73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి..?

నిజాం జాగీర్దార్ , నవాబ్ ఫక్రుల్ ముల్క్ ఆస్తులను చట్టపరమైన వారసులకు పంచడంపై 73 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెలంగాణ హైకోర్టు తెరదించింది. '1951 CS9'గా పేర్కొన్న సివిల్ వివాదాన్ని తాజాగా పరిష్కరించింది. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఎర్రమంజిల్‌ భవనం, పక్కనే ఉన్న ప్రాంతం, ప్రభుత్వ టీబీ ఆస్పత్రి భవనంపై జాగీర్దార్ వారసుల వాదనలు చెల్లవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

అసలు వివాదం ఏంటంటే..1951లో నిజాం జాగీర్దార్‌గా ఉన్న నవాబ్ ఫక్రుల్ ముల్క్కు చెందిన వారసత్వ భూమి పంపిణీ వివాదంలో హైకోర్టుకు చేరింది. పిటిషన్ ప్రకారం.. నగరంలో ముల్క్‌కు చెందిన 9 ఆస్తులను ఆయన వారసులు ఐదుగురికి ఐదు భాగాలుగా పంచాలి. ఎర్రమంజిల్ భవనం, ఎర్రగడ్డ, బొల్లారం, బల్దా, బెహ్లూల్ఖాన్గూడ, యూసఫ్గూడ, మూసాపేటలలో ఈ ఆస్తులు ఉన్నాయి. ఆ భూముల పరిరక్షణతో పాటు విక్రయించి వాటాలు పంచడానికి గానూ ఇప్పటిదాకా 9 మంది రిసీవర్లు నియమితులయ్యారు. 1951 నుంచి ఒక్కో ఆస్తిని పంచే క్రమంలో తిరిగి వివాదాలు, కేసులు ఎదురయ్యాయి.

కొంత ఆస్తిని వారసులకు భాగ పంపిణీ చేయగా.. ప్రభుత్వం కూడా కొంత భూమిని సేకరించి పరిహారాన్ని ఇచ్చింది. ఆ పరిహారాన్ని కూడా వారసులకు పంచి ఇచ్చారు. ఆ క్రమంలోనే ఎర్రగడ్డలోని ఎర్రం నూమా బంగ్లాకు సంబంధించిన 59 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం టీబీ ఆసుపత్రిని నిర్మించింది. వారసుల మధ్య ఇంకా ఆస్తి పంపకం వ్యవహారం తేలకపోటవంతో 2022 నవంబరు 29న విశ్రాంత జిల్లా జడ్జి మహమ్మద్ నిజాముద్దీన్ను చివరి రిసీవర్ కమ్ కమిషనరుగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులను ఇచ్చింది.

ఆయన గతేడాది మార్చి 16న భూములకు సంబంధించిన తుది నివేదికను న్యాయస్థానానికి సమర్పించాడు. అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని హైకోర్టు బార్ అసోసియేషన్కు నోటీసు జారీ చేసింది. దీనిపై కొంత మంది అభ్యంతరాలు తెలిపారు. రిసీవర్ సమర్పించిన నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఆమోదం తెలిపింది. పంపిణీ చేయడానికి అమీర్పేటలోని శ్మశాన భూమి తప్ప ఇంకేమీ మిగలలేదని రిసీవర్ నివేదికలో పేర్కొన్నారు. అయినా భూములున్నాయని వాటి భాగ పంపిణీ కాలేదంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయటాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. నిర్దిష్ట వివరాలు సమర్పించకుండా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేమని చెప్పింది.

ఇన్నేళ్లు తర్వాత ఇప్పుడు కొత్త కారణాలతో ఇంకా భూమి పంపిణీ జరగాల్సి ఉందని ఎలా చెబుతారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ముల్క్ భూముల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము 2023 మార్చి 10 నాటికి రూ.1,19,81,249 హైకోర్టు వద్ద ఉన్నాయని, ఆ నగదును జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశించింది. వారి వాటాను క్లెయిం చేసుకోని వారసులు.. చెక్ పిటిషన్ దాఖలు చేసి సొమ్మును వడ్డీతో సహా తీసుకోవచ్చని తీర్పులో పేర్కొంది.

అమీర్పేటలో ఉన్న శ్మశానవాటికను కేంద్రం చారిత్రక ప్రదేశంగా గుర్తించిందని హైకోర్టు తెలిపింది. ముల్క్ వారసులు ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని దాన్ని పరిరక్షించాలని సూచించింది. అంతేగానీ స్థలం పంపకం జరగడానికి వీల్లేదని తీర్పును వెలువరించింది. ఇలా 73 ఏళ్లుగా వివాదంలో ఉన్న కేసును హైకోర్టు పరిష్కరించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-29T08:09:32Z dg43tfdfdgfd