నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి..!

తెలంగాణ నిప్పుల కుంపటిగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు దంచికొడుతున్నాయి. మే నెల మెుదటి వారంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. భానుడి భగభగలకు తోడు తీవ్ర వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలోనైతే ప్రధాన పట్టణాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడదెబ్బతో పిట్టల్లా రాలిపోతున్నారు. శనివారం ఒక్కరోజే వడదెబ్బతో తెలంగాణ వ్యాప్తంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారంటే.. ఎండ తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

శనివారం జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లిపూర్‌, ధర్మపురి మండలం జైన, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో రికార్డు స్థాయిలో 46.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 46.7 డిగ్రీలు, నిజామాబాద్‌ జిల్లా జాకోరా, నారాయణపేట జిల్లా ఊట్కూరులో 46.4 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రం, మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండల కేంద్రంలో 46.3 డిగ్రీలు, నల్గొండ జిల్లా బుగ్గబావిగడ్డలో 46.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

ఎండ వేడి, వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రతతో గాలిలో తేమ శాతం ఆవిరైపోతోందని వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. తేమ శాతం ఆవిరైపోవటం వల్ల వాతావరణం పొడిబారి వేడి అధికంగా ఉంటోందన్నారు. నేటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఎండకు బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసకోవాలని.. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T03:01:39Z dg43tfdfdgfd