సీఎం అరెస్టు అయితే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చా, చట్టం ఏం చెబుతోంది?

దిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది.

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, అరెస్టైన ముఖ్యమంత్రి ఆ పదవిలో కొనసాగకుండా అడ్డుకునే చట్టపరమైన నిబంధనలను చూపడంలో పిటిషనర్లు విఫలమయ్యారని పేర్కొంది.

''అలాంటి నిబంధనలు ఎక్కడ ఉన్నాయో చూపించండి, మీరు కోరుతున్న దానికి అనుగుణంగా చట్టపరమైన నిబంధనలుంటే చూపండి'' అని బెంచ్ కోరింది.

దిల్లీ హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్, ముఖ్యమంత్రి అరెస్టయిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని నడపొచ్చా, లేదా అని న్యాయపరంగా తలెత్తున్న ప్రశ్నలకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే, కేజ్రీవాల్‌ను అలా అనుమతించబోమని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పష్టం చేశారు.

ఇప్పుడీ చర్చకు కారణం కూడా ఉంది.

దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే దిల్లీ సీఎంగా కేజ్రీవాల్ రెండు అంశాల్లో అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

కేజ్రీవాల్‌పై ఆరోపణలు

కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేయగా, కోర్టు ఆయన్ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఆ కస్టడీని గురువారం ఏప్రిల్ 1 వరకు పొడిగించింది.

దిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగుతారని ఆయన అరెస్టు తర్వాత దిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అతిషి చెప్పారు.

కేజ్రీవాల్‌ను జైలుకి పంపితే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు జైల్లోనే కార్యాలయ ఏర్పాటు కోసం కోర్టును ఆశ్రయిస్తామని మార్చి 24న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు.

అయితే, తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది.

దిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకల ఆరోపణల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొందరు మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూర్చారని, ఈ స్కామ్‌‌కు కుట్రదారుల్లో ఆయనను కీలక వ్యక్తిగా చార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది.

జైలు నుంచి కేజ్రీవాల్ ఇచ్చిన ఆదేశాలేంటి?

తమ నేతలపై నమోదైన కేసులకు ఆధారాలు లేవని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. డిసెంబర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 'మై భీ కేజ్రీవాల్ - నేనూ కేజ్రీవాల్' పేరుతో సంతకాల సేకరణ ప్రారంభించింది.

ఆ సమయంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే రాజీనామా చేయాలా? లేదా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చా? అనే ప్రశ్న తలెత్తింది.

దిల్లీ కేబినెట్‌ మంత్రులు మనీష్‌ సిసోదియా, సత్యేంద్ర జైన్‌లను కూడా ఈడీ అరెస్టు చేసింది. వీరిద్దరూ ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆ ఇద్దరూ తమ పదవులకు రాజీనామా కూడా చేశారు.

ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ నీటికొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషికి లేఖ రాశారు.

ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ- కేజ్రీవాల్ ఇచ్చిన ఆదేశాల్లో ''నేను జైల్లో ఉన్న సమయంలో ప్రజలు నీటికొరత, మురుగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిసింది. వాటి గురించి ఆందోళన చెందుతున్నా. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అవసరమైన ప్రాంతాలకు నీటి ట్యాంకర్లను పంపించాలి’’ అని చెప్పారని తెలిపారు.

కోర్టు ఆదేశాల ప్రకారం, కేజ్రీవాల్ రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు తన భార్య సునీతా కేజ్రీవాల్‌ను, పీఏ విభవ్ కుమార్‌లను కలవొచ్చు.

దాంతోపాటు రోజులో అరగంట పాటు తన లాయర్లను కూడా కలిసే అవకాశం ఉంది.

దిల్లీలో ప్రజారోగ్య సమస్యలకు సంబంధించి ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ తమకు ఆదేశాలిచ్చారని దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మంగళవారం చెప్పారు.

మొహల్లా క్లినిక్‌లలో వైద్య పరీక్షల విషయంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు.

కానీ, ముఖ్యమంత్రి జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపవచ్చా? బీబీసీ దీనిపై న్యాయ నిపుణులతో మాట్లాడింది.

కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడంపై రాజ్యాంగ వ్యవహారాల నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ బీబీసీతో మాట్లాడుతూ- ''కేజ్రీవాల్ జైలు నుంచి తన విధులు నిర్వర్తించేందుకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులూ లేవు'' అన్నారు.

''కస్టడీలో ఉన్నందు వల్ల పదవి నుంచి తొలగించడం సాధ్యం కాదు, కానీ ఆయన దోషిగా నిర్ధరణ అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగేందుకు అనర్హుడవుతారు.''

ఈ విషయంలో చట్టపరంగా ఎలాంటి నిబంధనలూ లేనప్పటికీ, జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిన ఉదాహరణలు గతంలో లేవని, ఇది నైతికతకు సంబంధించిన అంశమని న్యాయనిపుణులు అంటున్నారు.

గతంలో ముఖ్యమంత్రిని అరెస్టు చేసే పరిస్థితి తలెత్తినప్పుడు వారు ఆ పదవికి రాజీనామా చేసేవారు. అందుకు తాజా ఉదాహరణ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.

ఇదే అంశాన్ని బీజేపీ నేతలు కూడా లేవనెత్తుతున్నారు. ఆ పార్టీ నేత మనోజ్ తివారీ మాట్లాడుతూ- ''ప్రభుత్వం ఎప్పుడూ జైలు నుంచి నడవలేదు. మీరు జైలు నుంచి గ్యాంగ్‌ను నడపవచ్చు కానీ, ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారం, అందులోని నిబంధనలను అనుసరించి నడుస్తుంది.''

