అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ అంతర్జాతీయ వ్యవహారంగా మారుతోందా... అమెరికా ఎందుకు ఈ విషయంలో మళ్ళీ జోక్యం చేసుకుంది?

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం అంతర్జాతీయంగా మారుతోంది.

కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మొదట జర్మనీ, ఆ తర్వాత అమెరికా వ్యాఖ్యలు చేసింది.

ఈ వ్యాఖ్యల తర్వాత భారత్ ఇరు దేశాల దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం తమ అంతర్గత అంశమని అందులో పేర్కొంది.

తమ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేయడం గురించి తాజాగా అమెరికా స్పందించింది.

చట్టపరమైన ప్రక్రియలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా, సకాలంలో పూర్తి చేయడానికి తాము మద్దతు ఇస్తామని, దీనిపై ఎవరికీ అభ్యంతరాలు ఉంటాయని తాము భావించడం లేదని బుధవారం అమెరికా చెప్పింది.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారంతో సహా ఇలాంటి చర్యలను తాము నిశితంగా పరిశీలిస్తూనే ఉంటామని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పారు.

మాథ్యూ మిల్లర్‌ను విదేశీ మంత్రిత్వ శాఖ విలేఖరుల సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యల దృష్ట్యా భారత్‌లో ఉన్న అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బార్బెనాకు సమన్లు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం గురించి ప్రశ్నలు అడిగారు.

దిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.

అమెరికా ఏం చెప్పింది?

‘‘ఆదాయ పన్ను శాఖ తమ బ్యాంకు ఖాతాలను కొన్నింటిని ఫ్రీజ్ చేసిందని, దీనివల్ల రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేయడం సవాలుగా మారిందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు కూడా మా దృష్టికి వచ్చాయి. ఇందులోని ప్రతీ అంశం గురించి నిష్పాక్షికంగా, పారదర్శకంగా, సకాలంలో చట్టపరమైన ప్రక్రియల్ని మేం ప్రోత్సహిస్తాం’’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు.

దాదాపు 14 లక్షల రూపాయలకు సంబంధించిన పన్ను బకాయిలకు సంబంధించిన ఒక కేసులో పార్టీకి చెందిన రూ. 285 కోట్ల నిధులను స్తంభింపచేసినట్లు గత వారం సోనియా గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

అమెరికా దౌత్యవేత్త గ్లోరియా బార్బెనాకు భారత్ సమన్లు జారీ చేయడం గురించి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ, ‘‘నేను ఏ రకమైన ప్రైవేట్ దౌత్య చర్చల గురించి ఇక్కడ ఏమీ చెప్పబోవడం లేదు. కానీ, బహిరంగంగా చెప్పిన మాటలను ఇక్కడ ప్రస్తావిస్తాను. మేం నిష్పాక్షికంగా, పారదర్శకంగా, సకాలంలో చట్టపరమైన ప్రక్రియల్ని ప్రోత్సహిస్తాం. ఈ అంశంపై ఎవరికీ అభ్యంతరాలు ఉంటాయని మేం అనుకోవట్లేదు. ఇదే మాటను మేం వ్యక్తిగతంగా కూడా స్పష్టం చేస్తాం’’ అని అన్నారు.

https://twitter.com/ANI/status/1773042904342364399

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం గురించి అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త గ్లోరియా బార్బెనాకు భారత్ బుధవారం సమన్లు జారీ చేసి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. గంటకు పైగా ఈ మీటింగ్ జరిగింది.

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ గురించి జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిని ప్రశ్నించగా ఆయన వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

‘‘మేం దీనిపై ఇప్పటికే స్పందించాం. రెండు దేశాల మధ్య జరిగిన వ్యక్తిగత చర్చలను నేను బయటకు చెప్పలేను. ప్రభుత్వాల స్థాయిలో చర్చించడానికి ఇరుదేశాలు సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది ఈ చర్చలు జరుగుతాయి. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ఒక వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌తో మేం ఈ విలువలకు కట్టుబడి ఉంటాం’’ అని జర్మనీ విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు.

భారత్ ఏం చెప్పింది?

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా వ్యాఖ్యలపై ఒక ప్రకటన జారీ చేసింది.

‘‘భారత్‌లోని కొన్ని చట్టపరమైన ప్రక్రియలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దౌత్యనీతిలో ఒక దేశం మరో దేశ సార్వభౌమత్వం, అంతర్గత వ్యవహారాలను గౌరవించడం అవసరం. ఒక ప్రజాస్వామ్య దేశం నుంచి ఈ విలువను మరింత ఎక్కువగా ఆశిస్తాం. భారత చట్ట ప్రక్రియలు ఒక స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. ఈ న్యాయవ్యవస్థ సకాలంలో నిర్ణయాలు అందించేందుకు కట్టుబడి ఉంటుంది. దాన్ని ప్రశ్నించడం అన్యాయం’’ అని అన్నారు.

నిజానికి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంలో నిష్పాక్షిక, పారదర్శక, సకాలంలో చట్టపరమైన ప్రక్రియను ఆశిస్తున్నామని అన్నారు.

