తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది.. అయ్యో పాపం

తెలంగాణలో ఎండలు ముదిరిపోవడంతో వైన్ షాపుల్లో బీర్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఎండల నుంచి ఉపశమనం కోసం మందుబాబులు బీర్లను తెగ కొనేస్తున్నారు. ప్రభుత్వం కూడా డిమాండ్ తగినట్లుగా స్టాక్ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అయితే కొన్నిచోట్ల వైన్ షాపుల యజమానులు వాటిని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్టాక్‌ను బెల్టు షాపులకు తరలించి వైన్ షాపుల్లో నో స్టాక్ అంటూ బోర్డులు పెడుతున్నారు. దీంతో చిర్రెత్తుకొస్తోన్న మందుబాబులు వైన్‌షాప్ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో జరిగింది.

పెద్దవంగరలోని మహేశ్వరి వైన్‌షాపునకు కస్టమర్లు ఒక్కసారిగా పోటెత్తారు. అందరూ బీర్ల కోసం పోటీపడటంతో షాపు సిబ్బంది స్టాక్ లేదని చెప్పేశారు. దీంతో వారంతా వైన్ షాపు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతూ ఒకరినొకరు తోసుకుని కింద పడిపోయారు. ఈ ఘటనలో యాకయ్య అనే వ్యక్తికి బీరు సీసా ముక్కలు గుచ్చుకుని కాలికి గాయమైంది. అయితే వైన్ షాపు యాజమాన్యం బీర్లను అధిక ధరలకు అమ్ముకునేందుకు స్టాక్ దాచేసిందని మందుబాబులు ఆరోపిస్తున్నారు.

ఎలక్షన్ కోడ్ ఉండటంతో పోలీసులు బెల్టు షాపులు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలిచ్చినా గుట్టుగా కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు మందుబాబులు. బెల్టు షాపుల్లో అధిక ధరలకు అమ్ముకోవాలన్న దురుద్దేశంతోనే బీర్లు స్టాక్ లేవని చెబుతున్నారంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న షాపులపై చర్యలు తీసుకోవాలని మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-28T06:35:18Z dg43tfdfdgfd