వెస్ట్ బ్యాంక్‌లో ఎనిమిదేళ్ల బాలుడు హత్య, ఇజ్రాయెల్‌పై యుద్ధ నేరాల ఆరోపణలు.. అసలేం జరిగింది?

2023 నవంబర్ 29న మధ్యాహ్నం ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని ఓ వీధిలోకి పాలస్తీనా పిల్లలు వచ్చారు. వాళ్లందరికీ కలిసి ఆడుకోవడం అలవాటు.

కొన్ని నిమిషాల తర్వాత ఆ పిల్లల్లో ఇద్దరు 15 ఏళ్ల బసిల్, ఎనిమిదేళ్ల ఆడమ్ తుపాకీ తూటాలు తగిలి చనిపోయారు. ఆ తూటాలను కాల్చింది ఇజ్రాయెల్ సైనికులు.

ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ భద్రతా బలగాల ప్రవర్తనపై పరిశోధనలో భాగంగా ఆ ఇద్దరు పిల్లలు చనిపోయిన రోజున ఏం జరిగిందనే దానిని బీబీసీ సమీక్షించింది.

మొబైల్ ఫోన్, సీసీ కెమెరాల ఫుటేజ్, ఇజ్రాయెల్ సైన్యం కదలికలు, ప్రత్యక్ష సాక్షులు, ఘటన జరిగిన ప్రాంతంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరిగిందో చూపించే ఆధారాలను బీబీసీ బహిర్గతం చేస్తోంది.

మేము కనుక్కున్న ఆధారాలతో ‘ఆడమ్ హత్య’ మానవ హక్కుల ఉల్లంఘన అని, దీన్ని యుద్ధ నేరంగా పరిగణించవచ్చని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి బెన్ సూల్ చెప్పారు.

పిల్లల మీద ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడం విచక్షణరహిత చర్య అని మరో న్యాయ నిపుణుడు డాక్టర్ లారెన్స్ హిల్ కాథోర్న్ అన్నారు.

ఈ మరణాలను సమీక్షిస్తున్నట్లు ఇజ్రాయెల్ భద్రత బలగాలు చెప్పాయి. అయితే “తక్షణ ప్రమాదాలను నిరోధించేందుకు, అరెస్టులు చేసేందుకు, అరెస్ట్ చేసే అవకాశాలు చేయి దాటినప్పుడు, గత్యంతరం లేని పరిస్థితుల్లో బాగంగానే కాల్పులు జరుపుతున్నట్లు ఐడీఎఫ్ చెప్పింది.

అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో హింస పెరిగింది. పాలస్తీనీయుల ఇళ్లను ధ్వంసం చేయడం, ఆయుధాలు చూపించి పాలస్తీనీయుల్ని బెదిరించడం, ఆ ప్రాంతాన్ని వదిలి జోర్డాన్ వెళ్లాలని బెదిరించడం, పాలస్తీనా సాయుధుల శరీరాల్ని ముక్కలు చేయడం లాంటి ఘటనలకు సంబంధించి బీబీసీకి ఆధారాలు లభించాయి.

సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు

నవంబర్ 29న జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలలో బసిల్ హార్డ్‌వేర్ షాపు పక్కనే నిలబడి ఉన్నారు. దాని షట్టర్లు వేసి ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం వస్తే వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌లో షాపులు వెంటనే మూసివేశారు. గాజా మాదిరిగా జెనిన్‌ హమాస్ పరిపాలనలో లేదు.

జెనిన్ శరణార్థి శిబిరంలో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో బాగంగా తుపాకుల పేలుడు శబ్ధం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఆడమ్‌కు ఫుట్‌బాల్ అంటే పిచ్చి. లియోనెల్ మెస్సీకి వీరాభిమాని. అతను తన అన్న బాహాతో అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో వీధిలో మొత్తం 9 మంది పిల్లలు ఉన్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అక్కడ ఏర్పటు చేసిన సీసీటీవీ కెమెరాలు 360 డిగ్రీల్లో ఏం జరిగిందో రికార్డు చేసేలా అమర్చి ఉన్నాయి.

అక్కడకు వంద మీటర్ల దూరంలోనే ఆరు సాయుధ ఇజ్రాయెల్ సైనిక వాహనాల కాన్వాయ్ పక్క వీధిలో నుంచి మలుపు తీసుకుని పిల్లల వైపు వస్తోంది. దీంతో భయపడిన పిల్లలు అక్కడ నుంచి వెళ్లిపోవడం కనిపించింది.

