సైకీ ఆస్టరాయిడ్: కోటానుకోట్ల విలువైన ఖనిజ రాశులున్న ఈ గ్రహ శకలం.. మానవాళికి బంగారు బాతు కానుందా..?

Psyche Mission: విశ్వం గుట్టు విప్పేందుకు, గ్రహాలు ఆవిర్భావానికి సంబంధించిన రహస్యాన్ని తెలుసుకునేందుకు.. అన్ని దేశాలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా ఓ భారీ ప్రయోగాన్ని గతేడాది చేపట్టింది. భూమికి ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైకీ అనే గ్రహశకలంపై పరిశోధనలు జరిపేందుకు సైకీ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను.. గతేడాది నాసా ప్రయోగించింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ ఆ సైకీ గ్రహశకలం సమీపానికి చేరుకుని రెండేళ్ల పాటు పరిశోధనలు జరపనుంది. ఆ సైకీ గ్రహశకలంపై 10 వేల క్వాడ్రిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.80 లక్షల కోట్ల కోట్లు విలువైన లోహాలు, ఖనిజాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రూ.80 లక్షల కోట్ల కోట్లు అంటే 8 పక్కన 20 సున్నాలు ఉంటాయన్నమాట. ఈ సంఖ్యను లెక్కించడం, చదవడమే చాలా కష్టం. 2023లో నింగిలోకి దూసుకెళ్లిన ఈ స్పేస్ క్రాఫ్ట్.. తాజాగా కొంత సమాచారాన్ని కూడా పంపించింది.

ఈ సైకీ గ్రహశకలం గుట్టు విప్పేందుకు గతేడాది నాసా ఒక ప్రయోగాన్ని చేపట్టింది. 2023 అక్టోబర్ 5న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి సైకీ స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగిలోకి పంపించింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ 2029 నాటికి సైకీ గ్రహశకలం దగ్గరకు చేరనుంది. అప్పటి నుంచి 2 ఏళ్లపాటు అంటే 2031 వరకు సైకీ గ్రహశకలాన్ని దూరం నుంచి పరిశోధనలను జరపనుంది. ఈ సైకీ స్పేస్‌క్రాఫ్ట్ గతేడాది డిసెంబర్ 11వ తేదీన కొంత సమాచారాన్ని భూమికి పంపించింది. భూమికి 3.1 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి 15 సెకన్ల నిడివి ఉన్న వీడియోను నాసాకు పంపించింది. అల్ట్రా హై డెఫినిషన్ వీడియోను 267 ఎంబీపీఎస్ వేగంతో చేరవేసింది.

ఇక తాజాగా ఆ స్పేస్‌క్రాఫ్ట్ ఏప్రిల్ 8 వ తేదీన మరోసారి కొంత సమాచారాన్ని పంపించినట్లు నాసా వెల్లడించింది. భూమికి 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి 10 నిమిషాల నిడివి ఉన్న వీడియోను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఈ ప్రాజెక్ట్‌కు ఆపరేషన్స్ లీడ్‌గా ఉన్న మీరా శ్రీనివాసన్ తెలిపారు. ఈ దూరం అనేది భూమికి, సూర్యుడికి ఉన్న దూరంతో పోల్చితే ఒకటిన్నర రెట్లు అని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రయోగంలో తాజాగా వచ్చిన డేటా ఎంతో కీలకమని చెప్పారు. 25 ఎంబీపీఎస్ వేగంతో ఆ 10 నిమిషాల వీడియో డౌన్‌లోడ్ అయినట్లు వెల్లడించారు.

ఈ సైకీ గ్రహశకలాన్ని 172 ఏళ్ల క్రితం ఇటలీకి చెందిన అనిబేల్ డి గాస్పరిస్ అనే ఖగోళశాస్త్రవేత్త కనుగొన్నారు. కుజుడు, అంగారకుడికి మధ్య ఉండే ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఉండే వేలాది గ్రహశకలాల్లో సైకీ గ్రహశకలం ఒకటి. ఈ సైకీ గ్రహశకలం వ్యాసం దాదాపు 220 కిలోమీటర్లు. ఉపరితల వైశాల్యం 1,65,800 చదరపు కిలోమీటర్లు. అయితే ఈ సైకీ గ్రహశకలంపై ఖనిజాలు, లోహాలు మెండుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటి విలువ ఏకంగా10 వేల క్వాడ్రిలియన్ డాలర్లు అని తెలిపారు. మన భారత కరెన్సీలో ఆ విలువ రూ.80 లక్షల కోట్ల కోట్లు. ఈ పరిశోధనలు విజయవంతం అయి.. ఆ ఖనిజాలు, లోహాలను భూమి మీదికి తీసుకువచ్చే దిశగా నాసా తొలి అడుగులు వేస్తోంది.

ఈ స్పేస్‌క్రాఫ్ట్ దాదాపు 26 నెలలపాటు సైకీ గ్రహశకలంపై పరిశోధనలు జరపనుంది. ఇందులో సైకీ గ్రహశకలం ఫోటోలు.. ఆ గ్రహశకలం చరిత్ర, దాని కూర్పును విశ్లేషించేందుకు.. శాస్త్రవేత్తలకు కావాల్సిన రకరకాల సమాచారాన్ని సేకరించనుంది. ఈ సైకీ గ్రహశకలాన్ని.. ఆ స్పేస్ క్రాఫ్ట్‌లోని సైంటిఫిక్ పరికరాల ద్వారా పరిశోధించనున్నారు. అందులో మల్టీస్పెక్ట్రల్ ఇమేజర్, మాగ్నెటోమీటర్, గామా-రే, న్యూట్రాన్ స్పెక్ట్రోమీటర్ వంటి పరికరాలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే సమాచారంతో గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అని తెలుసుకోవడంలో సహాయపడుతాయని నాసా భావిస్తోంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-03T13:41:05Z dg43tfdfdgfd