రైతు బంధు పంపిణీ నిలిపివేత.. బ్యాంక్ ఖాతాల్లో పడతాయనుకుంటే ట్విస్టు

లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) దగ్గరపడుతున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. రైతు భరోసా నిధుల (Rythu Bharosa Funds) విడుదలపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ (Polling Day) ముగిసిన తర్వాతే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని.. అప్పటివరకు రైతు భరోసాను ఆపేయాలని రేవంత్ రెడ్డి సర్కారును ఆదేశించింది. రైతు భరోసా విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఎన్‌ వేణుకుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ సీఎం రేవంత్‌ రెడ్డి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. గత గణాంకాల ప్రకారం రబీ నిధులు జనవరి నాటికే రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉందని ఈసీ అభిప్రాయపడింది.

మరోవైపు.. ఐదు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ కూడా చేపట్టింది. ఇందుకోసం.. 2 వేల కోట్లకు పైగా నిధులు సమీకరించి.. విడుదల చేసినట్టు పేర్కొంది. అంతేకాదు.. ఈ ప్రక్రియ 3 రోజుల్లోనే పూర్తవుతుందని కూడా అధికారులు భావించారు. కాగా.. ప్రస్తుతం ఈసీ ఇచ్చిన ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది.

అయితే.. రైతులకు పెట్టుబడి సాయం విషయంలో ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మే 9వ తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా నిధువు విడుదల చేస్తామంటూ పలు ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటాన్ని కోడ్ ఉల్లంఘనగా భావించిన ఈసీ.. కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T11:30:06Z dg43tfdfdgfd