పిల్లలు వెనక్కి మళ్లిన తర్వాత మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలలో ఓ వాహనం ముందు తలుపు తెరచుకుంది. లోపల ఉన్న సైనికుడికి రోడ్డు మీద ఉన్న పిల్లలు స్పష్టంగా కనిపిస్తుననారు. బసిల్ రోడ్డు మధ్యలోకి దూసుకొచ్చాడు. అదే సమయంలో ఆడమ్ సైనికులకు 12 మీటర్ల దూరంలో ఉన్నాడు. అతను పరుగెత్తేందుకు ప్రయత్నించాడు.

తర్వాత 11 రౌండ్ల తుపాకీ పేలుళ్లు జరిగాయి.

ఈ దృశ్యాన్ని పరీక్షించిన తర్వాత, బుల్లెట్లు అన్ని వైపులకు దూసుకెళ్లినట్లు బీబీసీ గుర్తించింది. నాలుగు బుల్లెట్లు ఇనుప స్థంభానికి తగిలాయి. రెండు హార్డ్‌వేర్ షాపు షట్టర్‌లోకి దూసుకెళ్లాయి. మరొకటి అక్కడ పార్క్ చేసిన కారు బంపర్‌కి రంధ్రం చేసింది. ఇంకొకటి గోడ పక్కన ఉన్న రెయిలింగ్‌కు తగిలింది.

బసిల్ చాతీలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయినట్లు వైద్యులు ఇచ్చిన నివేదికను బీబీసీ సేకరించింది. మరో బుల్లెట్ ఎనిమిదేళ్ల ఆడమ్‌ తల వెనుక వైపున బలంగా లోతుగా తగిలింది. ఆడమ్ అన్న బాహా అతడిని చాటుకు లాగేందుకు ప్రయత్నం చేయడం, ఆ సమయంలోనే ఆడమ్ తలలో నుంచి రక్తం ఫౌంటెన్‌లా చిమ్ముకు రావడం, అది చూసి బాహా అంబులెన్స్ కోసం కేకలు పెట్టడం అంతా రికార్డైంది.

అయితే అప్పటికే ఆలస్యం అయింది. ఆడమ్, అతని స్నేహితుడు బసిల్ తన కళ్లెదుటే చనిపోయినట్లు బాహా చెప్పాడు.

“నేను షాక్‌లో ఉన్నాను. నేనప్పుడు నా గురించి కూడా ఆలోచించగలిగే పరిస్థితిలో లేను. నేను అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించాను. “ఆడమ్, ఆడమ్” అని పిలిచాను. అయితే అప్పటికే అతను ప్రాణాలు పోయినట్లు ఉన్నాయి. అతను పలకలేదు” అని బాహా బీబీసీతో చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు.

ఇజ్రాయెల్ సైనికుడు కాల్పులు జరపడానికి ముందు బసిల్ తనచేతిలో ఏదో నొక్కుతున్నట్లు కనిపించింది. అయితే అది ఏంటనేది తెలియలేదు. ఇజ్రాయెల్ సైన్యం తర్వాత ఒక చిత్రాన్ని బహిర్గతం చేసింది. అందులో ఒక పేలుడు పదార్ధం కనిపిస్తోంది.

సంఘటన జరిగిన ప్రాంతం నుంచి బీబీసీ సేకరించిన ఆధారాలను అనేకమంది స్వతంత్రులైన నిపుణులకు పంపించింది. అందులో మానవ హక్కుల న్యాయవాదులు, యుద్ద నేరాల దర్యాప్తు అధికారులు, తీవ్రవాద నిరోధక నిపుణుడు, ఐక్యరాజ్యసమితి సభ్యులు, తటస్థ సంస్థలు ఉన్నాయి. వారిలో కొంతమంది తమ పేర్లు బయటకు చెప్పవద్దని కోరుతూ తమ విశ్లేషణ అందించారు.

ఆ నిపుణులంతా ఈ సంఘటనపై దర్యాప్తు జరగాలని కోరారు. మరి కొంత మంది ఇంకో అడుగు ముందుకేసి అక్కడ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరిగిందని చెప్పారు.

బసిల్‌ పేలుడు పదార్ధం పట్టుకున్నప్పటికీ అతని మీద ప్రాణాలను తీసే ప్రమాదకరమైన ఆయుధాలను ప్రయోగించవచ్చా అనే దానిపై సందేహాలు ఉన్నాయని మానవహక్కులు, తీవ్రవాద నిరోధక వ్యవహారాలపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ చెప్పారు.

