ప్రధాని మోదీ కర్ణాటక ప్రజలను పాపాత్ములు అన్నారా..? వైరల్ వీడియోలో నిజమెంత..?

ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యుహాలు రచిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఈసారి తమకు 400 సీట్లు పక్కా అని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో వ్యాఖ్యనించారు. పదేళ్ల మోదీ పాలనకు చరమగీతం పాడతామని ఈసారి విజయం తమదేనని ఇండియా కూటమి అంటోంది. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో పలు తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేతల కామెంట్లను వక్రీకరిస్తూ వైరల్ చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన స్పీచ్ వైరల్ అవుతోంది.

క్లెయిమ్ ఏంటి..?

కర్నాటక ప్రజలను 'పాపాత్ములు' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో క్లిప్‌లో.. 'యే కర్ణాటక వాలోన్ నే జో పాప్ కియా హై, ఉస్కీ సాజా ఈజ్ చునవ్ మే దీజియే ఔర్ మోదీ ఆనేవాలే వర్సో మే భీ ఆప్కో గ్యారెంటీ దేతా హై' అంటూ మాట్లాడారు. ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పలువురు నెటిజన్లు.. 'మోదీ అహంకారంతో మాట్లాడుతున్నారు. కర్ణాటక ప్రజలను పాపులు అంటున్నారు. ఇలాంటి అవమానాలకు కర్ణాటక గట్టి ఝలక్ ఇచ్చింది. అందుకే బీజేపీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది' అని రాసుకొచ్చారు.

అసలు నిజం ఏంటి..?

అయితే వైరల్ అవుతోన్న వైరల్ వీడియో తప్పుదోవ పట్టించేదిగా మేం గుర్తించాం. ఆ వీడియోపై ఫ్యాక్ట్ చెక్ చేయగా.. అది తప్పుదారి పట్టిస్తుందని తేలింది. ప్రధాని మోదీ ఆ వీడియోలో కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. కర్ణాటక ప్రజలను కాదు.

నిజనిర్ధరణ జరిగిందిలా..

మేం యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చ్ చేసి అసలు వీడియో గుర్తించాం. YOYO TV కన్నడలో 28 ఏప్రిల్ 2024న అప్‌లోడ్ చేయబడిన ఒక వీడియోను చూశాం. టైమ్‌ స్టాప్ 20:53 నుంచి వీడియోను ఫ్లే చేస్తే.. 'కాంగ్రెస్ పార్టీ రైతులకు ద్రోహం చేసిన పాపి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.4000 ఇవ్వడం మానేశారు. ఓట్లు పడ్డాయి కాబట్టి ఇప్పుడు రైతులతో ఒరిగేదేమీ లేదు. మోదీ అందించే రూ.6000 మాత్రమే రైతులు పొందుతున్నారు. మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద డబ్బు పొందుతున్నారు, చింతించకండి.. గత ఎన్నికల్లో చేసిన తప్పుకు ఈ ఎన్నికల్లో తగిన శిక్ష వేయండి. కేంద్రం నుంచి పంపే డబ్బు రాబోయే సంవత్సరాల్లో కూడా కొనసాగుతుంది. ఇది మోదీ మీకు ఇస్తున్న హామీ' అని ప్రసంగించారు.

అందువల్ల వైరల్ వీడియో తప్పుదోవ పట్టించేదిగా మేం కనుగొన్నాం. ప్రధాని మోదీ 'కర్ణాటక వాలోన్' అని చెప్పడం ద్వారా కర్నాటక ప్రజలను ఉద్దేశించి ప్రస్తావించలేదని.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారని స్పష్టమైంది. అందువల్ల వైరల్ వీడియో ఎడిట్ చేయబడినదిగా.. తప్పుదోవ పట్టించేదిగా నిర్ధారించబడింది.

తీర్పు..

కర్ణాటక ప్రజలు పాపం చేశారని ప్రధాని మోదీ అనలేదు. 'కర్ణాటక వాలోన్' అనే పదం ద్వారా అతను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఎడిట్ చేయబడిన వీడియోను షేర్ చేస్తూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వైరల్ వీడియో తప్పుదోవ పట్టించేదిగా గుర్తించాం.

(This Story was Originally Fact Checked By fact crescendo And Translated & Edited by Samayam Telugu, As Part of The Shakti Collective)

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T08:13:45Z dg43tfdfdgfd