హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. నగరానికి హైస్పీడ్ రైల్ కారిడార్, వందే భారత్ మెట్రో

హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ఇప్పటికే మెట్రో పరుగులు పెడుతోంది. దాంతో పాటు నగరం చుూట్టూ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది, ఔటర్ రింగ్ రైల్ ప్రతిపాదన కూడా ఉంది. తాజాగా మరో రెండు ప్రాజెక్టులు నగరానికి రానున్నాయి. హైదరాబాద్‌-ముంబయి మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ రాబోతుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక కామెంట్స్ చేశారు. ఓ ప్రముఖ తెలుగు దినపత్రికు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌ను అన్ని వైపులా స్పీడ్‌ కారిడార్లతో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

నగరంలోని అన్ని ప్రాంతాల వారికి సులభమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తేవడానికి ఎంఎంటీఎస్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తామన్నారు. ఇప్పటికే నగరం నుంచి వందే భారత్‌ ట్రైనులు పరుగులు పెడుతుండగా.. త్వరలో వందే భారత్ మెట్రోను కూడా తీసుకొస్తామని అన్నారు. తెలంగాణకు, దేశానికి హైదరాబాద్‌ నగరం ఒక గ్రోత్‌ సెంటర్‌ అని అన్నారు. హైదరాబాద్‌లో రద్దీని నివారించడానికి పలు రకాలుగా పని చేస్తున్నామని.. 6 ముఖ్యమైన జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని చెప్పారు.

తమ ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలా మద్దతు పలికిందని.. ఇక ముందూ కొనసాగిస్తుందని వెల్లడించారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ , కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ ఐఐటీలో మౌలిక వసతుల బలోపేతం, రామగుండంలో ఎరువుల కర్మాగారం, కాజీపేటలో వ్యాగన్ల తయారీ యూనిట్‌, ఎన్‌టీపీసీ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, వరంగల్‌లో పీఎం మిత్ర పార్కు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చశారు. రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కల్పించి ప్రపంచ పటంలో పెట్టిన ఘనత కూడా కేంద్రానిదే అన్నారు.

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపైనా కీలక కామెంట్స్ చేశారు. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఖరారు దగ్గరి నుంచి అధికారుల గుర్తింపు వరకూ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఈ పనులపై కొంత ప్రభావం పడిందని.. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే పనులు ప్రారంభిస్తామన్నారు. దేశంలో పసుపు రంగానికి ప్రోత్సాహం, అభివృద్ధికి ఈ బోర్డు దోహదం చేస్తుందన్నారు. పరిశోధన, మార్కెట్‌ సౌకర్యాల అభివృద్ధి, వినియోగం పెంపు, విలువ జోడింపు లాంటి అంశాలపై ఈ బోర్డు పని చేస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T02:09:43Z dg43tfdfdgfd