'కేసీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించటానికి కారణమదే'

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాకరేపుతోంది. ఈ అంశం చుట్టూనే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. అన్ని పార్టీలు ఫోన్ ట్యాపింగ్ అంశంపై తీవ్ర స్థాయిలో స్పందిస్తు్న్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, కీలక అధికారుల ఫోన్లు ట్యాప్ చేయించిందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ కీలక కామెంట్స్ చేశారు.

నియంతృత్వాన్ని పాటించే వాళ్లు నీడను కూడా నమ్మరని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్‌ కూడా ఎవరినీ నమ్మలేదని.. అందుకే రాజకీయ, కీలక అధికారులు, మీడియా ప్రముఖులపై ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారని ఆరోపించారు. కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని... రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో హార్డ్‌ డిస్కులు, సమాచారాన్ని ధ్వంసం చేశారన్నారు. రెండో, మూడో ఫోన్‌ ట్యాపింగ్‌లు జరిగితే జరగవచ్చునని స్వయంగా కేటీఆరే అంటున్నారని... దీనికి మూల కారకులు కేసీఆర్‌, కేటీఆర్ మాత్రమేనని చెప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించి సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో ఆ కుటుంబానికి ప్రమేయముందని అన్నారు. తెలంగాణ సంపదను దోచకున్న వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి శిక్ష విధించినా.. ఆ పార్టీ నేతలు అహంకారాన్ని మాత్రం వీడటం లేదని అన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ నుంచి కదలలేదని... సచివాలయానికి ఒక్కసారి కూడా వెళ్లలేదని ఆక్షేపించారు. గత ప్రభుత్వంలో ప్రతి పథకంలో స్కామ్‌లు చేసి.. కమీషన్లు తీసుకున్నారన్నారు. ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురి చేయటంతో పాటు నియంతృత్వ పోకడలు సాగించారని దుయ్యబట్టారు. కక్ష సాధింపులో భాగంగా పలువురిపై ఫోన్లు ట్యాపింగ్‌ చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. అసెంబ్లీ, ఉప ఎన్నికల సమయంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిచారని.. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరమని ఆయన ఆక్షేపించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T07:59:04Z dg43tfdfdgfd