తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి MLC అభ్యర్థిగా ప్రకటన

తీన్మార్‌ మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ కుమార్‌కు కాంగ్రెస్ బంపరాఫర్ ఇచ్చింది. ఆయన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల స్థానానికి అభ్యర్థిగా మలన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది ఈ మేరకు బుధవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. ఇక్కడ ఎమ్మెల్సీగా గెలుపొందిన ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి ఎమ్మెల్సీ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన మలన్న రెండో స్థానంలో నిలిచారు.

2021 మార్చిలో నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది. అయితే గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి డిసెంబరు 9న రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికల అనివార్యం కాగా.. త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పేరును ప్రకటించింది.

కాగా, తీన్మార్ మల్లన్న కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపిస్తున్నారు. గత ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2021లో ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఆయనపై కేసులు నమోదు కాగా.. జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన మలన్న.. అక్కడ కొద్ది కాలమే ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు వినిపించింది. మలన్న వైపు కాంగ్రెస్ మెుగ్గు చూపుతుందనే వార్తలు వచ్చాయి. అయితే అనుహ్యంగా అక్కడ వెలిచాల రాజేందర్ రావును అదిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మలన్నను నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం నుంచి ఎమ్మెల్సీగా బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధిష్టానం ప్రకటన చేసింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T02:52:49Z dg43tfdfdgfd