బీజేపీ న్యూదిల్లీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ- ''జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం వల్ల దిల్లీ ప్రజలకు నష్టం జరుగుతుంది. కేజ్రీవాల్ దేశంలోని నేతలందరికీ నీతులు చెప్పేవారు. ఇప్పుడు మీ ఆత్మ ఎందుకు నిద్రపోతోంది? నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలి'' అన్నారు.

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేలా సౌకర్యాలు పొందగలరా?

ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, గతంలో సంజయ్ చంద్ర, అజయ్ చంద్రల విషయంలోనూ, సుబ్రతో రాయ్ విషయంలోనూ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌ వంటి సౌకర్యాలు కల్పించారని చెప్పారు.

తన నియోజకవర్గానికి ఎమ్మెల్యే నిధులు విడుదల చేసేందుకు మనీష్ సిసోదియాకు దిల్లీ కోర్టు కూడా అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పారు.

కేజ్రీవాల్ రిమాండ్, అరెస్టులో చట్టపరమైన విషయాలు పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి ఎలాంటి అడ్డంకులూ లేవని గోపాల్ చెప్పారు.

జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడం గురించి మాట్లాడుతూ, ఆయనకు ఆ హక్కు ఉంటుందని ఆయన అంటున్నారు.

అయితే, జైలు నుంచి చేయలేని విధులు ఉండే ముఖ్యమైన మంత్రిత్వ శాఖ తన వద్ద ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో మార్పులు ఉండవచ్చని ఆయన అన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేయగలరు?

దిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచి నడిపేందుకు అనుమతించబోమని టైమ్స్ నౌ సమ్మిట్‌లో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అన్నారు.

ప్రభుత్వం జైలు నుంచి నడుస్తుందా అనే ప్రశ్నకు లెఫ్టినెంట్ గవర్నర్ స్పందిస్తూ- ''ప్రభుత్వం జైలు నుంచి నడవబోదని నేను దిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నా'' అన్నారు.

అయితే, ఈ విషయంపై గోపాల్ మాట్లాడుతూ '' ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు కూడా అధికారాలు పరిమితంగానే ఉన్నాయి'' అన్నారు.

''ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏబీ ప్రకారం ఆ అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు మాత్రమే ఉంటుంది. అయితే, రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే ఈ అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు.''

కేజ్రీవాల్ రాజీనామాతో ప్రతికూల పరిణామాలు ఉంటాయా?

''నిర్బంధం కారణంగా ఒకరిని పదవి నుంచి తొలగించాలనే వాదన చాలా ప్రమాదకరం'' అని ప్రముఖ న్యాయ నిపుణుడు ప్రొఫెసర్ జి.మోహన్ గోపాల్ అన్నారు.

అరెస్టైన తర్వాత కూడా మంత్రులు పదవుల్లో కొనసాగిన ఉదాహరణలు చాలా ఉన్నాయని, అలాగే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయని ఆయన అంటున్నారు.

"ఒక కేసులో ఆరోపణలను రుజువు చేయడం వేరే విషయం. కానీ, ఇలాంటి ఆరోపణలు ప్రభుత్వ రోజువారీ పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకూడదు. కేజ్రీవాల్ కచ్చితంగా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలరు, అయితే కొన్ని షరతులు విధించవచ్చని, దానివల్ల కోర్టులో కేసుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు’’ అన్నారాయన.

ఇద్దరు ఆప్ మంత్రుల రాజీనామాల గురించి మాట్లాడుతూ, ''మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్ రాజీనామా వారి సొంత నిర్ణయం. వారి రాజీనామాల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత. బహుశా అందువల్లే పార్టీ అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది, అయితే దాని పరిణామాలు వేరుగా ఉండవచ్చు'' అని చెప్పారు.

ఈ కేసులో ఇంతవరకు ఏం జరిగింది?

దిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌, ఇతరులు అరెస్టయ్యారు.

ఎక్సైజ్ పాలసీలో అవకతవకలపై విచారణ జరిపిన సీబీఐ 2023 ఫిబ్రవరి 26న మనీష్ సిసోదియాను అరెస్టు చేసింది.

మనీష్ సిసోదియా నేతృత్వంలో 2021 నవంబర్‌లో దిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చారు.

2022 ఆగస్టులో దిల్లీ ప్రభుత్వం ఈ కొత్త మద్యం విధానాన్ని రద్దు చేసింది.

ఈ విధానం విషయంలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

కొత్త విధానం ప్రకారం, మద్యం వ్యాపారం నుంచి దిల్లీ ప్రభుత్వం తప్పుకుని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది.

ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, మద్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడం, మద్యం విక్రయ లైసెన్సుల ప్రక్రియను సులభతరం చేయడం, మద్యం కొనుగోళ్లను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు అప్పట్లో దిల్లీ ప్రభుత్వం చెప్పింది.

ఈ విధానంలో మద్యం హోమ్ డెలివరీతో పాటు మద్యం వ్యాపారులు డిస్కౌంట్లు ప్రకటించుకునే అవకాశం కల్పించింది.

మద్యం పాలసీలో చాలా అవకతవకలు జరిగాయని, విక్రయదారులకు లైసెన్సుల మంజూరు కోసం మనీష్ సిసోదియా లంచాలు తీసుకున్నారంటూ 2022 జులైలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపిన నివేదికలో అప్పటి దిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఆరోపించారు.

ఆ నివేదిక ఆధారంగా మద్యం పాలసీలో అవకతవకలపై దర్యాప్తు చేయాలని సీబీఐకి లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు. అనంతరం దిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

2022 ఆగస్టులో మనీష్ సిసోదియా సహా 15 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ కూడా ఇప్పటివరకు పలు అరెస్టులు చేసింది.

ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన వారిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-03-29T06:36:55Z dg43tfdfdgfd