సీక్రెట్స్ ఆఫ్ ది నియాండర్తల్స్: 75 వేల ఏళ్లనాటి మహిళ ముఖాన్ని శాస్త్రవేత్తలు మళ్లీ ఎలా సృష్టించారంటే....

మీకు నియాండర్తల్స్ గురించి తెలుసా? 6 లక్షల సంవత్సరాల కిందట మానవ జాతి రెండు బృందాలుగా చీలిపోయింది. ఒక బృందం ఆఫ్రికాలో ఉండిపోయింది. ఆ బృందం నుంచే మనమందరం పరిణామం చెందాం.

రెండో బృందమే యూరేషియా (యూరప్, ఆసియా) ప్రాంతంలో నియాండర్తలెన్సిస్ అనే జాతిగా పరిణామం చెందింది. వారినే నియాండర్తల్స్ అని పిలుస్తున్నాం. ఒకరకంగా వీరు మనకు తోబుట్టువులు.

ఇప్పుడా తోబుట్టువులలో ఒకరు మనముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? శాస్త్రవేత్తలు ఆ తోబుట్టువును మనముందు నిలిపేందుకు ఓ ప్రయత్నం చేశారు. 75 వేల ఏళ్ళ కిందటి నియాండర్తల్ మహిళ పుర్రె ఆధారంగా, ఆ మహిళ ముఖాన్ని పునర్నిర్మించారు.

నియాండర్తల్ మహిళ ఇప్పుడు జీవించి ఉంటే ఎలా ఉండేవారో అలాగే అచ్చుగుద్దినట్టుగా ఉండేలా తయారు చేశారు.

అయితే, ఈ నియాండర్తల్ మహిళ పుర్రె ఛిన్నాభిన్నమైన స్థితిలో ఉంది. పాలల్లో తడిసిన బిస్కెట్‌లాగా మృదువుగా ఉంది. దీన్ని అవశేషాలన్నింటినీ సేకరించిన శాస్త్రవేత్తలు వాటిని గట్టిగా మార్చి ఆ మహిళ పుర్రెను యధారూపానికి తెచ్చారు. తరువాత అనుభవజ్ఞులైన పాలియే ఆర్టిస్టులు 3 డీ మోడల్‌ను రూపొందించారు.

ప్రయోజనం ఏంటి?

40వేల ఏళ్ళ కిందట ఈ నియాండర్తల్స్ జాతి ఎలా అంతరించిపోయిందనే అంశాన్ని వివరించే ‘సీక్రెట్స్ ఆఫ్ నియాండర్తల్స్’ అనే డాక్యుమెంటరీని బీబీసీ స్టూడియోస్ నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించింది. ఆ డాక్యుమెంటరీలో ఈ ప్రతీకాత్మక చిత్రం దర్శనమిస్తుంది.

‘‘వారు (నియాండర్తల్స్) ఎవరు, ఏంటి అనే విషయం తెలుసుకోవడానికి ఈ బొమ్మ మనకు సాయపడొచ్చు’’ అంటారు డాక్టర్ ఎమ్మాపొమెరాయ్. ఆమె యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి ప్రాజెక్ట్ లో పాలియే ఆంథ్రోపాలజిస్ట్ గా ఉన్నారు.

‘‘ఏ వ్యక్తి అవశేషాలపైనైనా, ప్రత్యేకించి ఇలాంటి ప్రత్యేక మహిళ అవశేషాలపై అధ్యయనం చేయడం చాలా సంతోషంగా ఉంటుంది’’ అని ఆమె బీబీసీకి చెప్పారు.

ఇరాక్ కుర్దిస్తాన్‌లోని షానిదార్ గుహలో ఈ మహిళ పుర్రె లభించింది. ఈ గుహ 1950లో కనీసం 10మంది నియాండర్తల్ పురుషులు, మహిళలు, చిన్నారుల అవశేషాలు లభించిన ఓ ప్రత్యేక ప్రాంతం.

2015లో కుర్దిష్ అధికారులు బ్రిటీషు బృందాన్ని ఆహ్వానించినప్పుడు వారు ఓ అస్థి పంజారాన్ని కనుగొన్నారు. దీనిని షానిదార్-జెడ్ అని పిలుస్తారు. ఇందులో వెన్నెముక, భుజాలు, చేతులతో కూడిన శరీర పైభాగం ఉంది.

ఈ పుర్రె చాలాభాగం బాగానే ఉంది. కానీ 2 సెంటిమీటర్లు (0.7 అంగుళాలు) మేర మందమైన పొరలా చీలిపోయింది. బహుశా గుహలో పై నుంచి ఏ రాయో పడడటం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు.

‘‘పుర్రె పిజ్జాలా చదునుగా ఉంది’’ అని కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గరేమీ బార్కర్ చెప్పారు. షానిదార్‌లో తవ్వకాలకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

‘‘పిజ్జాలా చదునుగా ఉన్న పుర్రె నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న మార్పు వరకు ఇదో అద్భుతమైన ప్రయాణం. పురావస్తు శాస్త్రవేత్తగా కొన్ని పనులు బోరు కొట్టొచ్చు కానీ, అప్పుడప్పుడు ఇలాంటి పనులు జరిగినప్పుడు తన్మయులం అవుతుంటాం. ఎందుకంటే మనం గతంలోకి చూస్తున్నాం. కొన్నిసార్లు ఇదెంతటి అద్భుతమైన పనో మనం అర్ధం చేసుకోలేం’’ అని చెప్పారు.

