ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనం.. దేశంలోనే తొలిసారిగా ఆ కేసు నమోదు

తెలంగాణ రాజకీయాల్లో కలవరం సృష్టిస్తో్న్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు అరెస్టు కాగా.. వాళ్ల విచారణలో విస్తుపోయే విషయాలు బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా.. ఇందులో ముందుగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ కాగా.. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను విచారించిన పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లిద్దరినీ 5 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. ఇక.. ఈ వ్యవహారంలో కీలకంగా మారిన.. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కూడా పోలీసులు నిన్న 10 గంటల పాటు విచారించి అనంతరం అరెస్ట్ చేశారు. రాధాకిషన్ రావుతో పాటు ఇన్స్‌పెక్టర్ గట్టుమల్లును కూడా విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది.

వీళ్లందరి దగ్గరి నుంచి రాబట్టిన ఆధారాలతో.. పోలీసులు అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కేసును నమోదు చేశారు. ఈ కేసుకు టెలిగ్రాఫ్ యాక్టును జత చేస్తూ మెమో కూడా దాఖలు చేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో ఈ మెమోను పోలీసులు దాఖలు చేశారు. అయితే.. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయటం దేశంలోనే ఇదే తొలిసారి కావటం గమనార్హం. టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 1885 కింద ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేయటంతో.. ఫోన్ ట్యాపింగ్ కేసులో తర్వాత ఏం జరగబోతోందన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద పెద్ద అధికారులతో పాటు కీలక నేతలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఇంటెలీజెన్స్ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించారని.. ఇంకో బీఆర్ఎస్ సీనియర్ నేత కూడా ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. మరోవైపు.. ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపార వేత్తల ఫోన్లతో పాటు సినిమా వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. మరి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు.. ఎంత మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయన్నది పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T13:31:56Z dg43tfdfdgfd