ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు

Hyderabad Water Crisis: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతూ.. బయటికి రావాలంటేనే జంకే పరిస్థితి ఉంది. హైదారాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు కూడా వీస్తుండటంతో.. జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భానుడి ప్రతాపంతో జనాలు డీహైడ్రేట్ కావటంతో పాటు భూమిలోని నీరు కూడా ఆవిరైపోయింది. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోవటంతో.. రాష్ట్రంలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నీటి కొరత తీవ్రమైంది. రోజువారి అవసరాలకు కూడా నీళ్లు లేక.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

దీంతో.. నగరవాసులంతా ట్యాంకర్ల మీద ఆధారపడుతున్నారు. జీహెచ్ఎంసీకి చెందిన ట్యాంకర్లు సమయానికి అందకపోవటంతో.. ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇక.. ఇదే అదునుగా తీసుకుని ప్రైవేటు ట్యాంకర్లు డిమాండ్ పెంచేసి.. జనాల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇందంతా ఇలా ఉంటే.. ఈ నీటి కొరత సమస్య ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కూడా తాకింది. ఓయూలోని హాస్టళ్లలో నీళ్లు రాక.. విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వార్డెన్లకు చెప్పినా, ఇంకెవ్వరికి చెప్పినా పట్టించుకోవటం లేదని.. అమ్మాయిలంతా రోడ్డెక్కారు.

అమ్మాయిలన్నప్పుడు ఎన్నో సమస్యలుంటాయని.. కనీస అవసరాలకు కూడా నీళ్లు ఉండట్లేదని అమ్మాయిలు ఆగ్రహంతో ఊగిపోయారు. కనీస అవసరాలకే కాదు.. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని.. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా.. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా గాలికి వదిలేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుమారు వెయ్యి మంది ఉన్న హాస్టల్‌కు ఒక్క ట్యాంకర్ పంపించారని.. ఆ నీళ్లతో పూజ చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. ఒక్క ట్యాంకర్ నీళ్లు ఎంత మందికి సరిపెడతారంటూ నిలదీశారు.

అయితే.. అమ్మాయిలు రోడ్డు మీదికొచ్చి ఆందోళన చేస్తుండటంతో.. దిగొచ్చిన ఓయూ సిబ్బంది బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. కేవలం ఓయూలోనే కాదు.. నగరమంతా ఇలాంటి సమస్యే ఉందని.. ఇంకొన్ని ట్యాంకర్లు తెప్పిస్తామంటూ మాట ఇవ్వటంతో.. అమ్మాయిలు ఆందోళన విరమించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-28T15:06:42Z dg43tfdfdgfd