హైదరాబాద్‌లో రికార్డు విద్యుత్ వాడకం
హైదరాబాద్, వెలుగు: ఎండలు పెరుగుతుండడంతో కరెంట్ వాడకం కూడా పెరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో గురువారం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి విద్యుత్‌సరఫరా వ్యవస్థపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ లోపాలను సరిచేయడంతో ఈ సీజన్లో అంచనాలకు మించి విద్యుత్ వినియోగం నమోదైంది. రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా అధికారులు ఇబ్బందుల్లేకుండా కరెంటు సరఫరా చేశారు. హైదరాబాద్‌లో గతేడాది మే19న 3,756 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా ఈ ఏడాది ఏప్రిల్ 18న 4,053 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. 2022 మార్చితో పోల్చుకుంటే 2023లో డిమాండ్ కేవలం 2.5% పెరుగుదల ఉండగా 2024లో అది 20.04 శాతానికి పెరిగింది. విద్యుత్ సరఫరాలో మెరుగైన మెయింటెనెన్స్ చేపట్టడం వల్లే ఇది సాధ్యమైందని సదరన్ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఎక్కడ ఇబ్బంది ఏర్పడినా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
హైదరాబాద్‌లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 4 వేల మెగావాట్లను అధిగమించడంతో డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌తో గతంలో ఉన్న 3,756 మెగావాట్ల రికార్డు మైలురాయిని అధిగమించడం అభినందనీయమన్నారు. విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ అధికారులు అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేశారని చెప్పారు. అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ శాఖకు అభినందనలు తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-19T05:15:41Z dg43tfdfdgfd