సీఎం ఛోటే భాయ్​.. పీఎం బడే భాయ్ : కేసీఆర్

సీఎం ఛోటే భాయ్​.. పీఎం బడే భాయ్ : కేసీఆర్

  •   కాంగ్రెస్​కు ఓటేసినా.. బీజేపీకి వేసినా ఒక్కటే: కేసీఆర్
  • పాలమూరులో రోడ్​ షో, కార్నర్ మీటింగ్ 

మహబూబ్​నగర్​, వెలుగు : సీఎం రేవంత్​ రెడ్డి ఛోటే భాయ్,  పీఎం నరేంద్ర మోదీ బడే భాయ్ అని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరిలో  ఎవరికి ఓటు వేసినా ఒక్కటేనని అన్నారు. ‘‘ఛోటే భాయ్​కి ఓటు వేస్తే పెద్దన్న (మోదీ)కు వెళ్తుంది. పెద్దన్న గెలిస్తే బావులకు మీటర్లు పెడ్తడు..’’ అని ఆరోపించారు.  లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా  కేసీఆర్​ చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం పాలమూరులో కొనసాగింది. సాయంత్రం ఎర్రవల్లి ఫామ్​హౌస్​ నుంచి బస్సులో బయల్దేరిన కేసీఆర్ ఏడు గంటలకు పాలమూరు చేరుకున్నారు.

 ఈ సందర్భంగా​ అప్పన్నపల్లి ఫ్లై ఓవర్​ నుంచి రోడ్​ షో ప్రారంభమై మెట్టుగడ్డ, వన్​టౌన్​ మీదుగా క్లాక్​ టవర్​ వద్దకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగ్​లో కేసీఆర్​ మాట్లాడారు. మోదీ దేశాన్ని పదేండ్లు పాలించి, ఇప్పటి వరకు వంద నినాదాలు చేసిండని.. అందులో ఒక్కటి కూడా నిజం లేదని విమర్శించారు. ‘‘మోదీవి కట్టుకథలు, పిట్టకథలు. ఆయన వల్ల ప్రజలకు ఏం లాభం జరిగింది. బేటీ పఢావో.. బేటీ బచావో ఏమైంది? మేకిన్​ ఇండియా బక్వాస్ అయ్యింది. సబ్​కా వికాస్​.. దేశ్​ కా సత్యనాశ్ అయ్యింది. డిజిటల్​ ఇండియా జరిగిందా? అచ్చేదిన్​ వచ్చిందా? సచ్చే దిన్​ వచ్చిందా? ” అని కేసీఆర్ ​మండిపడ్డారు.

వంద ఉత్తరాలు రాసినా స్పందించలే.. 

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా ప్రధాని మోదీ పట్టించుకోలేదని కేసీఆర్​ అన్నారు. ‘పాలమూరు వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు పాలమూరు పేరుతో స్కీమ్​ ప్రారంభించినం. ఈ  ప్రాజెక్టు కట్టుకోవడానికి వంద ఉత్తరాలు రాసినం. జాతీయ హోదా ఇవ్వాలని బతిమాలినం. ఇవ్వనేలేదు. డీకే అరుణ ఐదేండ్లు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె పాలమూరుకు జాతీయ హోదా తీసుకొచ్చిందా? మరి ఏ ముఖంతో ఓట్లు అడుగుతున్నారు' అని కేసీఆర్​ ప్రశ్నించారు.

నన్ను పట్టుకొని ఇన్ని మాటలంటరా?