పుర్రె పునర్‌నిర్మాణానికి ఏడాది

స్థానిక పురావస్తు శాఖ అనుమతితో పుర్రె శకలాలను యూకేకు తీసుకువచ్చారు. పుర్రె అవశేషాలను యధాస్థానాలకు తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించారు.

జిగ్‌సా పజిల్ లాంటి క్లిష్టతరమైన ఈ ప్రక్రియను పూర్తి చేసి పుర్రెను యధాతథ రూపానికి తేవడానికి ఓ పురావస్తు సంరక్షణాధికారికి ఏడాదికిపైగా సమయం పట్టింది.

పునర్నిర్మించిన పుర్రె‌ను స్కాన్ చేసి, 3డీ ప్రింట్ తీశారు. ఆ ప్రింట్‌ను డచ్ ఆర్టిస్టులు ఆడ్రీ, అల్ఫాన్స్ కెన్నిస్‌కు ఇచ్చారు. వీరిద్దరూ పురాతన మానవుల ఎముకలు, శిలాజ అవశేషాల నుంచి ప్రతిబింబాలను తయారుచేయడంలో సిద్ధహస్తులు

అయితే ఈ బొమ్మలు ఎంతటి ఆసక్తి కలిగించినా, అసలైన పుర్రెకే నిజమైన విలువ ఉంటుందని ఈ బృందం భావిస్తోంది.

ఆ పుర్రె మహిళదేనా?

ఈ బృందం ఈ పుర్రె మహిళదే అని చాలా గట్టి నమ్మకంతో ఉంది. అయితే కటి ఎముకలు దొరికి ఉంటే మహిళో కాదో నిర్ణయించడం తేలిక అయ్యేది. కానీ అవి శరీర పైభాగంతోపాటుగా దొరకలేదు.

కటి ఎముకలు దొరకకపోయినా పరిశోధకులకు పళ్ళ ఎనామిల్‌లో లభించిన ప్రొటీన్ ఆధారంగా ఆమె మహిళే అని నిర్థరించారు. దీనికితోడు అస్తిపంజరం ఎత్తు కూడా దీనికి బలం చేకూర్చింది.

ఆమె వయసు ఎంత ఉండొచ్చు? బహుశా 40 ఏళ్ళ వయసులో ఆమె చనిపోయి ఉంటుందని, మూలాల వరకు అరిగిపోయిన ఆమె దంతాల ఆధారంగా నిర్థరణకు వచ్చారు.

‘‘ఆమె దంతాలు అరిగిపోయాయి. నమిలే సామర్థ్యం తగ్గిపోయి ఉంటుంది. దీనివల్ల తగినంత ఆహారాన్ని తీసుకోలేకపోయి ఉంటుంది’’ అని డాక్టర్ పొమెరాయ్ వివరించారు.

‘‘ఆమె దంతక్షయానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా మాకు కనిపించాయి. ఆమెకు కొన్ని ఇన్ఫెక్షన్లు, చిగుళ్ళు వ్యాధులు ఉన్నట్టు అర్థమవుతోంది. దీన్ని బట్టి ఆమె మరణం సహజమైనదే అని తెలుస్తోంది’’ అని చెప్పారు.

నియాండర్తల్స్ అనాగరికులా?

నియాండర్తల్స్‌ అనాగరికంగా ఉండేవారని చాలాకాలంగా భావిస్తూ వచ్చారు. కానీ షానిదార్‌ గుహలో కనుగొన్న విషయాల వల్ల ఈ అభిప్రాయంలో మార్పు వస్తోంది.

ఈ గుహ నియాండర్తల్స్ అంతిమ సంస్కారాల పద్దతులను తెలియజేసింది. ఇక్కడ చనిపోయినవారందరినీ ఓ పొడవైన రాతి స్తంభం పక్కనే జాగ్రత్తగా ఉంచారు. శవాలను వరుసగా ఉంచిన తీరు, చనిపోయినవారి విషయంలో నియాండర్తల్స్ కొన్ని సంప్రదాయాలను పాటించారనే విషయాన్ని తెలుపుతోంది.

ఓ అస్థిపంజరంపై పుప్పొడి రేణువులు కనిపించాయి. దీన్ని బట్టి చనిపోయినవారిని పూలతో పాటు పూడ్చడం వారి మతాచారాం అయి ఉండొచ్చనే వాదన వచ్చింది.

కానీ బ్రిటీషు బృందం మాత్రం ఈ పుప్పొడి రేణువులు తేనెటీగల ద్వారా కానీ, లేదంటే సమాధులపైన ఉంచిన పూల కొమ్మల నుంచి రాలి పడి ఉండొచ్చని భావించింది.

‘‘అయితే హైనాలాంటి క్రూరజంతువులు మృతదేహాలను పీక్కుతినకుండా ఉండేందుకు, అక్కడ పూల కొమ్మలు నాటి ఉంటారని’’ ప్రొఫెసర్ క్రిస్ హంట్ చెప్పారు. ఆయన లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీకి చెందినవారు.

అయితే చనిపోయినప్పుడు వారు కచ్చితంగా ఓ సంప్రదాయాన్ని పాటించారాని, ఈ బామ్మను ఖననం చేసిన విధానమే చెబుతోందని ఆయన వివరించారు.

గురువారం నుంచి సీక్రెట్స్ ఆఫ్ ది నియాండరల్త్స్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది.

గాజువాక: పవన్ కల్యాణ్ గతంలో ఓడిపోయిన ఈ అసెంబ్లీ స్థానంలో ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం? ఇలాంటి ఆసక్తి కరమైన కథనాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-05-02T13:24:16Z dg43tfdfdgfd