హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన కెనడా

సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ముగ్గురు భారతీయ పౌరులను అక్కడి అధికారులు అరెస్టు చేశారు.

2023 జూన్‌లో కెనడాలోని వాంకోవర్ శివారులో 45 ఏళ్ల నిజ్జర్‌ను ముసుగులు ధరించిన వ్యక్తులు కాల్చి చంపారు.

ఆ తర్వాత, నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు.

దాంతో భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తింది. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.

అరెస్టయింది ఎవరు?

నిజ్జర్ హత్య కేసులో కరణ్ బ్రార్ (22), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ ప్రీత్ సింగ్ (28)లను అరెస్టు చేసినట్లు ఇన్వెస్టిగేషన్ అధికారి, సూపరింటెండెంట్ మన్‌దీప్ మూకర్ శుక్రవారం వెల్లడించారు.

ఈ ముగ్గురూ కెనడాలో అల్బెర్టాలోని ఎడ్మోంటన్‌లో నివసిస్తున్నారని, అక్కడే వారిని అరెస్టు చేసినట్లు మన్‌దీప్ తెలిపారు.

వీరంతా మూడు నుంచి ఐదేళ్లుగా కెనడాలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

నిజ్జర్ హత్యలో "భారత ప్రభుత్వానికి ఉన్న సంబంధాల"తో సహా విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

"ఈ విషయాలపై ప్రత్యేక, విభిన్నమైన విచారణలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఖచ్చితంగా ఇప్పుడు అరెస్టయిన వ్యక్తుల ప్రమేయం మాత్రమే లేదు" అని అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ టెబౌల్ అన్నారు.

విచారణ బృందం భారత అధికారులతో కలిసి పని చేస్తోందని, అయితే ఇది కష్టంగా, సవాలుగా ఉందని వారు చెప్పారు.

ఈ హత్యలో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని, తదుపరి అరెస్టులు, అభియోగాలు నమోదవ్వొచ్చని పోలీసులు తెలిపారు.

ఎవరీ నిజ్జర్?

భారత్‌లో సిక్కుల జనాభా 2 శాతం. తమకు ప్రత్యేక దేశం ‘ఖలిస్తాన్’ కావాలని సిక్కు వేర్పాటువాదులు డిమాండ్ చేస్తున్నారు.

1970వ దశకంలో కొందరు సిక్కులు ఈ వేర్పాటువాదాన్ని ప్రారంభించారు, ఆ తర్వాత దశాబ్ధంలో వేల మంది మరణించారు.

అప్పటి నుంచి ఉద్యమం ఎక్కువగా సిక్కు జనాభా ఉన్న ఇతర దేశాలకే పరిమితం అయింది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ ఒక సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఆయన ఖలిస్తాన్ కోసం బహిరంగంగా ప్రచారం చేశారు.

దీంతో నిజ్జర్‌ను వేర్పాటువాద బృందానికి నాయకత్వం వహించిన తీవ్రవాదిగా భారత్ గతంలో ప్రకటించింది. భారత్ చేస్తున్న ఈ ఆరోపణలు నిరాధారమని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

నిజ్జర్ క్రియాశీలంగా ఉండటంతో బెదిరింపులు వచ్చాయని చెప్పారు.

హత్య ఎప్పుడు జరిగింది?

గత ఏడాది జూన్ 18న వాంకోవర్‌కు తూర్పున 30 కి.మీ దూరంలో ఉన్న సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద నిజ్జర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

అంతకుముందే నిజ్జర్ హిట్ లిస్టులో ఉన్నారని, ఆయన ప్రాణానికి ముప్పు ఉందంటూ కెనడియన్ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించిందని ఆయన సన్నిహితులు గుర్తుచేశారు.

నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో పురోగతిపై సిక్కు సంఘం కృతజ్ఞతలు తెలుపుతోందని బ్రిటీష్ కొలంబియా గురుద్వారాస్ కౌన్సిల్ సభ్యుడు మోనీందర్ సింగ్ అన్నారు.

నిజ్జర్‌తో ఆయనకు 15 ఏళ్ల స్నేహం ఉన్నట్లు చెప్పారు. నిజ్జర్ హత్య తర్వాత భదత్రపై అనుమానాలు, ఉద్రికత్తలు ఉన్నాయని, చాలామందిలో నిరాశ కూడా ఉందని ఆయన తెలిపారు.

భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణలు

నిజ్జర్ హత్య జరిగిన మూడు నెలల తర్వాత, ఆయన హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయంపై కెనడా ఇంటెలిజెన్స్‌కు విశ్వసనీయమైన సమాచారం ఉందని ప్రధాని ట్రూడో అప్పట్లో చెప్పారు.

‘‘కెనడా గడ్డపై ఒక కెనడా పౌరుడిని విదేశీ శక్తులు హత్య చేయడం మా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే’’ అని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ట్రూడో వ్యాఖ్యానించారు.

భారత అధికారులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇరు దేశాలూ దౌత్యవేత్తలను బహిష్కరించేంత స్థాయికి ఇవి చేరుకున్నాయి.

అంతేకాదు భారత్‌లోని రాయబారుల సంఖ్యను తగ్గించాలని కెనడాను దిల్లీ కోరింది. నిజ్జర్ హత్యలో భారత ప్రమేయంపై ఆధారాలు చూపించాలని ట్రూడోపై ఒత్తిడి పెరిగింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-05-04T03:30:28Z dg43tfdfdgfd