సీఎం రేవంత్​రెడ్డిది ఏం మర్యాద అని కేసీఆర్​ మండిపడ్డారు. ‘‘రేవంత్​రెడ్డి నా గుడ్లు పీకి గోటిలాడుకుంటడట. నా పేగులు చీల్చి మేడలో వేసుకుంటడట. చడ్డీ గుంజి చర్లపల్లి జైల్లో వేస్తాడట. ఇవేం మాటలు? ఇదేం మర్యాద? 15 ఏండ్లు అందరూ కలిసి కొట్లాడి.. తెలంగాణ తెచ్చుకున్నం. దానికి నాయకత్వం వహించిన. రాష్ర్టం కోసం ప్రాణాలు పోయేదాకా తెగబడి పోరాడిన. నన్ను పట్టుకొని ఇన్ని మాటలంటుండు.  నీకు ఇచ్చిన హామీలు అమలు చేసే చేతనైతలేదా? నీకు చేసే దమ్ము ఉంటే చేయాలె.’’ అని రేవంత్​నుద్దేశించి కేసీఆర్ అన్నారు.

ప్రాణం ఉన్నంతవరకూ యద్ధం చేస్తా

తన కండ్ల ముందు తెలంగాణ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోబోనని కేసీఆర్​అన్నారు. ప్రాణం ఉన్నంత వరకూ యుద్ధం చేస్తా తప్ప నిద్రపోనని చెప్పారు. ‘‘ఇవాళ బీజేపోడు వస్తడు. కాంగ్రెసోడు వస్తడు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు బీజేపీ బీ-టీమ్‌‌‌‌ అంటడు. వాడువీనికి.. వీనికి వాడు అంటడు. కానీ, మొన్న భోనగిరిలో ఏం జరిగింది ? భోనగిరి మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ ఇద్దరు కలిసి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ను తీసేసి ఇవాళ కాంగ్రెస్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌, బీజేపీ వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌.. ఇది జరుగుతున్నది. ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నరు.’’ అని అన్నారు. 

అరుణ అక్కరకు రాని చుట్టం..

ప్రత్యేక రాష్ట్రం కోసం తాము ఉద్యమం చేస్తుంటే ఆంధ్ర వాళ్లు మన నీళ్తు ఎత్తుకుపోయారని కేసీఆర్​అన్నారు. 'ఉద్యమ సమయంలో మన నీళ్లు కాల్వలు తీసి ఆంధ్ర వాళ్లు తీసుకుపోయిండ్రు. అప్పటి ఏపీ మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్రగా వస్తే డీకే అరుణ మంగళ హారతులు ఇచ్చారు. ఈమెకు మనం ఓటు వేయాలా? డీకే అరుణకు ఓటు వేయడం 'అక్కరకు రాని చుట్టం. మొక్కిన వరం ఇయ్యని వేల్పు' అన్నట్టు ఉంటది. ఎందుకు బీజేపీకి ఓటు వేయాలె? మన కంటిని మనమే పొడుచుకుందామా?'’ అని ప్రశ్నించారు.

వ్యవసాయ బావులకు మోదీ మీటర్లు పెట్టాలన్నడు

వ్యవసాయ బావులకు మోటర్లు పెట్టాలని తనను మోదీ కోరితే.. ఒప్పుకోలేదని కేసీఆర్​ చెప్పారు. 'మోదీ నాతో ఓ మాటన్నడు. కేసీఆర్.. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలె. మీటర్లు పెట్టకపోతే మీ రాష్ట్రానికి ఏడాదికి వచ్చే రూ.5 వేల కోట్ల గ్రాంట్​ను బంద్​ చేస్తం అన్నడు. నా ప్రాణం పోయినా.. తలకాయ తెగినా మీటర్లు పెట్టనని చెప్పిన. ఇప్పుడు మోదీకి ఓటు వేస్తే.. మేం బావులకు మీటర్లు పెడ్తమన్నా రైతులు మాకు ఓట్లు వేసిండ్రని, కచ్చితంగా మీ వ్యవసాయ బావులకు మీటర్లు బిగిస్తరు. ఇక్కడున్న రేవంత్​కు ఓటు వేసినా మోదీచెప్పిండని మీటర్లు పెట్టిస్తడు. బీజేపీకి ఓట్లు వేసినా మీటర్లు పెడతరు' అని కేసీఆర్​ అన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-27T03:24:53Z dg43tfdfdgfd