హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం

ఎండలు ముదురుతుండటంతో హైదరాబాద్ నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోతను తట్టుకోలేకపోతున్న నగర ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వేసుకుంటున్నారు. వాటిని మధ్యమధ్యలో ఆపుతూ.., వేస్తూ ఉండటంతో కరెంట్ వినియోగంలో హెచ్చుతగ్గులతో గ్రిడ్‌ను నిర్వహించడం విద్యుత్ శాఖ అధికారులకు సవాల్‌గా మారింది.

ఓవర్‌లోడ్‌ కారణంగా నగరంలోని కొన్నిచోట్ల, ఇతరత్రా కారణాలతో పలు ప్రాంతాల్లో రోజుకు మూడు నుంచి ఏడెనిమిదిసార్లు కరెంట్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని విద్యుత్ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. కరెంట్‌ వెంటనే వస్తున్నా.. ఎక్కువసార్లు ట్రిప్పింగ్‌తో వినియోగదారులకు చికాకులు తెప్పిస్తోంది. గతంతో పోలిస్తే సరఫరా వ్యవస్థ మెరుగైనా.. ఇలాంటి సమస్యలపై ఫిర్యాదులు డిస్కంకు ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, అగ్నిమాపక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ తరహా.. నిరంతర విద్యుత్ సరఫరాకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ట్విటర్‌లో వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించేలా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని ఒక విభాగం పనిచేస్తోంది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ.. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కరెంట్‌ను పునరిద్ధరిస్తోంది. వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాపై నిరంతరం నిఘా ఉంచారు.

ప్రస్తుతం విద్యుత్ వినియోగం 90 మిలియన్‌ యూనిట్లు దాటి వంద మిలియన్ యూనిట్ల దిశగా పరుగులు తీస్తుంది. దీంతో డిస్కం యాజమాన్యం మరింత అప్రమత్తమైంది. ఎండల తీవత్ర మరింతగా కొనసాగే అవకాశం ఉండటంతో మొత్తం విద్యుత్తు సిబ్బందిని డిస్కం రంగంలోకి దించింది. ప్రతి 11కేవీ ఫీడర్‌కు షిఫ్ట్‌లవారీగా ఒక ఇంజినీర్‌ను ఇంఛార్జ్‌గా నియమించారు. కరెంట్‌ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విధి నిర్వాహణలో ఇంజినీర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్‌ చేసేందుకూ సీఎండీ వెనకాడటం లేదు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T03:53:54Z dg43tfdfdgfd