జూన్ 9న జరిగేది అదే.. రాసిపెట్టుకోండి.. సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కాన్ఫిడెంట్‌గా చెప్పిన విషయాలన్ని అక్షరాల నిజమైన వేళ.. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన జోస్యం చెప్పుకొచ్చారు. మహబూబాబాద్ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 లోగా రైతులకు 2 లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ చేస్తామని హమీ ఇచ్చారు. రైతులకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఈ క్రమంలోనే.. జూన్‌ 9న రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ కాన్ఫిడెంట్‌గా తెలిపారు. అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని రేవంత్ రెడ్డి చాలా సార్లు ప్రకటించగా.. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ రావటం గురించి ఈ వ్యాఖ్యలు చేశారు.

మానుకోట కాంగ్రెస్ కంచుకోట అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పదేళ్లలో మహబూబాబాద్ ప్రాంతం మొత్తం విధ్వంసమైందని చెప్పుకొచ్చారు. మోదీ, ఫామ్ హౌస్ కేడీ ఇద్దరు కలిసి తెలంగాణను దోపిడీ చేశారని ఆరోపించారు. మోదీ తెచ్చిన చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారన్నారు. తండ్రి రెడ్యానాయక్‌ను ఇంటికి పంపినట్టే బిడ్డ మాలోతు కవితను కూడా ఇంటికి పంపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పక్కకు పెట్టారని.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ మంజూరు చేస్తే.. మోదీ లాథూర్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు. ములుగు గిరిజన యూనివర్సిటీని సోనియా గాంధే మంజూరు చేశారని వివరించారు. ఈ ప్రాంత ప్రజల్లో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్, బీజేపీకి లేదన్నారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోదీ తెలంగాణను అవమానపరిచారన్నారు. అప్పుడు పార్లమెంట్‌లో తానే ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు.

ఉత్తర భారతదేశంలోని కుంభమేళాకు వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం.. మేడారం జాతరకు మాత్రం కేవలం 3 కోట్లు ఇచ్చారని రేవంత్ రెడ్డి. మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వబోమని చెప్పిన బీజేపీ కిషన్ రెడ్డి.. ఓట్లు అడగడానికి సిగ్గు లేదా అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం తెలంగాణను కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి పదవుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వంద రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

"తెలంగాణ ద్రోహులకు ఒక్క ఓటు వేయొద్దు.. ఒక్క సీటు ఇవ్వొద్దు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియమ్మ. సోనియమ్మ బిడ్డను ప్రధాని చేసే బాధ్యత మనపై ఉంది. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నాడు. తెలంగాణ నుంచి 14 ఎంపీలను గెలిపించి సోనియమ్మకు కానుకగా ఇద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-19T17:22:45Z dg43tfdfdgfd