“ఆడమ్ విషయంలో మాత్రం ఇద అంతర్జాతీయ మానవీయ చట్టాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే, ఇది విచక్షణారహితంగా లేదా ఇష్టం వచ్చినట్లుగా పౌరుల మీద దాడి చెయ్యడం, ఇదొక యుద్ధ నేరం, మానవహక్కుల ఉల్లంఘన” అని ఆయన అన్నారు.

“సైనికులు సాయుధ వాహనాల్లో ఉన్నారు. వారికి అక్కడ ముప్పు ఉన్నప్పటికీ, వాళ్లు వేరే మార్గంలోకి వెళ్లి, పిల్లల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్లాన్ చేయవచ్చు. దానికి బదులు పిల్లల మీద విచక్షణ రహితంగా ప్రాణాంతక ఆయుధాలతో దాడి చేశారు. ఇది కచ్చితంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అనియూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ లా కో డైరెక్టర్ డాక్టర్ లారెన్స్ హిల్ కాథోర్న్ అన్నారు.

అనుమానితులు తమ వైపు పేలుడు పదార్ధాలు విసురుతారనే అనుమానం వచ్చిందని, అది తమన అపాయంలో పడేస్తుందని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. “ అందుకే బలగాలు కాల్పులు జరిపాయి. అక్కడ పేలుడు పదార్ధాలు ఉన్నాయి” అని తెలిపింది.

అయితే వీడియోలో కనిపించిన ఆధారాలను బీబీసీ పరిశీలించింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సేకరించింది. ఆడమ్ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపినప్పుడు అతను పరుగెత్తుతున్నాడు. అందుకే అతడికి తల వెనుకభాగంలోకి తూటాలు దూసుకెళ్లాయి.

ఆడమ్, బసిల్ హత్యలపై ‘సమీక్ష’ జరుగుతోందని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో చిన్నారులు చనిపోతే ఐడీఎఫ్ ప్రతినిధులు తరచుగా ఇదే మాట చెబుతున్నారు.

అయితే బీబీసీ సేకరించిన ఆధారాలను పరిశీలించిన కొంతమంది ఇజ్రాయెల మాజీ సైనికులు మాత్రం ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థ తమ దేశ సైనికులను రక్షిస్తుందని, వారు అక్రమంగా ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించినా సైనికులకే అండగా నిలుస్తుందని చెబుతున్నారు.

“ఓ ఇజ్రాయెలీ సైనికుడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీ పెట్టి పాలస్తీనీయుడిని చంపినా ఇజ్రాయెల్ దాన్ని హత్యగానే పరిగణిస్తుంది. అయితే దాని మీద నేరారోపణలు నమోదు చేసే అవకాశాలు ఒక్క శాతం కూడా ఉండవు. ఆడమ్స్ కేసు విషయంలో కూడా సైనికులపై చర్యల విషయంలోనూ ఇదే జరుగుతుంది.” అని 2018-2020 మధ్య వెస్ట్‌బ్యాంక్‌లో సేవలు అందించిన ఓ మాజీ సైనికుడు బీబీసీకి చెప్పారు.

ఇజ్రాయెల్ సైనికుల మీద వచ్చిన ఫిర్యాదులపై ఒక శాతం కంటే తక్కువగానే విచారణలు జరిగినట్లు ఆ దేశంలోని మానవ హక్కుల సంస్థ యెష్ డిన్ గణాంకాలు చెబుతున్నాయి.

ఇసబెల్ యోంగ్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో తుపాకీ కాల్పులు, దాడులు, రహస్య సమావేశాల గురించి తెలుసుకుంటుంటారు. ఆమె కనుక్కున్న అంశాలు ఇజ్రాయెల్ సైన్యం ప్రవర్తన మీద తీవ్రమైన ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

అక్టోబర్ 7న హమాస్ దాడి చేసిన తర్వాత, ఇజ్రాయెల్ సైన్యం గాజా మీద యుద్ధానికి దిగింది. ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా గాజాలో మానవీయ విపత్తుపైనే ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 34వేల మందికి పైగా మరణించారని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య శాఖ చెబుతోంది.

