హీరామండి: లాహోర్‌లో సంపన్నులైన వేశ్యలు నివసించే ప్రాంతానికి ఈ పేరు ఎలా వచ్చింది?

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన వెబ్ సిరీస్ “హీరామండి- ద డైమండ్ బజార్” నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

కళ్లు మిరిమిట్లు గొలిపే సెట్టింగ్స్, అందులో ప్రతీ కోణాన్ని ఆవిష్కరించే కెమెరా పనితనం, 8 ఎపిసోడ్లుగా విడుదలవుతున్న ఈ సిరీస్ విడుదలకు ముందు నుంచే వార్తల్లో నిలిచింది.

కొంతమంది ఈ సిరీస్‌ను పొగుడుతుంటే మరి కొంతమంది విమర్శిస్తున్నారు.

హీరామండి కథ అంతా మల్లికా జాన్ అనే ఖరీదైన వేశ్య జీవితం చుట్టూ తిరుగుతుంది. స్వాతంత్ర్యానికి పూర్వం లాహోర్‌లోని ఈ ప్రాంతం వ్యభిచారానికి, వేశ్యలకు ప్రసిద్ధి.

దశాబ్దాల కిందట హీరామండీ నృత్యం, సంగీతం, నాగరికతకు కేంద్రంగా ఉండేది. అయితే కాలం మారే కొద్దీ ఈ ప్రాంతం గుర్తింపు మారుతూ వచ్చింది.

ఈ ప్రాంత చరిత్ర 450 ఏళ్ల నాటిదని చరిత్రకారులు చెబుతారు. దీనికి సంబంధించిన వివరాలు చాలా ఆసక్తికరం.

హీరామండి ఎలా అస్థిత్వంలోకి వచ్చింది?

అక్బర్‌ పాలనాకాలంలో, మొత్తం పాలనకు లాహోర్ నగరం కేంద్రంగా ఉండేది. ఆ సమయంలో హీరామండి ప్రాంతాన్ని షాహి మొహల్లా అని పిలిచేవారు.

లాహోర్‌లోని హైదరీ గల్లీ, హీరామండి, ఖిలా రోడ్‌లోని నావెల్టీ చౌక్‌ను ఇప్పటికీ ‘షాహీ మొహల్లా’ అని పిలుస్తారు.

చక్రవర్తుల కాలంలో రాజ కుటుంబం నివశించే ప్రాంతం, వారి సేవకులు, ఇతర ఉద్యోగులు నివశించే ప్రాంతాన్ని కూడా షాహి మొహల్లా అని పిలిచేవారు.

ఇప్పటికీ ఆటోలు, రిక్షాల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించేవారంతా కూడా దీన్ని షాహి మొహల్లా అని పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ‘కోఠాలు’ మొఘలుల కాలంలోనే నిర్మించారు. మొఘలుల పాలనా కాలం ఈ ప్రాంతానికి స్వర్ణయుగం లాంటిది.

“మొఘలుల పాలనాకాలంలో, సంపన్నులు, అధికారంతో దగ్గరి సంబంధాలు ఉన్నవారి కుటుంబాలు ఈ ప్రాంతంలోనే ఉండేవి” అని స్టేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ త్రిపురారి శర్మ చెప్పారు. రాజ ప్రసాదంలో ఏవైనా వేడుకలు జరిగినప్పుడు ఇక్కడ ఉండే వేశ్యలు లోపల జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

“ప్రస్తుతం ‘కోఠా’ అనే పదాన్ని ఉపయోగిస్తున్నతీరు సరికాదు. అని ఆమె చెప్పారు. పాటలు పాడటం, సంగీతం, నృత్యం వంటి కార్యక్రమాలు మాత్రమే జరిగే ప్రాంతాన్ని‘కోఠా’లుగా పిలిచిన రోజులున్నాయి” అని ఆమె అన్నారు.

“కోఠాల్లో ఉండే మహిళలు తమను తాము కళాకారిణులు, నటులమని చెప్పుకునేవారు. ఈ కోఠాల్లోనే అద్భుతమైన కథలు, సాహిత్యం రాసేవారు. ఇక్కడ వివిధ అంశాల గురించి ఉన్నతస్థాయి చర్చలు జరిగేవి. మాట్లాడేందుకు అవసరమైన నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ‘కోఠా’లకు వచ్చేవారు.

“సమాజంలో ఎలా జీవించాలి, ఇతరులతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి అనేక మంది అక్కడకు వచ్చేవారు” అని త్రిపురారి శర్మ చెప్పారు.

16వ శతాబ్ధం చివరి నాటికి మొఘల్ సామ్రాజ్య కేంద్రంగా లాహోర్ అస్థిత్వాన్ని కోల్పోయినప్పటికీ, అధికారాన్ని ప్రభావితం చేసే కేంద్రంగా తన పట్టు కొనసాగించింది.

ఎప్పుడు చర్చల్లోకి వచ్చింది?

కరణ్ జోహర్ సినిమా కళంక్‌లో ‘హస్సనాబాద్’ అనే పట్టణాన్ని చూపించారు. ఈ పట్టణాన్ని హీరామండి స్ఫూర్తితోనే రూపొందించారు.

భారత ఉపఖండంలో మొఘలుల ప్రాభవం తగ్గిపోతున్న రోజుల్లో మరాఠాల విజృంభణ ప్రారంభమైంది. మరోవైపు నుంచి అహ్మద్‌ షా అబ్దాలీ దాడులు పెరిగాయి.

అబ్దాలీ పంజాబ్, ఉత్తర భారత దేశం, రాజ్‌పుఠానాల మీద దాడులు చేసినప్పుడు ఆయన సైన్యం ధోబి మండి సమీపంలోని మొహల్లా దారాషికో, హీరామండిలో బస చేసింది.

