కిడ్నాప్‌కు గురైన, డబ్బులు చెల్లించలేని వలసదారులు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. అమెరికాకు అక్రమంగా వెళ్లాలనుకునే వారు ఎక్కువగా మెక్సికోలోని టిజువానాకు వస్తుంటారు.

అయితే, ఇటీవల ఈ పట్టణానికి తూర్పువైపు కొండల్లో కొందరు వలసదారుల మృతదేహాలు కనిపించాయి. మృతదేహాల తలపై తుపాకులతో కాల్చిన గాయాలు ఉన్నాయి.

డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతోనే వారిని కాల్చి చంపి ఉండొచ్చని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

‘‘ఇక్కడి ముఠాలు వసూళ్లు, కిడ్నాప్‌లు, మనుషుల అక్రమ రవాణా లాంటి భిన్న మార్గాల్లో వలసదారుల నుంచి డబ్బులు లాగేస్తుంటాయి’’ అని శాన్‌డీగో స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విక్టర్ క్లార్క్ అల్ఫారో చెప్పారు.

‘‘వారిని మేం నార్కో-కోయోట్స్ అని పిలుస్తాం. ఎందుకంటే వీరు మనుషులతోపాటు డ్రగ్స్‌ను కూడా సరిహద్దులు దాటిస్తుంటారు’’ అని ఆయన అన్నారు. వలసదారులపై ఒత్తిడిచేసి వారితోనే డ్రగ్స్‌ను పంపిస్తుంటారని చెప్పారు.

‘‘ఈ నేరాల్లో హింస ప్రధానమైనది. దీనితోనే ఆ ప్రాంతంపై ముఠాలు పట్టు సాధిస్తుంటాయి’’ అని క్లార్క్ తెలిపారు.

అమెరికాలోకి

శాన్ లూయిస్ రియో కొలరాడోలో కొన్ని రోజులు ఎడ్వార్డో ఉన్నారు. అక్కడే చిన్న ఉద్యోగం కూడా చూసుకున్నారు. కానీ, మెక్సికోలో ప్రమాదకర ప్రయాణం తర్వాత, మళ్లీ అక్రమంగా అమెరికాలోకి అడుగుపెట్టాలని ఆయన అనుకోలేదు.

అమెరికన్ ఆన్‌లైన్ యాప్ ‘సీబీపీ వన్’లో ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. అమెరికా పోర్టుల్లో ఎంట్రీ కోసం వలసదారులకు ఈ యాప్ ద్వారా అపాయింట్‌మెంట్లు ఇస్తుంటారు.

వలసదారులు అక్రమంగా వచ్చే ఈ మార్గంలో నేర ముఠాలకు అడ్డుకట్ట వేసేందుకు బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఎప్పటికైనా అన్నీ అనుమతులతోనే అమెరికాలోకి అడుగుపెట్టాలని ఎడ్వార్డో ఎదురుచూశారు.

ఆయన రెండు కారణాల దృష్ట్యా అమెరికాలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. వాటిలో మొదటిది ఆయన ఒక క్యాథిలిక్ కావడం. రెండోది ఈక్వెడార్‌లో తను వదిలిపెట్టిన దుకాణాన్ని నడిపిస్తున్న తన స్నేహితుడి నుంచి కూడా ముఠాలు ప్రస్తుతం డబ్బులు వసూలు చేస్తున్నాయి.

తన స్నేహితుడిని కూడా అమెరికా వచ్చేలా ఒప్పించాలని ఎడ్వార్డో భావించారు. కానీ, కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చేందుకు ఆయన సిద్ధంగా లేరు.

అయితే, ఒకరోజు అనుకోని ఘటన జరిగింది. ‘‘వారు మా షాపుకు వెళ్లి మా ఫ్రెండ్‌ను హత్య చేశారు. నేను ఈక్వెడార్‌లో ఉండుంటే నాకూ అదే గతి పట్టేది. అదృష్టవశాత్తు నేను ప్రాణాలతో బతికే ఉన్నాను’’ అని ఎడ్వార్డో కన్నీరు తుడుచుకుంటూ చెప్పారు.

మొత్తానికి ఈ ఏడాది మార్చిలో అన్నీ అనుమతులతోనే ఎడ్వార్డో అమెరికాలోకి అడుగుపెట్టారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-24T06:02:44Z dg43tfdfdgfd