అదే సమయంలో, ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం చేపడుతున్న ఆపరేషన్లు కూడా పెరిగాయి. ఈ ఆపరేషన్లలో చిన్నారులు ఎక్కువ మంది చనిపోతున్నారు. గతేడాది రికార్డు స్థాయిలో 124 మంది పిల్లలు చనిపోయారని యునిసెఫ్ చెబుతోంది. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్లలో 85 మంది చిన్నారులు మరణించారు.

ఈ ఏడాది ఇజ్రాయెల్ సైన్యం లేదా యూదు సెటిలర్ల దాడుల్లో ఇప్పటి వరకు 36 మంది పాలస్తీనా చిన్నారులు చనిపోయారు.

వెస్ట్‌బ్యాంక్ యుద్ధక్షేత్రం కాదు. అంతర్జాతీయ చట్టం ప్రకారం బల ప్రయోగం చెయ్యడం చట్ట వ్యతిరేకం.

ఇజ్రాయెల్ సైన్యం ప్రమాణాలు, నిబంధనల సమాచారం రహస్యంగా ఉంచుతోంది. ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే ప్రాణాలు తీసే ఆయుధాలను ఉపయోగించాలని, అది కూడా అన్ని దారులు మూసుకుపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమేనని ఇజ్రాయెల్ మాజీ సైనికుడు ఒకరు బీబీసీతో చెప్పారు.

ఒక వ్యక్తిని కాల్చి చంపడానికి అతనిని అరబిక్, హెబ్రూ భాషలో హెచ్చరించారు. అప్పటికీ వినకపోతే టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాలి. తర్వాత కాళ్ల మీదనే కాల్చాలి.

2023 జనవరి 2024 జనవరి మధ్య ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో చనిపోయిన 112 మంది చిన్నారుల హత్యలకు సంబంధించిన వైద్య నివేదికలను అధ్యయనం చేసేందుకు పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ బీబీసీకి అనుమతి ఇచ్చింది.

అయితే ఈ హత్యలకు దారి తీసిన పరిస్థితులు ఏంటనేది బీబీసీకి తెలియదు. ఇందులో కొన్ని నిజంగానే ఇజ్రాయెల సైనికుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన సమయంలో వాళ్లు కాల్పులు జరిపి ఉండవచ్చు.

అయితే ఆ మృతదేహాల్లో 98 శాతానికి పైగా చిన్నారుల చాతీ, తల భాగంలో తూటాలు తగలడం వల్ల మరణించినట్లు బీబీసీ విశ్లేషించింది.

చాతీ, తల భాగంలో కాల్చడం అంటే సైనికులు తమ లక్ష్యాలను గాయపరచడం కంటే చంపేయాలనే లక్ష్యంతోనే వారిపై కాల్పులు జరిపినట్లు భావించాలి.

ఇదంతా చూస్తే వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించడంలో పాటించాల్సిన ప్రమాణాలు, న్యాయసూత్రాలు పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వెస్ట్ బ్యాంక్‌లో సైనిక చర్యను ఐదు వారాల పాటు పరీక్షించిన, అక్కడ జరిగిన అనేక సంఘటనలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించాక ఇజ్రాయెల్ సైన్యం ప్రవర్తన మీద అనేక ప్రశ్నలు తలెత్తాయి.

2024 జనవరిలో తుల్‌కర్మ్ శరణార్థి శిబిరంలో తిరుగుబాటుదారులుగా భావిస్తున్న ఓ సాయుధ బృందం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన సైనిక చర్య 45 గంటలు కొనసాగింది. ఈ ఆపరేషన్‌ను బీబీసీ ప్రత్యక్షంగా చూసింది.

ఈ ఆపరేషన్ తర్వాత కొన్ని రోజులకు కొంతమంది పాలస్తీనీయులు బీబీసీని కలిసి తమకు ఎదురైన అనుభవాల గురించి చెప్పారు. ఇజ్రాయెల్ సైనికులు తమ తలలపై తుపాకులు పెట్టి పక్కన ఉన్న జోర్డాన్ వెళ్లాలని బెదిరించారని బీబీసీకి వివరించారు.

ఇజ్రాయెల్ సైనికుడొకరు తన తలపై కత్తి పెట్టి తన తండ్రిని, సోదరుడిని ఈ ప్రాంతం విడిచి వెళతారా లేదా అంటూ బెదిరించినట్లు 12 ఏళ్ల హేథమ్ చెప్పారు.

శిబిరంలోని ఓ ఇంట్లో ఇస్లామ్‌లో మూడో పవిత్ర స్థలమైన అల్ అక్సా మసీదు కుడ్య చిత్రాలను మేము గుర్తించాము. దాన్ని ఇజ్రాయెల్ సైనికులు పాడు చేసినట్లు వాళ్లు ఆరోపించారు.