హీరామండిలో స్థిరపడిన వేశ్యలకు రాజ కుటుంబంతో సంబంధాలు ఉండేవి.

అబ్దాలీ దాడుల తర్వాత తలెత్తిన పరిస్థితుల వల్ల ఈ ప్రాంతంలో పేదరికం పెరిగింది. దీంతో ఇక్కడ నివశించే వేశ్యలు డబ్బు తీసుకుని వ్యభిచారం చెయ్యడం ప్రారంభించారు. వ్యభిచారం వ్యాపారంగా మారిన తర్వాత ఇక్కడ ఉండే మహిళల్లో కొంతమందికి వేశ్యలుగా మారడం ఇష్టం లేకపోయినా అదే వృత్తిలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

పేదరికంతో బాధపడుతున్న మహిళలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధి కోసం వ్యభిచారం చేస్తూ ఉండటాన్ని గమనించిన మొఘల్ గవర్నర్ అబ్దాలీ దాడుల్ని ఆపేందుకు ప్రయత్నించారు.

మొఘలుల సైన్యం అబ్దాలీని అడ్డుకోవడంతో రెండు సైన్యాల మధ్య యుద్ధం, ఘర్షణల వల్ల ఈ ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మారింది.

ఈ పరిస్థితి సద్దుమణిగిన తర్వాత లాహోర్ 1799 నుంచి మహారాజా రంజిత్ సింగ్ పరిపాలన ప్రారంభమైంది. రంజిత్ సింగ్ పాలనాకాలంలో హీరామండి ప్రశాంతంగా ఉంది.

రంజిత్ సింగ్ పాలనా కాలంలోనే రంజిత్ సింగ్ బంధువు హీరా సింగ్ పేరు మీదుగా ఈ రాయల్ లొకాలిటీకి హీరామండి అని పెట్టారు.

మహరాజా రంజిత్ సింగ్ పాలనలో లాహోర్‌కు పునర్వైభవం వచ్చింది. ఈ ప్రాంతం మరోసారి రాజుల దర్పానికి కేంద్రంగా మారింది. 1849 మార్చ్‌లో ఈస్టిండియా కంపెనీ లాహోర్‌ను సొంతం చేసుకునే వరకు ఆ వైభవం కొనసాగింది.

బ్రిటిషర్ల పాలనలో హీరామండి

“బ్రిటిషర్లు అధికారం దక్కించుకున్న తర్వాత, తిరుగుబాటుకు అవకాశం ఉన్న అన్నింటినీ మూసివేశారు. వ్యభిచారం చేయాలనుకునే వారికి లైసెన్స్ తప్పనిసరి అనే నిబంధన తీసుకొచ్చారు” అని ప్రొఫెసర్ శర్మ చెప్పారు.

వేశ్యలకు లైసెన్సులు ఇచ్చే విధానం ప్రారంభం అయిన తర్వాత, అక్రమంగా వ్యభిచారం చేసే వారి మీద పోలీసులు దాడులు చెయ్యడం మొదలు పెట్టారు.

“బ్రిటిషర్ల పాలనా కాలంలో విచారణ పేరుతో పోలీసులు ఎప్పుడైనా ఆ ప్రాంతం మీద దాడి చేసేవారు” అని ప్రొఫెసర్ శర్మ చెప్పారు.

“దీంతో ఈ ప్రాంతానికి ఆదరణ తగ్గింది” అని ఆమె అన్నారు. పోలీసుల దాడులు చూసి హీరామండికి రావాలంటే ప్రజలు భయపడేవారు. దీంతో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య భారీగా పడిపోయింది. ఈ ప్రాంతంలో మార్పు మొదలైంది.

“ఈ మార్పు కారణంగా, వేశ్యల జీవితం మారిపోయింది. హీరామండిలో గౌరవంగా, సంపన్నులుగా బతికిన వేశ్యలు బ్రిటిషర్ల కాలంలో చరిత్ర పుటల్లోకి జారిపోయారు. ఈ ప్రాంతానికి వైభవం తగ్గి ఇది “ఒకప్పటి వేశ్యా వాటికగా” మిగిలిపోయింది.

సినిమాలు- హీరామండి

1913లో దాదా సాహెబ్ ఫాల్కే తొలి హిందూస్తానీ సినిమా తీశారు.

తొలినాళ్లలో, మహిళలు సినిమాల్లో నటించేవారు కాదు. దీంతో పురుషులే మహిళల మాదిరిగా మేకప్ వేసుకుని ఆ పాత్రలు చేసేవారు.

స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో తీసిన అనేక చిత్రాలలో నటించిన వారిలో హీరామండి నుంచి వచ్చినవారు చాలా మంది ఉన్నారు.

భారతదేశం విడిపోయిన తర్వాత హీరామండిలో నివశిస్తున్న అనేకమంది లాహోర్ వదిలేసి భారత్‌లోని ముంబయి చేరుకున్నారు. సినిమా పరిశ్రమ, ఇతర రంగాలలో పని చేశారు.

పాకిస్తానీ రచయిత ఫౌజియా సయీద్ తన పుస్తకంలో హీరామండి గురించి రాశారు.

ఆమె ఎనిమిదేళ్ల పాటు హీరామండిలో ఉండి పరిశోధన చేసి “ టబూ: ద హిడెన్ కల్చర్ ఆఫ్ ఎ రెడ్ లైట్ ఏరియా” పుస్తకం రాశారు.

ఈ ప్రాంతంలో నివశించిన అనేక మంది మహిళలు, ఇతరుల జీవితాల్లోని అనేక కోణాలను ఫౌజియా సయీద్ తన పుస్తకంలో వివరించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-05-04T01:30:13Z dg43tfdfdgfd