వస్తున్నాం..వస్తున్నాం లింగమయ్య

వస్తున్నాం..వస్తున్నాం లింగమయ్య

  •      శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
  •     ప్రారంభమైన సలేశ్వరం జాతర

అచ్చంపేట/అమ్రాబాద్: దక్షిణ భారత అమరనాథ్ యాత్రగా భావించే నల్లమల సలేశ్వరం జాతర సోమవారం ప్రారంభమైంది. నల్లమల అభయారణ్యంలో లోయలో కొలువైన సలేశ్వరం లింగమయ్య స్వామి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. దీనికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ, కర్నాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. సలేశ్వరం బయలుదేరిన భక్తులు ‘వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య’ అంటూ చేసిన శరణుఘోషతో నల్లమల అటవీ ప్రాంతం దద్దరిల్లింది.

ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్​వెహికల్స్​లో రాంపూర్​ పెంట వరకు వచ్చిన భక్తులు అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. సలేశ్వరం క్షేత్రం వద్ద 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం వద్ద భక్తులు సందడి చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే అడవిలో నుంచి వెళ్లడానికి అటవీశాఖాధికారులు అనుమతించారు. సలేశ్వరం వెళ్లే భక్తుల కోసం నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్​ నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు.

ఐటీడీఏ, రెవెన్యూ, ఆర్ డబ్ల్యూఎస్, పోలీస్​ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఫర్హాబాద్, మన్ననూర్, రాంపూర్, అప్పాయి పల్లి,  సలేశ్వరం వద్ద ట్రాఫిక్​నియంత్రణ, ప్లాస్టిక్​ ఏరివేత, ఎమర్జెన్సీ సేవలు అందించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో 75 మంది వలంటీర్లను నియమించారు. 150 మంది ఫారెస్ట్​ ఆఫీసర్లు, సిబ్బంది అడవిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సలేశ్వరం క్షేత్రం వద్ద వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టే వారికి అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులతో పాటు నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-23T02:54:29Z dg43tfdfdgfd