పక్కనే ఉన్న గోడ మీద “స్టార్ ఆఫ్ డేవిడ్” చిత్రం ఉంది. దాని మీద అక్టోబర్ 7అని రాసి ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసింది.

ఇలా పవిత్ర స్థలాలకు సంబంధించిన వాటిని ధ్వంసం చెయ్యడం ఇజ్రాయెల్ భద్రతా బలగాల విలువలకు వ్యతిరేకమని, తమ సైనికుల నుంచి తాము ఆశిస్తున్నదానికి విరుద్దమని ఇజ్రాయెల్ ఆర్మీ చెప్పింది.

ఆ ఇంటి మెట్లను పగలగొట్టారు. వంటగదిలో అరలను పగలగొట్టారు. చివరకు పిల్లల బొమ్మలను కూడా వదల్లేదు. టీవీని ముక్కలు చేశారు. క్యాంపులో అన్ని ఇళ్లలో ఇలాంటి పరిస్థితే ఉంది.

“గోడల మీద స్టార్‌ఆఫ్ డేవిడ్ బొమ్మ వేయడం, అక్టోబర్ 7 అని రాయడం అన్యాయం” అని జెరూసలేంలోని డియాకొనియా ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ లా సెంటర్‌లో సీనియర్ న్యాయ నిపుణుడు డాక్టర్ ఈటన్ డైమండ్ చెప్పారు.

క్యాంపులో పిల్లల మెడపై కత్తి పెట్టి బెదిరించడం, మిగతా వారి తలలకు తుపాకులు గురి పెట్టి ఈ ప్రాంతాన్ని విడిచి పెట్టి వెళ్లాలని హెచ్చరించడం కూడా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమే అని ఆయన అన్నారు.

తుల్‌కర్మ్ శరణార్థి శిబిరంలో చేపట్టిన ఆపరేషన్‌లోనే ఇజ్రాయెల్ సైనికులు పేలుడు పదార్ధాలు కలిగి ఉన్నాడనే అనుమానంతో ఓ పాలస్తీనా యోధుడిని కాల్చి చంపిన తర్వాత, మృతదేహం మీద మూత్రం పోశారని, ఆ మృతదేహాన్ని కొట్టి, కట్టివేసి వీధిలో పడిసినట్లు ప్రత్యక్ష సాక్షులు బీబీసీతో చెప్పారు.

మృతదేహాన్ని కట్టేసి ఉన్న ఫోటోలను బీబీసీ చూసింది. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో రక్తపు మరకలు, కట్టేసేందుకు ఉపయోగించిన గుడ్డ పీలికలు, వైర్లను బీబీసీ పరిశీలించింది.

బీబీసీ సేకరించిన ఆధారాలను మరోసారి స్వతంత్రులైన నిపుణులకు చూపించింది.“ ఒక వ్యక్తిని చట్ట ప్రకారం చంపేసినా సరే, చనిపోయిన తర్వాత అతడి దేహాన్ని గౌరవించాలి. మీరు చూపించిన ఆధారాలను బట్టి చూస్తే ఇది కచ్చితంగా యుద్ధ నేరం, మానవ హక్కుల్ని ఉల్లంఘించడమే” అని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాలో న్యాయ నిపుణుడు ప్రొఫెసర్ మార్కో సాస్సోలి చెప్పారు.

పాలస్తీనా సాయుధుడిని చంపేసిన తర్వాత అక్కడ పేలుడు పదార్ధాలు లభించాయని, అతడి శరీరాన్ని ముట్టుకునేందుకు రెడ్ క్రెసెంట్ ఉద్యోగులు కూడా తిరస్కరించారని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. “అతడి వద్ద ఇంకా ఏ ఆయుధాలు ఉన్నాయో తెలియకపోవడం వల్ల భద్రత కోసం తమ సైనికులు అతడి కాళ్లు చేతులు కట్టేశారు.” అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి చెప్పారు.

బీబీసీ వద్ద ఉన్న ఆధారాలను ఇజ్రాయెల్ మాజీ సైనికులకు అందించింది. వాటిని పరిశీలించి కొందరు వెటరన్లు “వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్లు పాలస్తీనా సాయుధ తిరుగుబాటుదారులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని” చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

ఇతర కథనాలు

2024-05-03T01:56:28Z dg43tfdfdgfd