రైతులకు గుడ్ న్యూస్.. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

తెలంగాణలో మాడు పగిలేలా తీవ్రమైన ఎండలు కొడుతున్నాయని జనాలు బెంబేలెత్తిపోతున్న సమయంలో.. ఒక్కసారిగా వాతావరణణ మారిపోయి రాకాసిగాలులతో కుండపోతగా అకాల వర్షాలు కురిశాయి. ఈ అకాల వర్షాల వల్ల అన్ని వర్గాల ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నా.. రైతులకు ఆందోళన మిగిల్చాయి. ఇప్పటికే కోతలు పూర్తయి.. ధాన్యాన్ని కల్లాల్లో పోసుకుని ఎప్పుడెప్పుడు కొంటారా అని రైతులు ఎదురుచూస్తున్న సమయంలో ఇలా అకాల వర్షాలు కురియటంతో.. చాలా వరకు ధాన్యం తడిసిపోయింది. ఒక్కసారిగా వర్షం కురియటం వల్ల ధాన్యం తడవకుండా ఉండేందుకు అన్నదాతలు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. కొందరు తీసుకున్నప్పటికీ.. భారీ స్థాయిలో వర్షం కురియటంతో చాలా వరకు ధాన్యం నీటిలో ముగిపోయింది.. కొన్నిచోట్ల కొట్టుకుపోయింది కూడా. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే.. సరిగ్గా అమ్ముకునే సమయంలోనే ఇలా జరిగిందన్న బాధతో రైతులు దిగులు చెందుతున్నారు.

ఇలా.. దిగాలు పడిపోయిన అన్నదాతలకు ఊతం ఇచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. ఖమ్మంలో కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించిన తమ్మల నాగేశ్వర రావు.. రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. అకాల వర్షాలకు రైతులెవరూ అధైర్యపడవద్దని.. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వమని.. అన్నివేళలా రైతులకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15 వేలు అందిస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చినట్లుగా ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి తుమ్మల స్పష్టం చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T14:44:00Z dg43tfdfdgfd