కేజ్రీవాల్ గురించి జర్మనీ ఏమంది?

దీనికంటే ముందు జర్మనీ కూడా దిల్లీ ముఖ్యమంత్రి విషయంలో నిష్పాక్షిక విచారణ చేపట్టాలని కోరింది.

జర్మనీ ఎంబసీ డిప్యూటీ చీఫ్ జార్జ్ ఎంజ్వీలర్‌కు సమన్లు జారీ చేసిన భారత్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మీద జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధికి ఒక ప్రశ్న ఎదురైంది. ఎన్నికలకు ముందు భారత విపక్షంలోని అగ్రనేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఎలా చూస్తారని ఆయనను అడిగారు.

ఈ ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. ‘‘మాకు ఈ విషయం తెలుసు. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. స్వతంత్ర న్యాయవ్యవస్థకు ఉండే ప్రమాణాలు, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలను ఈ కేసుకు కూడా వర్తింపచేస్తారని మేం ఆశిస్తున్నాం.

అభియోగాలు ఎదుర్కొనే ప్రతీ ఒక్కరి తరహాలోనే కేజ్రీవాల్ కూడా నిష్పాక్షిక విచారణ పొందడానికి అర్హుడు. ఎలాంటి అడ్డంకులు లేకుండా అందుబాటులో ఉన్న అన్ని చట్టపర మార్గాలను ఆయన ఉపయోగించుకోగలగాలి’’ అని జార్జ్ అన్నారు.

జార్జ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇలాంటి వ్యాఖ్యలను భారత న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడం, మా న్యాయవ్యవస్థ స్వతంత్రతను బలహీనపరిచే చర్యగా పరిగణిస్తామని అందులో పేర్కొంది.

‘‘భారత్ చట్టాన్ని అనుసరించే ఒక బలమైన ప్రజాస్వామ్య దేశం. భారత్, ఇతర ప్రజాస్వామ్య దేశాల్లోని అన్ని చట్టపరమైన అంశాల మాదిరిగానే ఈ కేసులో కూడా చట్టం తన పని చేసుకుపోతుంది. ఈ విషయంలో చేసిన పక్షపాత వ్యాఖ్యలన్నీ చాలా అన్యాయమైనవి’’ అని అన్నారు.

ఇప్పడు, జర్మనీ తన వైఖరిలో కాస్త వెనక్కి తగ్గింది. బుధవారం జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, భారత్‌తో పరస్పర సహకారంతో పనిచేసేందుకు జర్మనీ ఆసక్తిగా ఉందని అన్నారు.

నిపుణులు ఏమంటున్నారు?

అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై అమెరికా వైఖరి అనవసరమైనదని భారత్‌లోని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి, తుర్కియే, ఫ్రాన్స్, రష్యా సహా అనేక దేశాల్లో భారత అంబాసిడర్‌గా వ్యవహరించిన కన్వాల్ సిబాల్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

జర్మనీ ప్రకటన తర్వాత భారత్ అభ్యంతరం వ్యక్తం చేశాక కూడా అమెరికా ఈ విషయమ్మీద వ్యాఖ్యానించిందని ఆయన అన్నారు.

సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా రాశారు. ‘‘కేజ్రీవాల్ వ్యవహారంలో అమెరికా ప్రకటన సరికాదు. జర్మనీ కవ్వింపు చర్యలపై భారత్ ఘాటుగా స్పందించిన తర్వాత కూడా అమెరికా ఈ విషయంలో వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారత్ స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే, భారత్ అలా చేయకపోతే అమెరికా, జర్మనీ పట్ల భారత్ విభిన్న వైఖరి అవలంభిస్తున్నట్లు అవుతుంది. భారత విదేశాంగ శాఖ చాలా కఠినమైన పదాలతో సమాధానం ఇచ్చింది’’ అని ట్వీట్ చేశారు.

గ్లోబల్ సౌత్ పట్ల దూకుడు, డిమాండ్ ప్రవర్తనను ఎలా అనుసరించకూడదో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీమ్ ఇంకా నేర్చుకోలేదని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలానీ అన్నారు.

‘‘ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో తాజా వివాదం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. యుక్రెయిన్ యుద్ధం పట్ల ఏదో ఒక పక్షంలో చేరకపోతే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని 2022లో భారత్‌ను అమెరికా హెచ్చరించింది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?

సీఎం కేజ్రీవాల్‌ను న్యూదిల్లీలోని తన ఇంటి నుంచి గత గురువారం ఈడీ అరెస్ట్ చేసింది. దిల్లీ మద్యం కేసు కుంభకోణంలో ఆయనకు ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.

దిల్లీ మద్యం కుంభకోణంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారు అని శుక్రవారం ఈడీ చెప్పింది.

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్ అయినట్లు వార్తాసంస్థ పీటీఐ పేర్కొంది.

కేజ్రీవాల్‌కు ఈడీ ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు.

దిల్లీ మద్యం స్కామ్‌లోనే దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి:

సంబంధిత కథనాలు

2024-03-28T15:07:51Z dg43tfdfdgfd